This was published in the Telugu daily newspaper 'Andhra Jyoti', on Sunday, 08 November 2015
తెగిన నూలుపోగు
తెగిన నూలుపోగు
ఉణుదుర్తి సుధాకర్
నాలుగు బళ్ల సరుకుని సుబ్బయ్యశెట్టిగారి గోదాములో దింపించి, తూకం వేయించి గుమాస్తా వద్ద తీసుకున్న రశీదుతో తండ్రీకొడుకులు శెట్టి గారింటికిబయిల్దేరారు. గోదాములన్నీ నాటుపడవల రేవుకి ఆనుకొని,
దిబ్బమీద ఉన్నాయి.అక్కడినుండిచూస్తేతెరచాపల్ని ముడుచుకొని లంగర్లువేసుకొని సరకులకోసం
కాచుకొని ఉన్న తెరచాపల ఓడలు సమూహంగా కనిపిస్తున్నాయి. సముద్రం ఆరోజు ప్రశాంతంగా ఉంది.ఆ ఓడలన్నీ కూడా తమ
ఊరి చెరువులో చేపలకోసం దొంగజపం చేసే కొంగల్లాగా సన్నగా, పొడుగ్గా, తెల్లగా,
తళతళ లాడుతూ కనిపించాయి గురవయ్య కళ్ళకి.
నాటు పడవల్లోకి తాళ్ళమోకులతో,
టేకుస్తంభాలకి వేలాడే కప్పీల సహాయంతో కళాసులు సరుకు దింపుతున్నారు.
"అరియా, అరియా" అని అరుస్తున్నారు. మధ్యమధ్యలో "అబీస్,
అబీస్" అనీ, "వదార్, వదార్" అనీ అంటున్నారు. కాసేపు
గమనించగా మోకుల్ని దించమనీ, లేదా ఎత్తి పట్టుకోమనీ వాటి అర్ధం అని
గురవయ్యకి బోధపడింది. అవన్నీ పారశీకపదాలు అనిఅతనికి తెలియదు. నిజానికి బందరనే
మాటే పారశీకం అని కూడా తెలియదు.
కొన్ని పడవలు సరకులతోనిండి భారంగా, ఓడలవైపు కదులుతున్నాయి. ఖాళీ
అయిన పడవలు తిరిగొస్తున్నాయి.
ఓడకరణాలు, గుమాస్తాలు ఏ
ఓడకోసం ఏ పడవలో ఎంతసరుకు దింపుతున్నారో లెక్ఖలు రాసుకుంటున్నారు.
ఖాళీగా తిరిగి వస్తున్న పడవల సరంగుల నుండి ఓడకప్తానులు రాసిచ్చిన
రశీదుల్ని పుచ్చుకొని భద్రపరుస్తున్నారు. గుమాస్తాల్ని దొరలు అజమాయిషీ
చేస్తున్నారు. రేవంతా కోలాహలంగాఉంది.ఎంత చూసినా గురవయ్యకి తనివితీరడం లేదు.తండ్రి
సిద్దయ్యకి ఇదంతామామూలే. అతని మోహంలో ఏ భావనా లేదు.
తిరిగొచ్చిన ఒక
పడవలోంచి ఒక దొరా, నలుగురు సిపాయీలూ రేవులో దిగారు. ఆ దొర చేతులకి ఒక
తాడు కట్టి ఉంది. ఆ తాడు చివర సిపాయీల చేతిలోఉంది. ఆ దొర పొట్టిగా,
సన్నగా మాసిన గడ్డంతో ఉన్నా అతని మోహంలో ఏదో తీవ్రత, పట్టుదల
కనిపిస్తున్నాయి.
"ఇతనెవడై
ఉంటాడు, నాయినా? దొంగా, దొరా? దొరల్లో కూడా దొంగలుంటారా?"
"ఏదో ఎదవ
పనిచేసి ఉంటాడు రా. మంచీ చెడ్డా అనేవి అన్నిచోట్లా ఉంటాయి".
గురవయ్యకీ జవాబు
సంతృప్తి కలిగించలేదు. అటుగా వస్తున్న ఒక గుమాస్తాని ఉద్దేశించి,
"అయ్యా,ఎవడండీ ఆదొర? సిపాయీలు అతన్ని ఎందుకు పట్టుకుపోతున్నారు? అని
అడిగాడు.
"వాడా? వాడు ఓడ
కప్తానే గాని బుడతకీచు సముద్రపు దొంగ. మన్సబ్ దారు
కచేరికి పట్టుకుపోతున్నారు. విచారించడానికి" అని ఆ గుమస్తా రేవు వైపు
నడిచాడు. గురవయ్య మదిలో వెయ్యి ప్రశ్నలుదయించాయి.
సిద్దయ్య కొడుకుతో, "చూసింది చాలు. ఇంక పదరా. ఎండెక్కింది" అని కోటగుమ్మం వైపు నడవడం మొదలుపెట్టాడు.
అయిష్టంగా తండ్రిని అనుసరించాడు గురవయ్య. కళాసుల కోలాహలం దూరంకాసాగింది.
రేవు శబ్దాల
స్థానంలో - మూడు నెలల పాటు ఘోషించిన పన్నెండు మగ్గాల
టకటకలు గురవయ్య చెవులలో గింగురుమన్నాయి. సంవత్సరం పొడుగునా చేసిన పనంతా
ఒకెత్తు; ఈ మూడు నెలల్లో పడ్డ శ్రమ మరోఎత్తు. గాలివాటం మళ్ళి
పోయిందనీ, దొరల ఓడలు బయలుదేరే సమయం దగ్గర పడిందనీ,
జరూరుగా సరుకు చేరవెయ్యమనీ బందరు శెట్టి కబురు మీద కబురు. శివరాత్రికి కాస్త
అటూఇటూగా వచ్చే దొరల ఓడలన్నీ దసరాకల్లా తిరుగుప్రయాణం కదతాయని అందరికీ
తెలుసు. అయినా ఆఖరి నిముషంలో హడావుడి తప్పదు.
సమయానికి సరుకు గోదాముకి చేర్చాం. ఇప్పుడేమంటాడో? ఎంత ముట్టజెపుతాడో? గురవయ్య వేసిన కాకిలెక్ఖ్ఖ ప్రకారం నాలుగు బంగారు పగోడాలైనా కిట్టాలి. అతనికి తండ్రి మీద గుర్రుగా ఉంది; ప్రతిసారీ ఈ శెట్టికే అమ్ముతానంటాడు; ఎంతిస్తే అంతే పుచ్చుకుంటాడు. నాలుగుచోట్ల వాకబు చేసింది లేదు. ఎక్కడ గిట్టుబాటుగా ఉంటుందో అన్న ఆలోచనే లేదు. మొన్న పడ్డ వర్షాలకి చిత్తడిచిత్తడిగాఉన్న తోవంట కోటగోడ
దాటి మౌనంగా ఊళ్లోకి నడుస్తున్నారు. ఏదైనా మాట్లాడాలని గురవయ్యకి మహా
ఉబలాటంగా ఉంది.
వెనకాతల్నించి "ఒహోం, ఒహోం, హోం ...... ఒహోం, ఒహోం, హోం" అన్న బోయీల పదం వినిపించింది. పరదాలు మూసి ఉన్న పల్లకీ ఒకటి వాళ్ళనిదాటుకుంటూ ముందుకి వెళ్ళింది.
"ఎవరో పెద్దింటి ఆడమనిషి అయ్యుంటుంది కద నాయినా?" అన్నాడు గురవయ్య తండ్రితో.
సిద్దయ్య పెదవి విప్పలేదు. పెద్దబజారులోంచి
నడుస్తున్నారు. అటూ ఇటూ దుకాణాల సందడి.
ధడేల్మని పెద్ద శబ్దం అయింది.
"ఫిరంగి శబ్దం కదా నాయినా?"
"ఆ, మిట్ట మధ్యాన్నం కాగానే కోట మీద ఫిరంగి పేలుస్తారు....... రశీదు భద్రం" అన్నాడు.
"ఆ…భద్రంగా ఉంది" అన్నాడు గురవయ్య జుబ్బాకి ఉన్న జేబు ని తడుముకుంటూ.
ఫిరంగి సంగతి చిన్నప్పుడే గురవయ్య తండ్రినోట విని ఉన్నాడు. తెలిసి కూడా మళ్ళీ అడిగాడు. తండ్రి నోట మరోసారి ఈ జవాబు రాబట్టినాక అతనిలో సరికొత్త ఉత్సాహం ఉప్పొంగింది. అసలు బందరుపట్టణంలో అడుగు పెడితేనే అతనిలో ఎక్కడలేని కులాసా, ఖుషీ ప్రవేశిస్తాయి. ఇంకో రెండు రోజులుఉండాలని ఉంటుంది. ఈ నాయిన మాత్రం ఎంత తొందరగా పని ముగించుకొని స్వగ్రామం పోదామా అని చూస్తుంటాడు.
"అనవసరమైన ఖర్చులుతప్ప చేసేది ఏముందిరా ఈ వూళ్ళో?" అంటాడు పైగా.
సిద్దయ్య ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. సుబ్బయ్యశెట్టి వద్దతన చిన్నకూతురుపెళ్లికిగాను చేసిన అప్పుమీద వడ్డీకింద ఎంత మినహాయించు కుంటాడో? మొత్తం తీర్చిపారేస్తే ఎలా ఉంటుంది? ఇంక అప్పులంటూ ఉండవు. కొత్త మగ్గాలు కొనేది ఎట్టాగూ లేదు. ఈ పన్నెండు మగ్గాలతోనే నానా తీన్తారుగా ఉంది. వయస్సు మీద పడుతున్నది. ఇకముందు ఏమి చెయ్యాలన్నా గురవయ్యే నిభాయించుకోవాలి. కొడుకు పనిమంతుడే
గాని దుందుడుకుతనం హెచ్చు.
ఈ మధ్య గురవయ్య తరచూ కల్లు దుకాణంలో కనిపిస్తున్నాడని ఒకరు చెప్పారు. ఈ కాలం పిల్లలు పూర్తిగా చెడిపోతున్నారు. అందులోనూ బందరు లాంటి పట్టణాల్లో అయితే ఇహ చెప్పనక్కర్లేదు. వీడికి ఈ ఊరంటే ఏదో వెర్రి వ్యామోహం. కుర్రతనం పూర్తిగా పోలేదు.
అలాగని తెలివితక్కువ వాడూ కాదు. ఏది ఏమైనా ఏడాదిలోగా
వ్యవహారాలన్నీఓ కొలిక్కితీసుకొచ్చి కొడుక్కి అప్పజెప్పాలి;
కోడల్ని తీసుకురావాలి. భార్య పోయినా నిబ్బరంగా ఇద్దరు కూతుళ్ళకీ పెళ్ళిళ్ళు జరిపించాడు. ఊళ్ళో
వాళ్ళంతా తలోచెయ్యా వేసారు. తనంటే కులంలో ఆ గౌరవం ఉంది. అలాగే
కొడుకు పెళ్లి కూడా కానిచ్చేస్తే....మరణించిన
భార్య గుర్తుకొచ్చి సిద్దయ్య గుండె బరువెక్కింది.
"నాయినా, అటు చూడు! జోడు గుర్రాల బగ్గీ! లోపల దొరలు కూర్చున్నారు!" గురవయ్య చిన్న పిల్లవాడిలా
అరిచాడు.
నిజమే. భారీ పండుకోతుల్లాంటి ఇద్దరు దొరలు బగ్గీలో ఇరుగ్గా కూర్చొని ఉన్నారు. చెమ్కీ షేర్వానీలలో, రింగులు తిరిగిన సవరాల్లో, పొడుగాటి కత్తుల ఒరలతో,
పగటివేషగాళ్ళల్లా ఉన్నారు. అయినప్పటికీ అటు దుకాణాదారులుగాని, ఇటు దారినపొయ్యేవాళ్ళుగాని వాళ్ళని పట్టించుకున్నది లేదు.
"వాళ్ళే దొరలంటావు? వాలెండు దొరలా, పరాసులా, ఆంగ్లీలా లేకపోతే బుడతకీచులా?" తన లోకజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ గురవయ్య ప్రశ్నించాడు.
"ఏమోరా, నాకు వాళ్ళంతా ఒకేలా కనిపిస్తారు. అయినా ఎవరైతే మనకేమిటి? మన సరుకు మంచి ధరకి
కొనుక్కుంటే అదే చాలు". తండ్రి సమాధానం గురవయ్యకు
చిరాకు తెప్పించింది.
"నాయినా,
ఒకటడుగుతాను, చెబుతావా?"
"అడుగు".
"సుబ్బయ్యశెట్టి మన సరుకుని దొరలకి ఏ ధరకి అమ్ముతున్నాడో నీకేమైనా తెలుసా?"
"అది మనకి అనవసరంరా. మనకి గిట్టుబాటు అవుతున్నదీ లేనిదీ చూసుకోవాలి. అంతవరకే. ఆ తరవాత మనకి సంబంధం లేదు”.
"నీవన్నీ సత్తెకాలం మాటలు నాయినా. నాకు తెలుసు, ఎంత లాభానికి అమ్ముకుంటున్నాడో".
"ఏమిట్రా నీకు తెలుసు?" అన్నాడు సిద్దయ్య కొంచెం చిరాగ్గా.
"మనఊరి పంతులుగారి మేనల్లుడు పరాసులదగ్గర గుమాస్తాగా పనిచేస్తున్నాడు.
పండక్కి వచ్చినప్పుడు చెప్పాడు; రూపాయికి రెండు రూపాయిలైనా లాభం ఉంటుందట మన
శెట్టి గార్లకి. ఈ లెక్కన మరి ఆ
దొరలకి ఎంత లాభం ఉంటుందో? ఆ
సంగతి పంతులుగారి మేనల్లుడికి కూడా తెలీదు".
"లాభం లేకుండా ఎవడైనా వ్యాపారం చేస్తాడురా?"
"చెయ్యడు"
"మనం సంవత్సరం పొడుగునా బట్ట నేస్తున్నాం, శెట్టిగారికి అమ్ముతున్నాం. ఎప్పటికప్పుడు పత్రం లేకుండా నోటిమాట మీద బయానాలిస్తున్నాడు, ఒప్పుకున్న ధర చెల్లిస్తున్నాడు. కాని ఆయన అమ్ముకొనేది సంవత్సరానికి ఒక్క సారే. ఓడలన్నీ తిరుగు ప్రయాణాలకి లంగర్లు ఎత్తే సమయానికి శెట్టి
గారి గోదాము ఖాళీ అవుతుంది. అప్పుడే అతని చేతికి రొక్కం వస్తుంది. సంవత్సరం పొడుగునా పెట్టుబడి పెడుతున్నాడా లేదా?"
"ఆ గోదామేదో
మనమే కట్టుకోవచ్చు కదా? దొరలకి మనమే అమ్ముకోవచ్చు కదా?"
"గోదాములో ఉన్న సరకు మంటల్లో కాలిపోవచ్చు;
వర్షానికి తడిసిపోవచ్చు; ఎలకలో, చెదలో తినెయ్యొచ్చు. ఆ నష్టం ఎవడు భరిస్తాడు?
మన్సబ్ దారుకీ, దివాన్లకీ, లష్కర్లకీ
సమర్పించుకోవలసిన ఆశీళ్ళు, నజరానాలు, పేష్కష్ లూ, మమూళ్ళూ సరేసరి.
ఇవన్నీ మన బోటివాళ్ళం పడగలమా?"
"నువ్వు ఎప్పుడూ కోమటోల్ల వైపు నుంచే మాట్లాడతావు నాయినా"
"అలా అనకూడదు. శెట్టిగార్లు అనాలి"
"ఆ... మరేం ఫరవాలేదు. మధ్యలో ఈ మర్యాదలొకటి; పంతులు గారు, శెట్టి గారు - గాడిదగుడ్డు గారు"
వీడికి ఈ రోజున ఏమొచ్చింది? మరీ తలతిక్కగా మాట్లాడుతున్నాడు. అనుకున్నాడు సిద్దయ్య. తన తండ్రి నాలుగు మగ్గాలు అప్పజెప్పి పోయాడు.వాటినిపన్నెండు చేసాడు. అదృష్టం బాగుండి ఎక్కడెక్కడి దేశాల దొరలో గుమ్మంముందుకి వచ్చి ఎగబడిమరీ కొనుక్కు పోతున్నారు. ఇవాళ తన పేరు
మీద పది సాలీల కుటుంబాలు బతుకుతున్నాయి. మరాఠీదేశం నుండి
పొట్టచేత పట్టుకొని వచ్చిన రెండు రంగిరీజు కుటుంబాలు అద్దకాలు చేసుకుంటూ
బాగుపడ్డాయి. గురవయ్య కనీసం ఈ పన్నెండు మగ్గాలనీ నిలబెట్టుకుంటాడా? లేక ఉన్నది
ఊడగొట్టుకుంటాడా? తన తప్పు కూడా ఉందేమో.తల్లిలేనిపిల్లవాడనిగారాంచేసిన మాట వాస్తవమే.
సిద్దయ్య ఆప్పటికప్పుడొకనిర్ణయానికివచ్చాడు.మరో మూడు మగ్గాలైనా చేర్చి
అప్పజెప్పాలి. అంటే కనీసం మరో రెండేళ్ళు కష్టపడాలి; తప్పదు. అప్పటికి వీడు ప్రయోజకుడైతే సంతోషం.
సిద్దయ్యతండ్రి
యుక్తవయసులోనే వీరబ్రహ్మంగారి దీక్షపుచ్చుకొని చివరిరోజుల్లో
సాధువుగా మారిపోయాడు. మొదటినుండీ ఆయనమీద బ్రహ్మంగారి బోధనల ప్రభావం
ఉండింది. తనకి సిద్దయ్య అన్న పేరుకూడా అలాగే పెట్టారు.
బ్రహ్మంగారి ముఖ్యశిష్యుడు దూదేకులసాయిబు సిద్ధయ్యే మరి.తండ్రిని ఆ ప్రాంతపు
సాలీలు "గురువయ్య" అని గౌరవించేవారు. ఆపేరే కొడుక్కి పెట్టుకున్నాడు.
అది కాస్తా గురవయ్య అయింది. తండ్రి మార్గాన వెళ్లిపోవాలనే
కోరిక సిద్ధయ్యలో రోజురోజుకీ బలపడుతున్నది. కాని ఈ బంధనాలు మరింత చుట్టుకుంటున్నాయి.
"నాయినా, ఈ
సుబ్బయ్యశెట్టి మాత్రం దొరలకే ఎందుకమ్మాలి? బాగా పులిసి
ఉన్నాడు. తనే ఓడలు కొనుక్కోవచ్చు కదా?.... ఆ మాటకొస్తే మనమే ఒక ఓడ
కొనుక్కుంటే?...వారెవా, మన సొంత గోదాము, సొంత ఓడ...."
గురవయ్య ఊహల
లోకంలోకి వెళ్ళిపోయాడు.రేవుగట్టున నిలబడి సరంగుల్నీ, కళాసుల్నీ అజమాయషీ చేస్తూ
"అరియా, అరియా" అని అరుస్తూ సరుకులు దింపిస్తున్నట్టూ, నడుం మీద
చేతులు పెట్టుకొని ఠీవిగా నడుస్తూ ఓడ కరణాల లెక్కల్ని
సరిచూస్తున్నట్టూ పగటికల కన్నాడు. తండ్రి ఏదో అంటున్నాడు. గురవయ్య మళ్ళీ ఈ
లోకంలోకి వచ్చిపడ్డాడు.
"ఒరే, ఒక
మగ్గం కొనడానికే ముప్ఫై చెరువుల నీళ్ళు తాగుతున్నాం, మనం ఓడ కొనడమేవిటి? మీర్
జుమ్లా తరవాత మన దేశస్తులెవరికీ స్వంత ఓడలంటూ లేవు. మీర్ జుమ్లాకి పది ఓడలు
ఉండేవని, పారశీకదేశంతో వర్తకం చేసేవాడనీ మా నాయిన చెబుతూ ఉండేవాడు.
సుబ్బయ్యశెట్టి భయస్తుడు; ఓడ కొనేటంత సత్తా లేదులే గాని
తల్చుకుంటే వాటాదారుడు కాగలడు. అయినా ఈ రోజుల్లో స్వంత ఓడలెవరికున్నాయి?
అన్నీ కుంఫిణీల చేతుల్లోనే ఉన్నాయి. మొత్తం వ్యాపారమే వాళ్ళది".
'ఈ నాయినొకడు.
అన్నిటికీ ఏదో ఒక అడ్డుచెబుతాడు. ఈయనగారి ఆలోచనలు మగ్గం దగ్గర
మొదలై అక్కడితోనే ఆగిపోతాయి' అనుకున్నాడు గురవయ్య మనసులో.
"పోనీ మన
శెట్టిగార్లందరూ కలసి ఓ కుంఫిణీయే పెట్టొచ్చు కదా?" సిద్దయ్య దీనికేమనేవాడోగాని
సరిగ్గా అప్పుడే తండ్రీకొడుకులు కోమటివీధిలోకి ప్రవేశించారు.దొరలకుంఫిణీలన్నీ సరిగ్గా ఇదేమార్గంలో ఏర్పడ్డాయనీ, అంతేకాకుండా అవన్నీ
వారివారి రాజరికాలు ప్రసాదించిన గుత్తాధిపత్య వ్యాపారహక్కులుకలిగి ఉన్నాయనీ వాళ్ళిద్దరికీ
తెలిసే అవకాశం ఎంత మాత్రం లేదు.
కోమటివీధిలోని అన్ని
ఇళ్ళ మాదిరిగానే సుబ్బయ్యశెట్టిది కూడా ఎత్తుఅరుగుల పెంకుటిల్లు. అరుగుమీద
అటూఇటూ చెరో గుమాస్తానీ పెట్టుకొని చిట్టా పుస్తకాల మధ్య కూర్చున్నాడు
శెట్టి. పలకరింపులూ, మజ్జిగ తాగడాలూ అయ్యాక తండ్రీ కొడుకులు మెట్లమీద ఒక మెట్టు
దిగువన నీడలో కూర్చున్నారు. తండ్రి సైగ చెయ్యడంతో రశీదు తీసి
శెట్టికి అప్పగించాడు గురవయ్య. శెట్టి ఎంతిస్తాడో అనే ఆత్రుత అతని కళ్ళల్లో
కనిపిస్తోంది. ఆ క్షణంలో కూడా సిద్దయ్య మోహం నిర్లిప్తతతో నిండి
ఉన్నది.
ఒక గుమాస్తా
చిట్టాపుస్తకం తెరిచి సిద్దయ్యపేరున ఉన్న పాతబకాయిలూ, వాటిమీద వడ్డీలూ,
కొత్తగా ఆసంవత్సరంలో తీసుకున్న బయానాలూ వాటితాలూకు వడ్డీలు - ఈ
వివరాలన్నీబిగ్గరగా చదవడం మొదలుపెట్టాడు. సిద్దయ్య లేచినిలబడి
చేతులుకట్టుకొని "చిత్తం, చిత్తం" అంటున్నాడు.గురవయ్య కూర్చునే ఉన్నాడు.
తండ్రి వినయం చూస్తూంటే అతనికి మహాచిరాగ్గా ఉంది.
చివరికి తేలిందేమంటే
- ఒకపగోడా, రెండురూపాయిల, ఎనిమిదిఫణాల, నలభైకాసులు సిద్ధయ్యకి ముడతాయి. పైకి
'చిత్తం, చిత్తం' అంటున్నా సిద్దయ్య ఆలోచనలుముందుకి పరుగెత్తు తున్నాయి. అసలు
మొత్తం పూర్తిగా తీర్చే ప్రసక్తే లేదు. కొత్త మగ్గం కొనే అవకాశం
లేనేలేదు. రంగిరీజు వాళ్ళకి, వద్రంగులకీ ఇవ్వాల్సింది ఇంకా అలాగే ఉంది. పత్తి
అమ్మే శెట్టికి తీర్చవలసిన బకాయి ఇంకా కొంతఉంది.
శెట్టి
లోపలికివెళ్లి సిద్ధయ్యకి ఇవ్వాల్సిన మొత్తాన్ని ఒక చిక్కంలో పెట్టి ముడివేసి
అందజేశాడు. చిక్కం మొలలో దోపుకొని, గుమాస్తా చెప్పిన చోట
వేలిముద్రవేసాడు సిద్దయ్య. తండ్రీ కొడుకులిద్దరూ శెట్టిగారికి నమస్కారం చేసి సెలవు
పుచ్చుకున్నారు. మళ్ళీ ఎండలో నడుస్తున్నారు.
తండ్రి మోహంలో
మొట్టమొదటిసారి నిరాశానిస్పృహలు మెదలడం గమనించిన గురవయ్య తట్టుకోలేకపోయాడు.
తండ్రికి భరోసాకలిగించే మాట ఏదోఒకటిఅనాలని అతనికి చాలాఅనిపించిందిగాని ఏమనాలో
తట్టలేదు. కోమటివీధి దాటారు. సిద్ధయ్యే మొదట మాట్లాడాడు.
"ఇప్పుడు
బయిల్దేరినా అర్ధరాత్రికిగాని చేరలేం. ఈ డబ్బుతో రాత్రిపూట ప్రయాణం మంచిదికాదు. దేవాంగుల
సత్రంలో ఉందాం. తెల్లవారగానే బయిల్దేరుదాం".
"నువ్వెళ్ళు
నాయినా, నేను సాయింత్రానికి సత్రానికి వస్తాను. నాకో ఫణం ఇవ్వు. ఆకలిగా
ఉంది".
"భోజనానికి ఫణం
ఎందుకురా?" అని తన వద్ద విడిగా ఉన్న పదికాసులు తీసిచ్చాడు. "ఇది కూడా
ఎక్కువే" అంటూ.
'కల్లు తాగొద్దు'
అందామనుకున్నాడుగాని అనలేక పోయాడు. తండ్రీకొడుకులు విడిపోయి ఎవరిదారిన
వాళ్ళు వెళ్ళిపోయారు.
గురవయ్య వచ్చిన
తోవనే మళ్ళీ కోటగుమ్మం మీదుగా రేవువైపు వెళ్ళేదారిన నడుస్తున్నాడు.
రేవులో పొద్దున్న కనిపించిన దృశ్యాన్ని మళ్ళీ చూడాలనుకున్నాడు..... అదెలాగా
చూశాడు; మన్సబ్ దారు కచేరికి వెళ్లి సముద్రపు దొంగల విచారణ ఎలా జరుగుతుందో
చూస్తే.... ఎటూ తేల్చుకో లేక పోయాడు. ఈలోగా ఆకలి
ఎక్కువయింది గుమ్మం దాటగానే కల్లుపాక కనిపించింది. ఒక ముంతడు కల్లు
పుచ్చుకొని అక్కడే ఏదో ఒకటి తినేస్తే?. .
***
మన్సబ్ దారు కచ్చేరీ
లో ఆరోజు ఉదయం బుడతకీచు కప్తాను చేసుకున్న విన్నపం ఈ విధంగా ఉంది.
"సుమారు రెండువందల ఏళ్లక్రిందట
మీదేశానికి సముద్రమార్గం కనుగొన్నది మాపూర్వీకులే. మీదేశంతో నిరాటంకంగా
వ్యాపారం చేసుకోవడానికి మొదట జహంగీరు చక్రవర్తి గారినుండి, ఆ తరువాత షాజహాన్
ప్రభువులనుండి మాపూర్వీకులు ఫర్మానులు పొందిఉన్నారు. అంతేకాక మామతపెద్ద
అయినటువంటి పోపు మహాశయుడు పూర్వార్ధగోళాన్ని మాకున్నూ, పశ్చిమార్ధగోళాన్ని స్పెయిన్
దేశస్థులకున్నూ చెందినవిగా పవిత్ర సముద్రాల్ని విభజించి ఖాయిలా పరచియున్నాడు.
అందుచేత తూర్పు దేశాలన్నింటి తోనూ వ్యాపారం చేసుకొనే హక్కు మాకు మాత్రమె ఉన్నది.
ఇందుకుగాను ఆయా పరిసర సముద్రాలపై నౌకా యానం చేసే హక్కు కూడా మాకే చెంది
ఉన్నది. దురాశ మరియు దుర్బుద్ధితో నిండిన
డచ్చివారు, ఫ్రెంచివారు, ఆంగ్లేయులు మాయమాటలు చెబుతూ మాకు పోటీగా దిగారు.
ఫర్మానులను రాబట్టుకున్నారు. ఇదంతా కేవలం అన్యాయం, మోసం తప్ప వేరొకటి కాదు.
పైగా మొత్తం ప్రపంచానికి మతాధిపతి అయిన పోపును కూడా విశ్వసించని ఈ నాస్తికులు
తామే క్రైస్తవమత ప్రతినిదులమని చెప్పుకుంటూ ఇటు ప్రజల్ని, అటు ప్రభువుల్ని
మోసగిస్తున్నారు. కావాలంటే నన్ను బంధించి తీసుకొచ్చిన మీ
సిపాయిల్ని అడగండి. నాదొక శిధిలావస్థలో ఉన్న చిన్న పాతకాలపు ఓడ. నా తండ్రిగారి
నుండి నాకు సంక్రమించినది. నా ఓడ మీద ఫిరంగులు లేవు. అదే వారి కుంఫిణీ ఓడల్ని
చూడండి. ప్రతీ ఓడ లోనూ ఫిరంగులూ తుపాకులూ పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఏదో
నాకు చేతనయిన స్థాయిలో చిన్నగా వ్యాపారం చేసుకుంటున్న ఒంటిగాడిని. వీరందరూ ఏకమై
నాఓడ మీద ఫిరంగులు పేల్చి, బెదిరించి ఇక్కడికి మళ్ళించారు. మీకు
లేనిపోని మాటలు చెప్పి నన్ను ముద్దాయిగా మీ ముందు నిలబెట్టారు. నిజానికి
వీళ్ళే దగాకోరులు, అసలైన సముద్రపు దొంగలు. బుడతకీచు ఓడలేవీ కూడా తూర్పు తీరానికి
రాకూడదనేదే వీరి అసలైన లక్ష్యం. అందుచేత మీ సముఖానికి చేసుకొనే విన్నపం ఏమనగా
వీరి ఆగడాలను కట్టడి చేయించండి. అక్రమంగా నా ఓడనీ నన్నూ బంధిచినందుకుగాను, నన్ను
సముద్రపు దొంగగా చిత్రిస్తూ తప్పుడు ఆరోపణలు చేసినందుకు వీరిని శిక్షించండి.
వీరిపై సుంకాలను పెంచండి. మా బోటి బక్క వ్యాపారులకీ, మా దేశపు
ఓడలకీ తక్కువ స్థాయి సుంకాలతో ప్రవేశం కల్పించండి. ఇందుమూలంగా మీ వ్యాపారం
మరింత పెరుగుతుందనీ సుంకాల వసూళ్లు పెరుగుతాయనీ మనవి చేసుకుంటున్నాను. చివరిగా, మీ
మేలు కోరుతూ ఒక మాట. వీరిని ఎల్లప్పుడూ ఒక కంట కనిపెడుతూ
ఉండండి"
ఇందుకు
జవాబుగా, ప్రత్యర్ధులు ముగ్గురూ సంయుక్తంగా ఇలా విన్నవించుకున్నారు.
"అయ్యా, ఇదంతా
పాతపాటే. వీడొక మాయగాడు. అసలీ బుడతకీచులంతా అంతే. అందితే జుత్తు,అందకపోతే
కాళ్ళు పట్టుకొనే రకాలు. మహాసముద్రాలు అందరికీ
చెందిన స్వేచ్చ్చా విపణి సాగరాలు. వాటిని పంచిపెట్టడానికి పోపుకిగానీ,
ఇంకెవరికైనా గానీ ఏం అధికారం ఉంది? మొఘల్ చక్రవర్తి ఫర్మానా జారీ
చేసాడని దబాయిస్తున్నాడు. షాజహాన్ చక్రవర్తి వంగదేశంలో వీళ్ళ ఆగడాలను
అంతమొందించడానికి హుకుం జారీ చెయ్యలేదా? రాత్రికి రాత్రే వీరి పూర్వీకులు హుగ్లీ
నదిమీదుగా తమ ఓడల్లో పలాయనం చిత్తగించ లేదా? అప్పటితో తూర్పుతీరానికి రావడం
మానుకున్నారా లేదా? దొంగదారిన వస్తూ చేతికందిన సరకుని ఏదో
కాడికి తరలించుకి పోయే వాళ్ళని దొంగలనక ఇంకేమంటారు? గోల్కొండ ప్రభువులు
వీరికేప్పుడైనా ఈ చుట్టుపక్కలకి రావడానికి ఫర్మాను ఇచ్చారా? మరటువంటప్పుడు
ఇది దొంగతనం కాదా? పశ్చిమతీరంలో గోవాఅనే సువిశాల ప్రాంతం వీరి ఆధీనంలో
ఉంది. అక్కడ కోటలు కట్టుకొని యదేచ్చగా రాజ్యం ఏలుతున్నారు. ఆ దరిదాపులకి
కూడా మమ్మల్నెవరినైనారానిస్తున్నారా? అంతేకాదు అక్కడి ప్రజల్ని నానాహింసలూ
పెడుతున్నారు. బలవంతంగా వారిని తమ మతంలోకి మారుస్తున్నారు. గోల్కొండ
ప్రభువుల చల్లని పాలన వల్లనూ మీవంటి ఉత్తములైన రాజప్రతినిధుల వల్లనూ ఈ ప్రాంతంలో
వ్యాపారం సజావుగాసాగుతున్నది.ఇటువంటి చీడపురుగుల్ని చేరనిస్తే గనక మొత్తం
సర్వనాశనం అవుతుంది. అందుచేత మా విన్నపం ఏమిటంటే వీడి ఓడని జప్తు చేయించండి.
వీడిని బందిఖానాలో పెట్టండి. అప్పుడుగాని ఇటువంటి వాళ్లకి బుద్ది రాదు. ఇకమీదట
బుడతకీచులు తూర్పుతీరం జోలికి రారు".
ఇరుపక్షాల వాదనల్నీ
పారశీక భాషలోకి అనువదింపజేసుకొని విన్నాక మన్సాబ్ దారు భోజనానికీ, ఆ తరవాత కాసేపు
విశ్రమించడానికీ లేచాడు. విచారణ సాయింత్రానికి వాయిదా పడింది. నిజానికతను భోజనం
చేసాడుగాని విశ్రమించలేదు. తన సలహాదారులతో సంప్రదించాడు. ప్రధాన దుబాషీ అయిన
పెద పంతులుగారు మెరుపు తీగలాంటి సలహా ఇచ్చాడు. బుడతకీచు కప్తాను
వద్దనుండి ఏభై పగోడాలు జరిమానా గానూ, మరో ఏభై పగోడాలు లోపాయకారీగానూ
వసూలు చెయ్యడానికీ, ఆ మీదట అతడిని హెచ్చరించి విదిచిపెట్టడానికీ నిర్ణయమైంది.
అదేవిధంగా కుంఫిణీలు మూడింటి నుండీ - బుడతకీచుల్ని ఇక మీదట ఇటు రాకుండా
చేసేందుకుగాను అయిదువందల పగోడాలు ఖజనాకి నజరానా గానూ, మరో రెండువందల
పగోడాలు తిన్నగా మన్సబ్ దారు జేబులోకీ వెళ్లేటట్టుగా కూడా ఏర్పాటు
జరిగిపోయింది.
తీర్పు వినడానికి
వచ్చిన జనంతో కచేరీ నిండిపోయింది. ఆ జనంలోకి గురవయ్య కూడా వచ్చిచేరాడు.
అందర్నీ తోసుకుంటూ ముందు వరసలోకి వచ్చి నిలబడ్డాడు. అతని దగ్గర నుండి వస్తూన్న
కల్లు వాసనకి జడిసి కొంతమంది తప్పుకొని దారిచ్చారు. తమఊరి పంతులుగారి మేనల్లుడు పరాసుల
బృందంలో కనిపించాడు. ఇద్దరికీ పట్టరాని సంతోషం కలిగింది. చిన్ననాటి సంగతులు
ముచ్చటించుకున్నారు. పొద్దున్న కచేరీలో జరిగిన విషయాల్ని గురవయ్య
అతగాడిని అడిగి తెలుసుకున్నాడు. ఇంతలో మన్సబ్ దారు తన మందీమార్బలంతో రానే
వచ్చాడు.
మన్సబ్ దారు ఉర్దూ
కలిసిన పారశీకంలో ఇచ్చ్సిన తీర్పుని పెద్ద పంతులు - అక్కడున్న వారికోసం,
ముఖ్యంగా ముందు వరసలో ఉన్న శెట్టిగార్ల కోసం - తెలుగులోకి
అనువదించాడు. అందరూ శ్రద్ధగా విన్నారు. మన్సబ్ దారు లేచి
నిలబడ్డాడు. ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోవడానికి జనం ఉపక్రమించారు.
'ఏమిటీ
అర్థంలేని తీర్పు?' అనుకున్నాడు గురవయ్య. ఆవేశం పట్టలేక పోయాడు.
చేతులు జోడించి మన్సబ్ దారుని ఉద్దేశించి, "అయ్యా, తమరు చిత్తగిస్తానంటే ఒక
చిన్న విన్నపం" అన్నాడు.
'ఎవడు వీడు?'
అన్నట్లుగా దుబాషీ వైపు చూసాడు. పెదపంతులు అతని చెవిలో ఏదోచెప్పాడు. గురవయ్య కేసి
తిరిగి "సరే, చెప్పు" అన్నాడు.
"అయ్యా, మన
ప్రాంతాలకి వచ్చే దొరలంతా మన సరుకు కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళే. అందుచేత
వాళ్లెవరైనా మనకి ఒకటే. ఎక్కువ మంది వస్తే, వాళ్ళల్లో వాళ్ళు పోటీ పడితే మనకి
లాభమే గానీ నష్టం లేదు. మా బోటి వాళ్లకి అమ్మకాలూ పెరుగుతాయి, మంచి ధరా
పలుకుతుంది. ప్రభువుల వారి సుంకాలూ
ఎక్కువవుతాయి. అందుకని బుడతకీచుల్ని రాకుండా కట్టడిచెయ్యడం ఏమంత
మంచిపని కాదు. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఇంకోటుంది. మన సరుకుని మన
ఓడలమీదే ఎందుకు పంపిచకూడదు? పూర్వం అలా జరిగేదని విన్నాను. మన
శెట్టిగార్లు కలసికట్టుగా ఓడలు కొనుగోలుచేసినడిపించవచ్చు. మన సరుకంతా మన
ఓడల్లోనే వెళ్లాలని మీరు గోల్కొండ ప్రభువుల వారికి సలహా యిస్తే వారు మీమాట
కాదనరు. మన శెట్టిగార్లు బాగుపడితే మాబోటి వాళ్ళుకూడా బాగుపడతారు. కాని ఒక్క మాట.
మన ఓడలమీద ఫిరంగులుండాలి. అప్పుడే సముద్రంమీద కూడా తమరిమాట చెల్లుతుంది. దొరలందరూ
వొళ్ళు దగ్గరపెట్టుకొని ఉంటారు. వాళ్లకి ఫర్మానాలు ఎన్నిచ్చినా గాని కోటలు
మాత్రం కట్టుకోనివ్వ కూడదు".
ఇదంతా
అన్నాక గురవయ్య కాళ్ళు కొద్దిగా వణికాయి. తనకింత ధైర్యం ఎలా వచ్చిందని
ఆశ్చర్యం కలిగింది. ఏది ఏమైనా మనసులోని మాట అందరి ముందూ చెప్పినందుకు
సంతోషంగా, తేలికగా అనిపించింది.
గురవయ్య మాటల
అనువాదం వింటూనే మన్సబ్ దారు మొహం కోపం తో ఎర్రబడింది. పంతులుతో ఏదో అని
విసవిసా వెళ్ళిపోయాడు. ఒకాయనెవరో గురవయ్య భుజం తట్టి, "చిన్నవాడివైనా మాబాగా
చెప్పావయ్యా" అన్నాడు.
ఇద్దరు సిపాయిల్ని
వెంటబెట్టుకొని కొత్వాలు బిరబిరావచ్చి గురవయ్య చెయ్యిపట్టుకున్నాడు.
ముందుకివంగి వాసన చూసాడు.
కచేరీలోకి కల్లుతాగి
వచ్చి అమర్యాదగా ప్రవర్తించినందుకు గురవయ్యకి రెండురూపాయిల జరిమానా, పది
కొరడాదెబ్బల శిక్షా విధించమైనది.
మరో రూపాయి తనకి
విడిగా ముట్టజెప్పమనీ, కొరడాదెబ్బలు మరీగట్టిగా కొట్టకుండా ఏర్పాటుచేస్తాననీ
కొత్వాలు గురవయ్య చెవిలో ఊదాడు.
ముంబై, 08
సెప్టెంబర్ 2015
Mobile: (+91) 9000
6010 68
Comment by DVR Rao (Nani), Pune
Comment by DVR Rao (Nani), Pune
The
story "tegina noolu pogu" by undurthi sudhakar is very interesting,
sounds realistic. gives a good picture of things in the 17th and 18th
century. day dreaming is fine but trying to implement it cost guravayya
badly.
I dint know there is a current telugu word for daydreaming.
what are the values of pagoda, panam and kaasu with respect to the roopayi?
how many roopayalu make one pagoda and how many panaalu make a roopayi?
what is a kaasu? is it smaller than a panam (an anna?) like a kaani or a dammidi?
No comments:
Post a Comment