Thursday, December 18, 2014



నా కాఫీ ప్రస్థానం
       కాఫీ తో నా అనుబంధం ఈ నాటిదా? చూస్తూ ఉండగానే అర్థ శతాబ్దం గదిచిపొఇంది.  మొదట్లో రైల్ లో తోటిప్రయానీకుడిలా పరిచయం అయి, ఆఖరికి ఆత్మ బంధువు కంటే ఎక్కువగా, ఒక భాగ స్వామిలా, నిత్యం అంటిపెట్టుకుని నాతో నే ఉంటుందని ఊహించలేదు. 

      బాగా గుర్తు ఉన్నదేమిటంటే, చిన్నప్పుడు నాన్న ఒళ్లో కూర్చుని తన కప్పులోంచి మారం చేసి ఓ గుక్క తాగడం, కొంచం పెద్ద అయ్యాక, నాకూ కాఫీ కావాలని మారాం చేస్తే  పూర్తి పాలల్లో ఓ చుక్క కాఫీ నీళ్ళు పోసి అదే కాఫీ అని అమ్మ ముద్దుగా ఇవ్వడం, ఇలా అతిధి లా పరిచయం అయి, కాస్త వయస్సు ( టీన్ ఏజ్) కి వచ్చేసరికి కాఫీ అంటే మన వాళ్ళే ( మొదట్లో అమెరికా లో ఇండియన్ ముఖం కనిపించగానే మన వాళ్ళే అనుకోవడం సరదాగా ఉండేది.) అనేటట్టు గా పరిచయం పెరిగింది.

     ఆఫిషియల్ గా కాఫీ తో అనుబంధం హై స్కూల్ అయ్యాక జరిగింది.  మా ఇంట్లో అదో ఆనవాయితి!
ఆ వేసంగి  సెలవలు మూడు నెలల్లోనూ మంచి నవలలు  వేయి పడగలు, నారాయణ రావు, మోహన వంశి లాంటివి చదవడము, టైపు, షార్ట్ హ్యాండ్ , నేర్తుకోవడము, వంటింట్లో సాయం చెయ్యడము నేర్పించేవారు.  అప్పటికి పెద్దవాళ్ళం అయినట్టు గుర్తుగా, సగం పల్చటి  నీళ్ళు, సగం చిక్కని పాళ్ళు, మరింత పంచదార వేసి ఇచ్చెవారు.  మాకు అంటూ ఉన్న స్టీల్ గ్లాస్ లో తాగుతూ ఉంటె దాని రుచే రుచి!  వేడికి గ్లాస్ అంచులని సుతారం గా పట్టుకుని ఆహ! మనమే కదా పెద్దవాళ్ళం అయిపోయాము, ఎంత స్టైల్ గా తాగుతున్నాము అనుకునేవాళ్ళం.

       ఇలా మొదలైన ఇంట్లో కాఫీ స్నేహం పెరిగి, పెరిగి, కాలేజీ, యూనివర్సిటీ రోజుల నాటికి ప్రాణ స్నేహం గా మారిపోఇంది.  రోజుకి రెండు సార్లు కలుసుకునే స్నేహం నించి, రోజుకి మూడు, నాలుగు సార్లు కలుసుకోకుండా ఉండలేని స్థితి కి వచ్చాను.  పరీక్షలు దగ్గిరికి వస్తున్న సమయం లో ఇంట్లో కాఫీ స్నేహం తో బాటు ఇంకో కొత్త స్నేహం మొదలయింది.  అదేనండి, ఇన్స్టంట్ కాఫీ!! ఈ కొత్త , పాతాల స్నేహం చదువులో బాగా సాయం చేసింది కాని, ఒక్కోసారి చెయ్యలేదని కూడా చెప్పాలి.  అది ఎలా అంటే,  నాకు మొదటి నించి నిద్ర ఎక్కువే! అమ్మ పోరు పెడుతున్న, చదవడానికి బోల్డు సబ్జక్ట్స్ ఉన్న, మనస్పూర్తి గా చదువుదామని అనుకున్నా కూడా, నిద్ర దేవత కళ్ళ మీదకి వచ్చి కూర్చునేది.  ఈ విషయం లో అమ్మ పూర్తిగా విఫల మయిందనే చెప్పాలి.  ఆఖరికి ఇప్పుడు పడుకో, తెల్లారి లేఛి చదువు గాని లే, అనేది.  దాంతో పాటు, పొద్దుటే లేఛి వేడి కాఫీ తాగుతే నిద్ర రాదు అని సలహా కూడా చెప్పింది, పాపం, అమ్మ!

       ఇదే బాగుందని, వెంటనే పడుకుని, టంచన్ గా తెల్లారి నాలుగు  కి లేచి కాఫీ కార్యక్రమం మొదలు పెట్టేదాన్ని. డికాక్షన్ పెట్టడం చేత కాక, అప్పుడే ఇన్స్టంట్ కాఫీ తో స్నేహం మొదలు పెట్టాను.  అప్పుడు వస్తున్న నేస్కేఫ్ కాఫీ పోడి  కొనుక్కుని, నీళ్ళు కాచి, మరింత చిక్కగా ఉండాలని, ఎక్కువ గుండా, పాలు పోసి కాఫీ చేసుకుని , ఆ గ్లాస్ పట్టుకుని పుస్తకాల ముందర కూర్త్చునే దాన్ని.  ఈ తతంగం అంత అయ్యే సరికి అరగంట గడిచిపోయ్యేది.  ఓ, గంట చదివేదన్నో లేదో, చిక్కటి కాఫీ ప్రభావం వాళ్ళ మళ్లి మంచం శరన్న్యం అయ్యేది.  ఇలా సాగింది నా కాఫీ చదువు!

        ఇలా ప్రతిష్టమైన నా కాఫీ స్నేహానికి అనుకోడుండా అంతరాయం కలిగింది.  అది ఏమిటంటే, పెళ్లి అవ్వడము, అమెరికా రావడము! ఇక్కడికి వచ్చాక,ఉత్సాహం గా కాఫీ తో కొత్త స్నేహం చేద్దామని ఎంత ప్రయత్నించినా, ఇక్కడి కాఫీ లాగే చప్పగా నీళ్ళు కారిపోయింది.  అప్పటికి, ఇప్పటికి కూడా, అమెరికా కాఫీ నల్ల నీళ్ళు అనేటట్టుగానే ఉంటుంది.  ఇక్కడి వాళ్లు, పల్చటి డికాక్షన్ ఓ పెద్ద మగ్ లో పోసుకుని అందులో షుగర్, క్రీం లాంటివి ఏమీ వేసుకోకుండా, దాన్ని పొద్దుటి నుంచి మధ్యాన్నం వరకు మెల్లి మెల్లి గా చప్పరిస్తూ చేత్తో పట్టుకుని ఆఫీస్ లో అటు, ఇటు తిరగడం ఓ పెద్ద ఫాషన్!  అలాగని, కాఫీ స్నేహం వదిలేద్దామని ఎంత ప్రయత్నించిన సాధ్యం అయిన్దికాదు.  ఎలాగేనా, ఈ కొత్త స్నేహాన్ని బంధంగా మార్చడానికి పట్టువదలని విక్రమార్కుడు లా అన్ని రకాల ప్రోయోగాలు చేస్తూ గడపసాగాను. ఎంతేనా, మనవాళ్ళతో చేసినట్టు ఉండదు కదా.! దేని దారి దానిదే!  ప్రతీసారి, ఇండియా వెళ్ళినప్పుడు పాత స్నేహాన్ని కలుసు(పు)కుంటూ, వచ్చేటప్పుడు వీడ్కోలు చెప్ప కుంటూ ఉండేదాన్ని.

      ఇలా, కొన్ని సంవత్సరాలు గడిచాక, మార్కెట్ లో కి కాఫీ మేకర్ కొత్త గా వచ్చింది.  దీనితో నైనా బ్రహ్మాండం గా కాఫీ చేసుకోవచ్చని దాన్ని కొన్నాను..  మెషిన్ అయితే ఉంది కాని, మంచి కాఫీ పొడి దొరకాలి కదా! అసలు మనకి ఏది నచ్చుతుందో తెలియాలి కదా.  ఆ ప్రయత్నం లో కొన్ని సంవత్సరాలు కనిపించిన బ్రాండ్ పొడులు, ఫోల్గేర్స్, మాక్స్వెల్ హౌస్, హిల్స్ బ్రదర్స్, మొదలైన వాటి తో ప్రయోగాలు చేసాను.  వాటి తో పాటు ఫ్రెంచ్ రోస్ట్, మేలిట్ట బ్రాండ్ పొడులు కలిపి అన్ని రకాల పెర్మిటేషన్, కాంబినేషన్ తో హడావుడి చేసాను.  అబ్బే! ఏమి లాభం లేకపోయింది.  ఏదీ కూడా ఆ పాత స్నేహ మద్దుర్యానికి దరిదాపుల్లోకి రాలేకపోయాయి.

      ఇంతట్లో, మధ్య వయస్కురాలిని అయ్యేసరికి, డాక్టర్లు నీకు అసలే చాక్లేట్ ఇష్టం, అటు అవి తింటూ, ఇటు ఇలా కాఫీ తాగేస్తూ ఉంటె ఒంటికి మంచిదికాదు.  నీ ఒంట్లో ఎక్కువ కాఫీన్ ఉంది, లంప్స్ వస్తాయి,


      ఎందుకేనా మంచిది, కొన్నాళ్ళు కాఫీ మానేయి అన్నారు.  నోట్లో  పచ్చి వెలక్కాయ పడింది.  కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.  ధైర్యం తెచ్చుకొని అబ్బే, అదేమీ లాభం లేదు, కాఫీ కి నాకు ఉన్న్న అనుబంధం గురించి మీకేం తెలుసు? అది జరిగేపని కాదు అని చెప్పేసాను.  పాపం, డాక్టర్ నా మీద జాలి పడి , పోనీ, కొన్నాళ్ళు దికాఫినేటెడ్ కాఫీ తాగు అని సలహా ఇచ్చారు.  కొన్నాళ్ళు విధి గా గరళం మింగినట్టు మింగాను.  కొన్నాళ్ళు తరువాత ఏది అయితే అయిందని మెల్లిగా పాత పద్ధతికి మారిపోయాను.

     ఇలా ఎన్నో మార్పులు చేసుకుంటూ ఉంటూనే రోజులు గడిచిపోయాయి. కొన్నాళ్ళు తాజా కాఫీ గింజలు ఇంట్లోనే వేఇంచిపొడి చేసుకుని, పంచదార బదులు ఈక్వల్ లాంటివి వాడుతూ, పాలకి బదులు లో ఫాట్
క్రీం లు వాడడం, ఈలా చాలా మార్పులే చేసాను.  ముఖ్యంగా  మేము ౩౦ ఏళ్ళు ఒక ఊర్లోనే ఉండడం, అది మరీ పెద్ద ఊరు కాకపోవడం వళ్ళ ఇండియా షాప్ లకి దూరం గా ఉండిపోయాం.  ఆ తరువాత ఉద్యోగ రీత్యా, మరీ చిన్న ఊర్లో ఉన్నాము.  మధ్య మధ్య లో బయట కాపచినో, ఎక్ష్ప్రెస్సొ లాంటివి రుచి చూసాం కూడా!

     ఆఖరికి ఏడు ఏళ్ల కిందట చికాగో వచ్చి స్థిరపడ్డాము.  మూడు నాలుగు ఏళ్ల కిందట నా కాఫీ వెర్రి తెలిసిన మా అమ్మాయి, వీళ్ళు సరదాపడతారని ఓ కాఫీ 101 క్లాసు కి పంపించింది.  అక్కడ రకరకాల కాఫీ ల గురించి, ఎ దేశం లో ఎ రకం పండిస్తారో, మనం ఎలాంటి రకం కాఫీ ఎంచుకోవాలో ఇలాంటి వన్నీ వర్ణించి ఆఖరున, అన్ని రకాల కాఫీ ల రుచులు రుచి చూపిస్తారు.  గొప్ప కాఫీ విందు!

     రెండు ఏళ్ల కిందట మా పెద్ద అమ్మాయి ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక కేఫ్ లో ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ తాగి బాగుందని అన్నానని, అది ఒకటి కొని ఇచ్చింది.  పాపం! పిల్లలు అమ్మ ని సంతోష పెడదామని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే వచ్చారు.  ఇంతకీ, ఈ రకం కాఫీ కి ప్రత్యేకం గా ముతక గా, బరక గా ఉన్న కాఫీ పొడి కావాలి.  చికాగో లో ఉన్న అన్ని సూపర్ మార్కెట్లలో దీని కోసం వేట సాగించాం.  అనుకోకుండా, ఓ షాప్ లో కాఫీ గుండా సెక్షన్ లో ప్యూర్ చికరి ప్యాకెట్ కనిపించింది.  అది చూడగానే
     ఎగిరి గంతేయ్యాలని అనిపించినా, బొత్తిగా షాప్ అనీ, పైగా నా కాళ్ళ నొప్పులు జ్యాపకం వచ్చి ఆ ప్రయత్నం విరమించుకున్నాను.  ఆ చికరి తో ఇండియా లో లా చికోరి, కాఫీ రేషియో ల తో మళ్లీ ప్రయోగాలు.  అయితే ఇది మన కాఫీ కి దగ్గిరగా ఉన్నట్టు అనిపించింది.  ఇంక మిగిలిన జీవితం దీనితో త్రుప్తి అయిపోదామని అనుకునే లోపునే మళ్లీ మార్పు!

     ఈ మధ్యనే కొత్త గా మార్కెట్ లో కి ఇంకో కాఫీ పరికరం వచ్చింది.  అదే, మన కురేఇగ్ కాఫీ కప్ మేకర్.  నీళ్ళు నింపి దానికోసం స్పెషల్ గా అమ్ముతున్న ఒక కప్పు కే సరిపోయే చిన్న కప్ ఆకారం లో ఉన్న గుండ అందులో పెట్టి మూసి,  స్విచ్ వేస్తే కాఫీ రెడీ!  ఇప్పుడు ఇలాంటివి ఎన్ని రకాలో దొరుకుతున్నాయి. 

     ఇంకో విషయం.  ఈ చికాగో  మహా నగరం లో ప్రతీ పెద్ద రోడ్ల కూడలి లోనూ మన ఇండియా షాప్ లు ఉన్నాయి.  వాటిల్లో ఉదయ్, బ్రూ, (ఇన్స్టంట్ కాదు). ఇలా ఫిల్టర్ కాఫీ పొడులు దొరుకుతున్నాయి. 
ఎప్పుడో ౩౦ ఏళ్ల కిందట ఎందుకేనా ఉంటుందని కొన్న బుల్లి కాఫీ ఫిల్టర్ ఎప్పుడో బేస్మెంట్ లో దాచినదాన్ని(ఇప్పటి వరకు వాడలేదు) పైకి తీసి వాడ సాగాను.

       ఇన్ని సంవత్సరాల ఈ ప్రస్తానం లో జీవితం ఇంకో మలుపు తిరిగింది.  ఒక మనుమరాలు, ఇద్దరు మనుమలకి అమ్మమ్మ, తాతయ్యలం అయ్యాము.  క్రిస్మస్ కి సరదాగా మా పిల్లలు, ఇద్దరూ, వాళ్ళ పిల్లల ఫోటోల తో ఉన్న కాఫీ మగ్గులు చేరోకటి ఇచ్చారు.  ఎవరిదీ వాడి ఎవరిదీ మానేస్తాం? అందుకని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము.  చదివి నవ్వకండి సుమా!  ఒక వారం ఫ్రెంచ్ కప్ కాఫీ, ఒక వారం ఇండియా ఫిల్టర్ కాఫీ,  సాయంకాలం కుఎరిగ్ కాఫీ తో నూ, ఒక రోజు ఒక మనవడి కాఫీ మగ్ తొనూ, మర్నాడు రెండో మనవరాలు, మనవడు ల మగ్ తో నూ, కాఫీ తాగుతూ, కాఫీ కన్నా, మగ్గుల మీద ఉన్న పిల్లలని చూస్తూ కాఫీ లని ఆస్వాదిస్తున్నాము.

      సో, ఇప్పటికి నేర్చుకున్న నీతి ఏమిటంటే, దేని కి అదే గొప్పదనీ, కొత్త వాటిని పాత వాటితో పోల్చకూడదని, మన జ్యాపకాల పొరల్లో ఉన్న దానితో అసలే పోల్చకూడదని, (ఎందుకంటే జ్యాపకం ఇప్పుడు ఒక భావనే కనుక),  ప్రతి స్నేహాన్ని దానికదే సంతోషిస్తూ గడపడమే మేలు అని తేలింది.

                                                                    జై కాఫీ మాతా!

శైలజ సోమయాజుల
అరోరా, ఇల్లినాయిస్.


hi,

jai kaafee maathaa kinda raaddaamantay kudara ledu.

wonderfully written.

some people are lucky to be pampered both by the mother and the  daughters.

love, nani





No comments: