Sunday, May 31, 2015



మూడు కోణాలు 
ఉణుదుర్తి సుధాకర్
మిలటరీ బూట్లు, మోకాళ్ళ వరకూ మేజోళ్ళు, ఖాకీ నిక్కరూ, అప్పటికే చెమటకి తడిసిన తెల్లచొక్కాతో వంగి గుడారంలోకి దూరిన ఆరడుగుల క్లార్క్సన్ దొర, తలమీది టోపీని రాటకి ఉన్న మేకుకి తగిలించి అక్కడ ఉన్న ఒకేఒక కుర్చీమీదనిటారుగాకూర్చున్నాడు.నేలమీదున్నచినీళ్ళకూజానిఎత్తి వంచుకొని గడగడా తాగాడు.కూజాని కిందపెట్టిరుమాలుతో మొహంతుడుచుకొఎదురుగాటేబిల్మీదఉన్న రిజిస్టర్నిముందుకిలాక్కున్నాడు.ఆనాడురామయ్యపంతులుమేలుప్రతిలోకిఎక్కించినరీడింగ్స్ నిచిత్తుప్రతితోసరిచూస్తూ పెన్సిల్ తోటిక్కులుపెట్టడంమొదలుపెట్టాడు. చేతులు కట్టుకొనిపక్కనేనిలబడ్డ రామయ్య ఊపిరి బిగపట్టిఎండకిఎర్రబడ్డదొర మొహంలోకి ఆత్రుతగా చూస్తున్నాడు. అన్నచోట్లా టిక్కులు పడితేఆరోజుకి గండం గడిచినట్టే.ఒక చిన్న తప్పు దొర్లినాచివాట్లు తప్పవు.పెన్సిలు ముందుకికదులుతోంది; టిక్కులు పడుతున్నాయి.సరిచూడడం ముగించి, "వెల్ డన్, రామయ్యా" అన్నాడు దొర. దొరకి కోపం వస్తే, "రామయ్యా"అనడు;"వాటీస్దిస్,మిస్టర్పంతులూ?"అంటాడు. 

"హమ్మయ్య" అనుకుంటూ ఊపిరి పీల్చుకున్న రామయ్య పంతులు, "థాంక్ యు సర్" అన్నాడు.
మలేరియా బారినపడి మధ్యలో వెళ్ళిపోయిన మెక్ఫర్సన్ దొరయితే అన్నీ బాగున్నా "వెల్ డన్" అని చచ్చినా అనడు. "హుం..." అని హుంకరిస్తాడు.  క్లార్క్సన్ దొర మాత్రం అలా కాదు.  పనులన్నీ అతను అనుకున్నట్లుగా జరిగిపోతున్నంత కాలంఅందరితోనూమృదువుగానే మాట్లాడతాడు -ముఖ్యంగా సాయింత్రం పూట - ఒక మోతాదు రమ్ము లోపలికి వెళ్ళాక.
ఉప్పు కలిపిన నిమ్మరసం గ్లాసుని ట్రేలో పట్టుకొని వంటవాడు కొండయ్య గుడారంలోకి ప్రవేశించాడు. పంతులువైపు ప్రశ్నార్ధకంగా చూశాడు. "ఎలా ఉంది పరిస్థితి?" అని దానర్ధం. పంతులు కను సైగ తోనే దొర వైపు సూచించాడు. "దొర చేతికి నువ్వే ఇవ్వు" అని తెలియ జేస్తూ. గ్లాసు అందించి గాడీపొయ్యవైపు పరుగుతీసాడు కొండయ్య. ఎండు కట్టెలు మండుతూండగా పప్పుపులుసు మరుగుతూన్న వాసన గుడారానికి చేరుతున్నది. ఆకలవుతోంది. "ఇప్పుడింక జమాఖర్చుల చిట్టా ఆవర్జా తీస్తాడు" అనుకున్నాడుపంతులు. అదేజరిగింది. మళ్ళీ టిక్కులు పడుతున్నాయి. ఒక చోట పెన్సిలుఆగింది. పంతులు మళ్ళీ ఊపిరి బిగపట్టాడు.
 "కట్టెలు తెచ్చే సవర వాళ్లకి నాలుగణాలు అనుకున్నాం కదా, ఆరణాలు ఎలా అయింది?" అన్నాడు దొర తలెత్తకుండానే. 
 "పులి భయం వాళ్ళ ఇక్కడికి రామని మొండికేశారు సార్! మంచిమాటలాడి ఒప్పించాను. అదనంగా మరో బేడ ఇవ్వక తప్పలేదు". 
 నిజమే. ఈ కేంపుకి వచ్చిన మొదటి రాత్రే పులి అరుపులు వినబడ్డాయి - మనసులో అనుకున్నాడు దొర. పెన్సిలు ముందుకి కదిలింది.
 పద్దు చూడడం ముగించిన దొర రేకుగొట్టం లోంచిమ్యాపులు బయటకు తీశాడు. 
ఇప్పుడింక భోజనం చేసి ఓ గంట కేంప్ కాట్ మీద కునుకుతీస్తాడు. ఆ గంటసేపే కేంపులో అందరికీ ఆటవిడుపు. అందరూ చెట్ల కిందికి చేరుతారు. కూలీలు పులీమేకా ఆడతారు. పొట్టి రాజు పేక దస్తా బయటకి తీస్తాడు. కొంతమంది నడుం వాలుస్తారు. ఈ కొండల్లో ఇంకో రెండు త్రిభుజాలు మాత్రం మిగిలాయిసర్వేకి. తరవాత మళ్ళీ మైదానం లోకే. ఇంత హైరానా ఉండదు.  అన్నీ సవ్యంగా జరిగిపోతే నెల్లాళ్ళ లో విశాఖపట్నం చేరుకుంటారు. ఆ తరవాత ఇంక నీడపట్టున ఆఫీసు పనే.
క్లార్క్సన్ దొర గాని తన పని మీద మంచి రిపోర్టు ఇస్తే జీతం రెండు రూపాయిలైనా పెరుగుతుంది. ఈ దొర ఎవరిమీదా చెడ్డగా రాయడంటారు. ఏమవుతుందో మరి. అయినా ఇంతవరకూ తన పనిని మెచ్చుకుంటూనే ఉన్నాడు. రెండు చిన్నతప్పులు జరిగినమాట వాస్తవమే.ఉపవాసం రోజునాడుకొండలెక్కి శోష వచ్చి, ఎండ దెబ్బకి మొహం తిరిగి పడిపోయిన నాడు - కేంపులకి వచ్చే వాళ్ళు ఇలా ఉపవాసాలని చెప్పి తిండి మానేస్తే ఊరుకొనేది లేదని దొర ఎగిరాడు. ఒక రోజు వంట చేసుకుంటూ చెయ్య కాల్చుకొని మరసటి రోజు కలం పట్టుకోలేక పోతే - "కొండయ్యఅందరికీవండుతున్నాడుకదా,మళ్ళీ నీ వంట నువ్వే చేసుకోవడం ఏమిటి, అర్థం లేకుండా?" అని విసుక్కున్నాడు.
అయినా కొండయ్య చేతి వంట తను ఎలా తింటాడు? ఈ విషయం దొరకి అర్థం అయ్యేలా ఎలా చెప్పడం? ఇది జరిగినప్పుడు మెక్ఫెర్సన్ దొర పక్కనే ఉన్నాడు.
"ఈ నేటివ్స్ ఉన్నారే, కొన్ని విషయాల్లో మహా మూర్ఖులు. వాదించి ప్రయోజనం లేదు" అని తన ముందే అనేశాడు. అవన్నీ ఈ దొరమర్చిపోయినట్టే ఉన్నాడు. రిపోర్టురాసేనాటికి ఇతగాడి అభిప్రాయం ఎలా ఉంటుందో. జీతం పెరగకపొతే మాత్రం ఇబ్బందే. అసలే కరువు రోజులు, ధరలు చూస్తే మండిపోతున్నాయి. .....  
మ్యాప్ వైపు చూస్తూనే - ఉన్నట్టుండి "రామయ్యా, మహేంద్రగిరి ఎత్తు అంచనా వేసి చూపించమని అడిగాను కదా? నాలుగు రోజులైంది.ఇంకా కాలేదా? ఎలా లెక్క కట్టాలో చూపించాను కూడా. ఏమైంది? అర్థంకాక పోతే అడగాలి గాని ఊరుకుంటే ఎలా?" అన్నాడు. 
‘చచ్చాన్రా భగవంతుడా’ అనుకున్నాడు పంతులు. "అంచనా కట్టాను సార్. మీరు తీరుబడిగా ఉన్నప్పుడు చూపిద్దామని..." నసిగాడు. 
 "ఏదీ, చూడనీ"జంకుతూ తన పుస్తకాన్ని దొర ముందు పెట్టాడు. 
 "నేనిచ్చిన కొత్త త్రికోణమితి పట్టిక వాడావా?"  "అదే వాడాను సార్"
 మళ్ళీ పెన్సిలు తీసాడు దొర. టిక్కులు. టిక్కులు. ఒక చోట ఆగి పెద్ద సున్నా చుట్టాడు. "ఇదెక్కడి నుంచి వచ్చింది?"
పంతులుమేజాదగ్గరికిజరిగిపరికించాడు.  "ఓ అదా? ఉష్ణోగ్రతలో తేడాల మూలంగా రీడింగ్ లో వచ్చే తేడాలని సరి చెయ్యడానికి.... "
 "ఎవడు చెప్పాడు?"
"మెక్ఫెర్సన్ దొరగారు అలాగే నేర్పించారు సార్"
"అదంతా పాత పధ్ధతి. సరే సవరణ ఎంత వచ్చింది?"
"సున్నా వచ్చింది సార్"
"అద్గదీ. సరిగ్గానే వచ్చింది" అని దొర చిరునవ్వు నవ్వాడు. 
సున్నా రావడం కూడా శుభసూచకమే అని రామయ్య పంతులు గ్రహించాడు.
దొర ఉల్లాసంగా కుర్చీలో వెనక్కి చేరబడి, "పాతకాలపు తియోదలైట్ లకి ఇలా లెక్కించడం అవసరం. ఇప్పుడుమనంవాడేవాటికికాదు. ఒకప్పుడు తియోదలైట్ అంటే వెయ్యి పౌండ్ల బరువు ఉండేది; పది పన్నెండు మంది మోసేవారు. నేను వాటిని చూసాను గాని, ఎప్పుడూ వాడ లెదు. ఎవరెస్టు గారి ధర్మమా అని ఈ కొత్త పరికరం తయారైంది. నువ్వు వినే ఉంటావు ఆ కథ". 
రామయ్య పంతులికి ఆకలి జోరుగా వేస్తోంది. "లేదు సార్. చెప్పండి". అన్నాడు, మర్యాద కోసం. మనసులో "ఈ కొండయ్యగాడు ఇంకా భోజనం గంట కొట్టడేమి చెప్మా" అనుకున్నాడు. 
దొర చెప్పుకుపోతున్నాడు "ఎవరెస్టు దొర కృష్ణా గోదావరీ నదుల మధ్య ప్రాంతాల్లో సర్వే చేస్తూ జబ్బు పడి సెలవు మీద ఇంగ్లాండు వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు ఇంట్లో కూర్చోకుండా పరికరాలు తయారుచేసే కంపెనీలతో సంప్రదించి కొత్త, తేలికరకం తియోదలైట్ ని సృష్టించాడు.ఉష్ణోగ్రతలో మార్పుల్నిఅధిగమించే విధంగా ఉక్కు, ఇత్తడి పట్టీలని జోడించాడు. అంతే కాదు......" 
ఇవేవీ పంతులు తలకెక్కడం లేదు. వంటల వాసనలు జోరుగా వస్తున్నాయి. నిలబడి నిలబడి కాళ్ళు నెప్పులు పెడుతున్నాయి. "భగవంతుడా, ఏమిటి సాధనం? అయినా ఈ దొరలుకూడా విచిత్రంగా ఉంటారు. సెలవులో వెళ్ళినా డిపార్టుమెంటు పనులమీద తిరుగుతూంటారు" అనుకుంటూ ఉండగానే,భోజనం గంట మోగింది. 
దొర కథ చెప్పడం ఆపి లాగ్ బుక్ తీశాడు.  సూర్యనారాయణ రాజు (అంటే పొడుగురాజు) బృందం బేస్ లైన్ రెండో చివరకి వెళ్ళడానికిసిద్ధంగాఉంది;ఈరోజు భోజనాలు కాగానే బయలుదేరుతుంది. ఇదే నేటి లాగ్ బుక్ లోని ప్రధానాంశం. తను రాసినదంతాశ్రద్ధగా చదివిసంతకం పెట్టాడు దొర.
"ఇంకేమైనా చెప్పవలసినది ఉందా?" అని అడిగాడు. 
పొట్టిరాజు (అనబడు సత్యనారాయణ రాజు) ఆరోజు పొద్దున్నేనీళ్ళు మోసే కమాటి సవరపిల్ల చెయ్య పట్టుకుని పొడుగురాజుచేత చివాట్లు తిన్న సంగతి చెబుదామని నోటిదాకా వచ్చింది. ఉల్లాసంగాఉన్న దొరకికోపం తెప్పించడంఇష్టంలేక ఊరుకున్నాడు. ఈసారికి వదిలేద్దాంలే అనుకున్నాడు. 
"ఇంకేమీ లేదు సార్."ఇంక నువ్వు వెళ్ళొచ్చు" అని సమావేశం ముగించాడు దొర.
సరిగ్గా అప్పుడే ఆ విపత్తు జరిగింది.
పక్షుల కోలాహలం, రెక్కల టపటప, పరుగెత్తుతోన్నమనుషుల పదధ్వని, చప్పట్లు, కేకలు; వీటితో లోయ యావత్తూ మార్మోగిపోయింది.దొరా, పంతులూ గుడారంలోంచి బయటకి ఉరికారు.   
తమప్రయాణానికిపొడుగురాజుబృందంసిద్ధంచేసుకున్నచెక్క పెట్టెలూ.తాళ్ళ మోపులూ,బల్ల చెక్కలూ, రాటలూ, జెండాలూ,మూటకట్టినగుడారం - ఇవన్నీ బయట పేర్చి ఉన్నాయి. కూలీలు కొందరు ఒక కోతి మూకని వెంటతరుముతున్నారు. మరికొందరు గుట్ట అంచునచేరికిందకి చూస్తున్నారు.వాళ్ళల్లో ఇద్దరు రాజులూ ఉన్నారు. విషయం ఏమిటంటే తియోదలైట్ ని స్టాండుతో సహా కోతులు గుట్ట కిందకి – లోయలోకి పడదోసాయి.
  
దొర ఉగ్రరూపం దాల్చాడు. ఇద్దరు రాజుల్నీ చెడామడా తిట్టాడు. "బ్లడీ ఫూల్స్!" అన్నాడు. "సామాన్లకి కాపలా ఉండాల్సిన మనిషి ఏమయ్యాడు?" అని గద్దించాడు."భోజనం తెచ్చుకోవడానికి వెళ్ళాడు సార్" అన్నాడు పొడుగురాజు. "అయినా మీ ఇద్దరిలో ఒకరు ఇక్కడ ఉండాలికదా. కూలీకి అప్పజెప్పి ఎలా వెళ్ళిపోయారు?" జవాబు లేదు. 
"రెండో తియోదలైట్ లేకుండా సర్వే ఎలా అవుతుంది? కొత్తది రావాలంటే కలకత్తా నుంచో, చెన్నపట్నం నుంచో రావాలి. కనీసం నెల్లాళ్ళు పడుతుంది. వర్షాకాలం వచ్చేస్తోంది. అయినా ఈ కేంపులో బొత్తిగా క్రమశిక్షణ లేకుండా పోతోంది. సర్వే అంటే ఏమనుకుంటున్నారు? పిక్నిక్అనుకుంటున్నారా?చూస్తూ ఉండండి.  మీ ఇద్దరి ఉద్యోగాలూ ఊడపీకిన్చేస్తాను. ఇవాళే మీమీద రిపోర్ట్ రాసేస్తాను ...."
పొడుగు రాజు ధైర్యం చేసి "మరమ్మత్తు అవుతుందేమో చూద్దాం సార్" అన్నాడు. 
"నా బొంద అవుతుంది. లోయలోకి దొర్లి పడి ఎన్నిముక్కలయిందో....తియోదలైట్ అంటే ఎంత సున్నితమైన పరికరమో ఏమైనా తెలుసా? స్టుపిడ్, ఇర్రెస్పాన్సిబల్ ఫెలోస్....యూ, పంతులూ, లాగ్ బుక్ తీసుకురా". అంటూ గుడారంవైపు నడిచాడు క్లార్క్సన్ దొర. 
పొట్టి రాజు పొడుగు రాజుకేసి తిరిగి "అన్నయ్య గారూ, మరమ్మత్తు చేయిద్దాం. నేను లోయలోకి దిగి తీసుకొస్తాను" అన్నాడు.
జవాబు కోసం ఎదురుచూడకుండా నలుగురు కూలీలని వెంటబెట్టుకొని గబగబా లోయలోకి దిగిపోయాడు.  
దొర ప్రాపకం కోసం ఈ పొట్టిరాజు అతిగా ప్రవర్తిస్తున్నాడు అనుకున్నాడు రామయ్య దొరవెంట నడుస్తూ. గుడారం దగ్గర ఆగి క్లార్క్సన్ దొర రామయ్య తో ఇలా అన్నాడు: "అందర్నీ భోజనాలు చేసి తొందరగా రమ్మను. నువ్వూ వెళ్ళు.  నా భోజనం ఇక్కిడికే తీసుకురమ్మని కొండయ్యకి చెప్పు".    
వంటచేసుకోవడానికి సమయమూ, ఓపికా రెండూ లోపించడంతో కొండయ్య వంట తినక తప్పలేదు రామయ్యకి. పైగా కొండయ్య వంట రుచిగా ఉన్నట్టనిపించింది. "పంతులుగారూ, మీరు తింటానంటే రేపట్నించి మీకోసం వేరే గిన్నెల్లో వండుతాను". కొండయ్య స్వయంగా చేసిన సూచన తో పరిష్కారం దొరికింది.  ఆనాటితో స్వయంపాకానికి స్వస్తి చెప్పాడు.భోజనాలు కానిచ్చేసరికి పొట్టిరాజు బృందం తియోదలైట్ ని మోసుకుంటూ గుట్టమీదికి చేరుకున్నారు.ప్రయాణ సన్నాహంలో భాగంగా పొడుగురాజు స్వయంగా దుర్భిణిని గుడ్డలతో చుట్టి కాన్వాస్ తొడిగినందువల్ల అంతగా విధ్వంసం జరగదని కూలీలు తీర్మానించారు. 
స్టాండు ధ్వంసం అయింది. మంచి వడ్రంగి దొరికితే తాత్కాలికంగా దాన్ని మరమ్మత్తు చేయించడం పెద్ద కష్టం కాదన్నాడు దొర.  దుర్భిణిని దొరే స్వయంగా విప్పదీసిగుడారంలోకితీసుకుపొయాదు దాన్ని పూర్తిగా విడదీశాడు ఈ విద్యలన్నీ దొరకి ఎలా తెలుసా అని రామయ్య ఆశ్చర్యపోయాడు.  పొడుగు రాజు దొరకి సాయం చేస్తున్నాడు. గుడారంలో వాళ్ళు ముగ్గురే. బయటనిలబడ్డ  కూలీలూ, పొట్టిరాజు ఆత్రుతగా లోనికి చూస్తున్నారు.  
దుర్భిణి తాలూకు రేకుగొట్టం సొట్టలు పడింది. చిగురున ఉండే పెద్ద భూతద్దం పగిలిపోయింది. అయితే అదే కంపెనీవారి భూతద్దం ఒకటి విడిభాగాల పెట్టెలో దొరికింది. స్టాండు కి దుర్భిణీ ని అమర్చే ఉక్కు కడ్డీ మాత్రం బాగా వొంగి పోయింది. ఉష్ణోగ్రత మార్పుల్నిసరిచేసే ఇత్తడి, ఉక్కు సమ్మిళిత పట్టీ కూడా వొంగినట్టు అనుమానం కలిగింది దొరకి. అయితే అది కంటికి తెలియరావడం లేదు.  
"సార్, సవర గూడెం లో ఒక ములిసవరవాడున్నాడు. నేను వెళ్లి వొంపులు సరిచేయిస్తాను" అన్నాడు పొడుగు రాజు. "ములి సవర అంటే?""అంటే కమ్మరివాడు. అయితే అతను వడ్రంగి పని కూడా చేస్తాడు. స్టాండు కూడా మరమ్మత్తు చేయించేస్తాను - తమరు అవునంటే. రేపటికల్లా అయిపోతుంది" 
"ఒక కొండవాడు ఇంత సున్నితమైన పరికరాన్ని మరమ్మత్తు చెయ్యడం ఏమిటి?" అని మనసులో అనుకున్నాడు దొర. అయినా ఇంకా చేసేది మాత్రం ఏముంది? కొత్త పరికరం కోసం నెలో రెండునెల్లో ఎదురుచూసే బదులు ప్రయత్నించి చూస్తే నష్టం లేదు అనుకున్నాడు. ఈ వర్షాకాలం ఒకటి దగ్గర పడుతోంది. ఏదో ఒక విధంగా ఈ వేసవిలోనే సర్వే పూర్తికావాలి. 
"అలాగే రాజూ, కాని ఆ కొండవాడు ఏం చేస్తాడో! నేను కూడా దగ్గర ఉండి చూస్తాను"
ఇద్దరు రాజుల్నీ, నలుగురు కూలీలనీ వెంటబెట్టుకొని హుటాహుటిన సవర గూడేనికి బయిల్దేరాడు దొర. విప్ప సారా బాగా తాగి మంచి నిద్రలో ఉన్న ములి సవర డుంబ్రిని లేపితే, కసిరి పొమ్మన్నాడు. తెలుగు మాట్లాడగల గూడెం పెద్దని కలుసుకొని  కాళ్ళు పట్టుకున్నంత పనిచేస్తే గాని లేచిరాలేదు. సరిచెయ్య వలసిన కడ్డీలనీ, మరమ్మత్తు చెయ్యవలసిన స్టాండు నీ ఓ చూపు చూసి "రేపు రండి" అని మళ్ళీ వెళ్లి పడుకున్నాడు. పొట్టిరాజు అప్పుడొక పరిష్కారం సూచించాడు. "వీడికి మరికొంచెం విప్ప సారా పోయిస్తే లేచి కూచుంటాడు" అన్నాడు. అదేమంత మంచి మార్గంలా తోచలేదు దొరకి. కాని చివరికి అదే పనిచేసింది. 
డుంబ్రి గుడిసె లో ఉన్న పనిముట్లు పురావస్తు ప్రదర్శన లో ఉండాల్సినవిగా కనిపించాయి దొర కంటికి. అక్కడున్న వాయిద్యాలని చూస్తే వాటిని తయారుచేసే పని కూడా దుంబ్రి నైపుణ్యం లో భాగం అని బోధపడింది. 
అయితే వొంపు తీరిందీ లేనిదీ సరిచూడగల కుదురుమట్టం లాంటిదేదీ అగుపడలేదు. సుత్తితో కడ్డీలని మోదినప్పుడల్లా ఆ దెబ్బలు నేరుగా దొర గుండెకి తగిలినట్టనిపించి బాధించాయి. గోడకి తగిలించి ఉన్న ఒక తీగ వాయిద్యాన్ని డుంబ్రి తీసేసరికి దొర కంగారు పడ్డాడు. ఇప్పుడిది వాయిస్తాడా ఏమిటి? అసలే తాగి ఉన్నాడు - అనుకున్నాడు.
వాయిద్యపు తీగెని బిగదీసి కడ్డీలని దాని మీద సున్నితంగా నడిపించాడు. స్వదేశం లో భారీ యంత్రాల అలైన్మెంట్ కోసం పియానో తీగెలు వాడే పధ్ధతి గుర్తుకొచ్చింది క్లార్క్సన్ కి. ఆ తరవాత డుంబ్రి వెనకాతల ఉన్న నూనె దీపపు వెలుగును గమనిస్తూ - ఎంతమాత్రం ఖాళీ కనిపించంతవరకూ సుత్తితో చిన్నగా మోదాడు - మళ్ళీ మళ్ళీ సరిచూసాడు.దొర నిర్ఘాంతపోయాడు. ఈ పద్ధతిని ఈ మధ్య ఇంగ్లాండులో తరచూ వాడుతున్నారు. ఇదే ఆప్టికల్ అలైన్మేంట్. చివరికి డుంబ్రి తన తలనుండి ఒక వెంట్రుకని పీకి తీగేకీ కడ్డీకీ మధ్య దూర్చే ప్రయత్నం చేసాడు. అది ఎక్కడా దూరలేదు. అంటే వెంట్రుక వాసి వొంపు కూడా లేదన్నమాటేగా. "ఇది పనిచేస్తుంది" అని దొరకి నిబ్బరం కలిగింది.
“స్టాండుని రేపు బాగుచేస్తాను ఇంక బయిల్దేరండి” అని గూడెం పెద్ద ద్వారా చెప్పించాడు డుంబ్రి. దొర ఆనందం పట్టలేక డుంబ్రి కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. భుజం తట్టాడు. కౌగలించుకున్నంత పనిచేసాడు.
"ఏమివ్వమంటాడో కనుక్కో" అన్నాడు పొట్టిరాజు తో. ఇంగ్లీషు, తెలుగు, సవర భాషల్లో సంప్రదింపులు జరిగాయి. చివరికి పొట్టిరాజు దొరతో "ఉప్పు కావాలంటున్నాడు సార్" అన్నాడు. "ఉప్పా?""అవున్సార్ ఉప్పే. కొండవాళ్ళకి ఉప్పే బంగారం. సంతల్లో కొంటారు. బోలెడు ఖరీదు".
ఆ మర్నాడు స్టాండు కూడా వచ్చింది. వెంటనే దొర తియోదలైట్ ని మునపటి స్థానంలో ఉంచి మహేంద్రగిరిశిఖిరపు కోణాన్ని కొలవగా కొద్దిపాటి సవరణలతో సరిగ్గా సరిపోయింది. దొర ఆనందానికి అవధులు లేవు.మిరపకాయి టపా లో పర్లాఖిమిడి రాజావారికి ఉత్తరం పంపిచమనీ గూడెం పెద్దకి ఒక బస్తాడు ఉప్పు అందజేసే ఏర్పాటు చెయ్యమని అందులో రాయమనీ రామయ్య పంతుల్ని ఆదేశించాడు. పర్లాఖిమిడి రాజా వారు తమ బంధువైన టెక్కలి రాజాకి ఈపని పురమాయించారు. నౌపడా ఉప్పుగల్లీలనుండి బయిల్దేరిన ఉప్పుబస్తా రెండువారాల్లో గూడెం చేరింది. 
మరో రెండు వారాల్లో క్లార్క్సన్ బృందం సర్వే ముగించి విశాఖపట్నం చేరుకుంది. 
క్లార్క్సన్ దొర కలకత్తా లోని సర్వే అఫ్ ఇండియా వారి ముఖ్య కార్యాలయానికి పంపిన తన అంతిమ నివేదికలో ఈ విధంగా తన అనుభవాలని క్లుప్తీకరించాడు:
శ్రీరంగపట్టణంలో టిప్పుసుల్తాను పై కుంఫిణీసేనలు ఘనవిజయం సాధించిన కొద్దికాలానికే ఎంతో దూరదృష్టితో కల్నల్ విలియం లాంబ్టన్ మహాశయుడు ప్రతిపాదించగా లార్డు వెల్లెస్లీ గారు ఆమోదించి శ్రీకారం చుట్టినటువంటి 'ది గ్రేట్ట్రిగోనోమెట్రికల్ సర్వే అఫ్ ఇండియా" (జీ. టీ. ఎస్.) యొక్క నాలగవ, అంతిమ దశ విజయవంతంగా పూర్తయిందని తెలియజేయుటకు నాకెంతో ఆనందంగా ఉన్నది.
ఈ బృహత్ కార్యాన్ని పూర్తిచేయడానికి మన సంస్థకు అరవై ఏళ్ళు పట్టినప్పటికీ ఘనత వహించిన విక్టోరియా మహారాణి గారి ప్రభుత్వం వారు నియమించిన ఉత్తమశ్రేణి నాయకత్వం - జార్జి ఎవరెస్ట్ గారు, అండ్రూ వాఘ్ గారూ, నేటి అధిపతి కల్నల్ వాకర్ గారూ - ఇంకా ఇతర హేమాహేమీలు ఏర్పరిచిన మార్గంలో నడవడం వల్ల నా బోటి వాడి పని సుసాధ్యం అయింది.
నాకు అప్పగించిన సర్వే ప్రాంతంపూరీ నుండి వైజాగపటేమ్ వరకూ - ప్రధానంగా తూర్పు తీరం వెంబడేవిస్తరించి ఉన్నది. తూర్పు కనుమల్లో మహేంద్రగిరి చుట్టుపక్కల ఉన్నటువంటిమూడు త్రిభుజాలు మాత్రమే ఈ సర్వేలోని కొండ ప్రాంతాలు.
అయితే కెప్టన్ మేక్ఫెర్సన్ కి మలేరియా సోకినందున మొత్తం బాధ్యత నాపైన పడింది. నేటివ్స్ కి అనగా స్థానిక భారతీయులకు ఎక్కువ బాధ్యతలను అప్పగించి పర్యవేక్షించ వలసివచ్చింది. ఇది నాకు కొత్త అనుభవం. అయితే అప్పటికే కెప్టన్ మేక్ఫెర్సన్ గారు ఈ విషయం మీదా ఇంకా అనేక ఇతరవిషయాలమీదా నాకు ఎన్నో సూచనలు చేసిఉన్నారు. అవన్నీకూడా నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇందుకుగానునేను కెప్టన్ మేక్ఫెర్సన్ గారికి సదా కృతజ్ఞుడను. 
అన్నిస్థాయిల్లోనూ పనిచెయ్యడానికి ఇంగ్లాండు నుండి మనమనుషుల్ని రప్పించడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదే కాకుండా ఆచరణసాధ్యం కాదు గనకనూ, మరోవైపు మనకు నిధుల కొరత తీవ్రంగా ఉన్నందునా ఎప్పటికప్పుడు వీలైనంతమేరకు స్థానికుల చేత కనీసం దిగువ స్థాయి పనులు చేయించగలగాలనీ మన సంస్థలోని పెద్దలు చెబుతూవస్తున్నారు. అందుచేత ఈ విషయంలో నా అనుభవాలను క్లుప్తంగానైనా ఇక్కడ నమోదు చేయుట ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను.  
నా బృందానికి సంబంధించి ముగ్గురు వ్యక్తుల గురించి పేర్కొనడం అవసరం. నిజానికి మూడవ వ్యక్తి బృంద సభ్యుడు కూడా కాదు. అయితే అతని ప్రస్తావన ఎందుకు అవసరం అనేది మీరేగ్రహించగలరు. 
రామయ్య పంతులు అని పిలువబడే వెంకట్రామయ్య పంతులు ఈ బృందంలో రైటర్ గానూ, రికార్దిస్టు గాను వ్యవహరించాడు. కొంచెం భయంగానూ చాలా అయిష్టంగానూ సర్వే పనికి వచ్చాడు. స్థానికయాసతోనైనాఇంగ్లీషు బాగా మాట్లాడతాడు; అంతకన్నా ముఖ్యంగా ఎక్కువ తప్పులు లేకుండా రాస్తాడు. నకళ్ళు తొందరగా తయారు చేస్తాడు. మంచి దుబాషీ కూడా. ఒక మాదిరి లెక్కలు చెయ్యగలడు. ఏదైనా ఒక సారి చూపిస్తే అదే విధంగా చేసుకుపోతాడు. జమాఖర్చులూచిట్టాఆవర్జాలూ బాగా రాస్తాడు. నమ్మదగినవాడు. స్వతహాగా క్రమశిక్షణ ఉన్నవాడు. అయితే సాంకేతిక పరిజ్ఞానం తక్కువ. నేర్చుకొనే ప్రయత్నంలో లోపం ఉన్నది. ఇతని చదువులో భాషకి ఉండిన ప్రాధాన్యత శాస్త్రపరిజ్ఞానానికి లేకపోవడం ఒక కారణం కావచ్చు. ఏది ఏమైనా ఒక మంచి దుబాషీగా, రికార్దిస్టుగా మనకు ఉపయోగపడతాడు. ఇతని జీతం నెలకు మూడు రూపాయిలు పెంచవలసింది గా అభ్యర్ధిస్తున్నాను.  
ఇక రెండవ వ్యక్తి సూర్యనారాయణ రాజు. ఇతను సహజసిద్ధమైన నాయకుడు. అందరికీ ఇతనంటే గౌరవం. ముఖ్యంగా కూలీలకి. ఇతను తిట్టినా వాళ్ళు పడతారు.ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళ బాగోగులు విచారిస్తాడు. పదిమందిని కూడగట్టి పని సక్రమంగా నిర్వహించాడంలోనూ, ఏవైనా ఇబ్బందులు వస్తే ఎదుర్కోవడం లోనూ దిట్ట. సాహసి. గుర్రపుస్వారీ బాగాచేస్తాడు. తియోదలైట్ తో రీడింగ్ తప్పులు లేకుండా తీసుకోవడం తొందరగా నేర్చుకున్నాడు. సెక్స్ టెంట్ వాడడం ఇంకా చేతకాదు. స్వయంగా తన చేతులతో పనిచేస్తాడు. యంత్రాలన్నా, పరికరాలన్నా మంచి ఆసక్తి. లెక్కలు ఒకమాదిరిగా చేస్తాడు. ఇంగ్లీషు పరవాలేదు గాని ఇంకా కృషి చెయ్యాలి. ఇతనికి ప్రేరణ కలిగించే పని మనం ఇవ్వలేకపోతే మాత్రం నిరుత్సాహ పడతాడు. ఇతన్ని కటక్ లోని మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి ఆరు నెలలబాటు పంపాలని కోరుకుంటున్నాను. 
ఈ బృందం విజయవంతంగా పని ముగించుకొని తిరిగి రావడానికి కారకుడైన మూడవ వ్యక్తి డుంబ్రి అనబడే ఒక సవరజాతి కొండమనిషి. ఇతని చేతిలో ఉన్న నైపుణ్యం నమ్మశక్యం కాదు. నేను స్వయంగా చూశాను కాబట్టే నమ్మగలిగాను. ఎక్కడో మారుమూల కొండల్లో, ఒక తాగుబోతు బికారి తన అతి పురాతనమైన పనిముట్లతో, పియానో వైర్ పద్ధతినీ ఆప్టికల్ పద్ధతినీ ఏక కాలంలో వినియోగించి ధ్వంసమైన తియోదలైట్ ని ఒక పూటలో మరమ్మత్తు చేసాడంటే - అది ఒక అద్భుతం తప్ప వేరొకటి కాదు. ఇందుకుగాను డుంబ్రి  కోరుకున్న ప్రతిఫలం ఒక బస్తాడు ఉప్పు. ఇతనికి ఇంగ్లీషు మాట అటుంచి, సవరభాష తప్ప తెలుగుగాని, ఓడ్రంగాని రావు. ఎవరెస్ట్ మహాశయుడు సర్వేలకి పోయినప్పుడల్లా మరమ్మత్తుల కోసం చెన్నపట్నానికి చెందిన  వాచీ మేకర్ సయ్యద్ మీర్ మొహ్సిన్ హుసైన్ ని వెంట తీసుకు పోవడం మనకు తెలుసు. ఇంగ్లీషు రాకపోయినా ఆయన చీఫ్ ఇన్స్ట్రుమెంట్ మేకర్ గా పదోన్నతికి పొందడానికి కారకుడు కూడా ఎవరెస్ట్ గారే. డుంబ్రి లో మరొక సయ్యద్ మీర్ మొహ్సిన్ హుసైన్ నాకు కనిపించాడని చెప్పగలను. మన ప్రభుత్వం వారు ఈ దేశంలో ప్రవేశ పెడుతూన్న యంత్ర పరికరాలకు, వాటి మైన్టేనేన్సుకీ సరిగ్గా ఇటువంటి వ్యక్తుల అవసరం ఎంతైనా ఉన్నది. అయితే వీరికి ఎలా తర్ఫీదు ఇవ్వాలి, ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై నావద్ద ప్రస్తుతం ఎటువంటి సూచనలూ లేవు. ఇది ఆలోచించ వలసిన విషయం. 
త్రికోణమితి నిష్పత్తులు ఈ దేశంనుండే అరబ్బుల ద్వారా యూరోపు చేరాయి. వాటినే మెరుగు పరచి మనం వాడుతున్నాం ఈ సర్వేలలో. మరిక్కడ ఆశాస్త్రాలన్నీ ఎటుపోయాయో అనే సందేహం నాకు తరచూ కలుగుతుంది. శాస్త్రాల పునాదిని మళ్ళీ నిర్మిస్తే పైన చెప్పిన వ్యక్తుల్లాంటి వాళ్ళు మనకు ఎంతో ఉపయోగపడతారు. ప్రస్తుతానికి ఇక్కడి పరిస్థితి ఎలా ఉందంటే - నైపుణ్యం ఉన్న చోట శాస్త్రం లేదు; శాస్త్రం ఉన్న చోట నైపుణ్యం లేదు. ఇక్కడి చదువుల్లో శాస్త్రం, నైపుణ్యం - రెండూ లేవు.  మన సంస్థ విషయానికివస్తే కటక్ లో మాదిరిగా వైజాగపటేమ్లో కూడా స్థానికులను సర్వేయర్లుగా తయారుచేసే ట్రైనింగ్ స్కూల్ స్థాపిస్తే బాగుంటుందని సూచిస్తున్నాను. అటు రహదారుల విభాగంనుండీ ఇటు రైల్వేవారినుండీ సర్వేలు చేబట్టమని అభ్యర్ధనలు వస్తూనే ఉన్నాయి. మందీమార్బలం లేక వాటిని ఆమోదించలేక పోతున్నాం. ఇటువంటి స్కూలు గనక స్థాపిస్తే అక్కడ నుండి వచ్చే సర్వేయర్ లు వారికీ ఉపయోగపడతారు. 
చివరిగా స్థానికుల పని తీరు గురించి. మొదట నేను తెలుసుకున్న విషయం ఏమంటే - కూలీలైనా ఒవర్సీర్ లైనా వీళ్ళకు తెలివితేటల్లో ఎటువంటి లోటుపాట్లు గానీ తేడాలు గానీ లేవు. భయం, భక్తీ అందరికీ ఎక్కువే. కొద్దిమందిని మినహాయిస్తే వీళ్ళను సదా అజమాయిషీ చేస్తూ ఉండాలి. ఇది నా పని, ఎవరు చూస్తున్నా, చూడకపోయినా నేను ఒప్పుకున్న ప్రకారం చేసుకుపోవాలి అనే ఆలోచన తక్కువ. 
క్లార్క్సన్ సమర్పించిన నివేదికని ముఖ్య కార్యాలయం ఆమోదించింది.అతని సూచనల్ని అమలు పరచింది
హిమాలయాల్లోని అత్యున్నత శిఖరానికి ఎవరెస్టు దొర పేరు పెడుతున్నట్లుగా 1865లో ప్రభుత్వం ప్రకటించినప్పుడు విశాఖపట్నం ఆఫీసులో మిఠాయిలు పంచారు. దొరలు పార్టీ చేసుకున్నారు. 1897 లో ఆఫీసు సూపర్నెంటుగా రామయ్యపంతులు రిటైరయ్యే నాటికిరాజమండ్రివద్ద గోదావరిమీద రైల్వేవంతెన కట్టారు;జయపురానికి ఘాట్ రోడ్డు పడింది; మన్యం, ఏజెన్సీ ఘాట్ రోడ్లకు సవివరమైన సర్వేలు మొదలయ్యాయి;సూర్యనారాయణరాజు ఉద్యోగంమానేసి పెద్ద రైల్వేకాంట్రాక్టర్ గా మారికోటీశ్వరుడయ్యాడు.
మొత్తం మీద ఉత్తరాంధ్ర, దక్షిణ ఓడిశా ప్రాంతాల్లో అంతకు ముందులేని కదలిక ఒకటి మొదలయ్యింది. అన్నట్టు డుంబ్రి ఏమయ్యాడో తెలియలేదు. అతనుండే ప్రాంతాల్లో కదలిక మొదలవ్వడానికి చాలా కాలమే పట్టింది. 
02 March 2015, Mumbai

Response to the story

 This is a very nice story. Brought back some old memories.  how my father used to go for his survey during the constructionof  Machkund Hydro station project.  Sudhakar's work is commendable. Wonder  how and from where he got the information!

Jijji 
Visakhapatnam