Sunday, July 29, 2012


BOOK REVIEW

ఒక తరం ఆత్మకథ

http://www.andhrajyothy.com/i/2012/feb/12-2sun47.jpgభారతీయతను అపారంగాప్రేమించిన ప్రవాస భారతీయునిగా, తను ఏ దేశమేగినా తెలుగు భాషనీ, సంస్కృతినీఎలుగెత్తి చాటిన ప్రవాసాంధ్రునిగా, గ్రామీణ నేపథ్యం నుండి అంతర్జాతీయ స్థాయికిఎదిగిన ఉన్నత విద్యావంతునిగా, సేవాదృక్పథం కలిగిన వైద్యునిగా, ముఖ్యంగాసంస్కారవంతుడైన మనిషిగా తన జీవితానుభవాలను డా. కృష్ణ ఈ ఆత్మకథలో నమోదుచేసుకున్నారు. ఉత్తరాంధ్రలోని ఒక బ్రాహ్మణ అగ్రహారంలో, ఒక సంపన్న కుటుంబంలో పుట్టినఈ రచయిత, ఒక తరం అనుభవాలనూ, ఆలోచనలనూ పోగుచేసి సమగ్రంగా నేటి పాఠకులకు అందించారు.అగ్రహార బ్రాహ్మణులు తమ భూముల్ని పోగొట్టుకున్నాక, వారికి చదువే సర్వస్వం అయింది; ఉద్యోగాలే ఉపాధి మార్గాలయ్యాయి. సమిష్టి కుటుంబం ప్రసాదించే భద్రత చెదిరిపోయింది. ఈసంఘటనల్లో, అనుభవాల్లో ప్రాంతీయ, సామాజిక, చారిత్రక నిర్దిష్టతతోబాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు, నిజానికి దేశంలోని అనేక సందర్భాలకూ వర్తించగల అంశాలుమెండుగా ఉన్నాయి. అందుకే ఈ ఆత్మకథ ఒక తరం కథ కూడా.

వేగంగా మారుతోన్న కాలంలోగతకాలపు సాంప్రదాయాల్నీ, ఆచారాలనీ ఎంతవరకు పాటించాలి? వేటిని విడిచి పెట్టాలి? అలాగే ఆధునికతవైపు సాగే ప్రయాణంలో ఏయే కొత్త ఆలోచనల్నీ, ఆచరణనీ స్వీకరించాలి? వేటిని దూరంగా ఉంచాలి? అన్ని తరాల వారూ ఎదుర్కొనే ఈ సవాళ్లను డా. మురళీమోహన్కృష్ణగారి తరం మనంత తీవ్ర స్థాయిలోనేఎదుర్కొన్నది. ఎందుకంటే - అంతవరకూ స్తబ్ధంగాఉండిన గ్రామీణ వ్యవసాయక వ్యవస్థ, వారి కాలంలోనే మొదటిసారిగా బీటలు వేయనారంభించింది.ఒకవైపు ప్రశ్నలు లేవనెత్తేవారూ, నాస్తికులూ, సోషలిస్టులూ, కమ్యూనిస్టులూఆవిర్భవించారు; మరోవైపు అతి ఛాందసవాదులూ, మతవాదులూ పుంజుకున్నారు. తన వ్యక్తిగతఅనుభవాల పరిధిలోనే ఈ రెండు ధోరణుల్నీ రచయిత నమోదు చేస్తాడు. వీటికి ప్రత్యామ్నాయంగాఒక సువిశాలమైన సార్వజనీన మానవత్వాన్నీ, మధ్యే మార్గాన్నీ ప్రతిపాదిస్తాడు -రేఖామాత్రంగా నైనా.


ఎంగిలి మెతుకులు ఏరుకు తింటున్న కుర్రవాడికి తనకారియర్‌ని విప్పి భోజనం పెట్టిన సహృదయుడు ఈ రచయిత. అప్పట్లో బ్రాహ్మణ వితంతువులుగురి చేయబడ్డ రాక్షసత్వానికి చలించిపోతాడు. విదేశాల్లో తాను స్వయంగా ఎదుర్కొన్నవర్ణ వివక్ష ఆధారంగా మన కుల వ్యవస్థ ఎంత దారుణమైనదో ఊహించే ప్రయత్నం చేస్తాడు.దళితులు బౌద్ధాన్ని ఆశ్రయిస్తే వారి దుస్థితి కొంతైనా మెరుగవుతుందేమోననిభావిస్తాడు.

ఆత్మకథల్లో పంటికింద రాళ్లలా దొర్లే స్వంత గొప్పలు, ఇతర్లనికించపరచడాలూ ఈ రచనలో కానరావు. నిజానికి తన పాత్రని తక్కువగానూ, ఇతరులభాగస్వామ్యాన్ని ఎక్కువగానూ అంచనా వేయగల వినమ్రత ఇందులో అడుగడుగునా కనిపిస్తుంది.అందువల్లనే డా. కృష్ణ తను పనిచేసిన చోటల్లాప్రవాసాంధ్రుల్నీ, భారతీయుల్నీ, తోటిడాక్టర్లనీ కూడగట్టుకొని మంచి పనులు చెయ్యగలిగారనిపిస్తుంది.

ఈ రచన ఒక సుదీర్ఘమైనమోనోలాగ్‌లా కాకుండా సంభాషణలే ప్రధానంగా, రసవత్తరంగా సాగుతుంది. రచయితతల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు - వీరంతా సజీవమైనవ్యక్తులుగా మన కళ్లముందు మెదులుతారు. వర్తమానాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తునితీర్చి దిద్దుకోవాలనుకుంటే గతాన్ని తెలుసుకోవడం తప్పనిసరి. అందుకుగాను ఇటువంటిరచనలు ఉపయోగపడతాయి. నాటి అన్వేషణ నేటికీ కొనసాగుతున్నది మరి.
- ఉణుదుర్తిసుధాకర్

నేలా నింగీ నేనూ
ఓ ఎన్.ఆర్.ఐ. ఆత్మకథ (1972-2005)
రచన:డా. ప్రయాగ మురళీ మోహన్ కృష్ణ
పేజీలు: 494, వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్: 0866- 2436643, 6460633