Wednesday, October 24, 2012
BOOK REVIEW  - Part - 1
'కార్మిక గీతం' నవల, మారుతోన్న ఉత్పత్తి సంబంధాలు

నేపధ్యం
పారిశ్రామిక విప్లవం (సు.
1750) సృష్టించిన అవగాహన మూలంగా - సంపదని పెంచాలంటే సహజ వనరులూ, శ్రమశక్తీ (ఈ మాట ఇష్టంలేకపోతే 'మానవ వనరులు'), పెట్టుబడీ - ఈ మూడూ కలసికట్టుగాపనిచెయ్యాలనే స్పృహ - ప్రపంచపు నలుమూలలా, అన్ని సమాజాల్లోనూ, వర్గాల్లోనూ ఏర్పడి చాలా కాలం అయ్యింది. వనరులని విచక్షణా రహితంగా వినియోగిస్తే అది కాలుష్యం అవుతుందనీ, శ్రమశక్తి కి తగిన జీతభత్యాలూ, భద్రతా కల్పించకపోతే అది దోపిడీ అవుతుందనీ, పెట్టుబడికి తగిన ఆదాయం లేకపోతే అభివృద్ధి కుంటుబడి పెట్టుబడి, పరిశ్రమలు వేరేచోట్లకుపారిపోతాయనీ ఇవాళ అందరూగుర్తిస్తున్నారు.నిజానికి ఆధునిక మానవచరిత్రలోని అనేక సంఘటనలను, సందర్భాల్నీ పారిశ్రామిక విప్లవం సృష్టించిన పెట్టుబడి, కార్మిక వర్గాల మధ్య జరిగే సహకార-సంఘర్షణలకు ఆపాదించవచ్చు.  ఉత్తమ రచనలు, కళాప్రక్రియలు -ఆర్ధిక పునాదుల్లో, ఉత్పత్తిసంబంధాల్లో వచ్చే మార్పుల మూలంగా జీవనంలో, విలువల్లో, మానవసంబంధాలలో వచ్చేమార్పుల్నినమోదు చేస్తూనే మరో నాలుగడుగులు ముందుకి తమ దృష్టిని సారిస్తాయి.ఈ తోవలోనే నడిచిన 'కార్మికగీతం' నవలలోరచయత అక్కినేని కుటుంబరావుగారు హైదరాబాదు పరిసరాల్లో పుట్టి పెరిగిన పారిశ్రామికాభివృద్ధిని,ఆ నేపధ్యంలో ప్రైవేటురంగంలోని అసంఘటిత కార్మికుల స్థితిగతులను, వారిని సంఘటిత పరిచేందుకు తొలినాళ్ళలోజరిగిన వివిధ ప్రయత్నాలనుమన ముందుంచుతారు. 

పూర్తిగా కార్మికుల పైనే దృష్టి పెట్టిన నవలలు అతి స్వల్పం గనుక ఈ రచనకు ఒక విశిష్టత, చారిత్రికత  ఉన్నాయి. మొదట 1980లలో వెలువడిన ఈ నవలను సి.ఐ.టి.యు. వారి చొరవతో మళ్ళీ ఇటీవల పునర్ముద్రించారు. గడిచిన పాతిక ముప్ఫైఏళ్ళల్లో దేశంలో, రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం మారిపోయింది; పెట్టుబడి, పారిశ్రామిక సంబంధాల స్వరూప స్వభావాలు మారిపోయాయి. అలాంటప్పుడు ఈ నవలని ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులోని విషయాల్ని, ఆలోచనల్ని ఎలా అన్వయించుకోవాలి? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాలంటే మొదట మన దేశంలో పెట్టుబడిపారిశ్రామికీకరణ వ్యాప్తి చెందిన విధానాన్ని, ఉత్పత్తిరంగంలోవచ్చిమార్పుల్నిక్లుప్తంగానైనా పరికించాలి.  అందుచేత ఈ వ్యాసానికి మూడు లక్ష్యాలున్నాయి: మొదటిది 'కార్మికగీతం' నవలాకాలం నాటికి  పారిశ్రామీకరణలో వచ్చిన ప్రధానధోరణులను స్థూలంగా చర్చించడం; రెండోది ఆ నవలనిసమీక్షించడం; చివరిగాపెట్టుబడి, కార్మిక వర్గాల మధ్య నేడు ఏర్పడినసమకాలీనసహకార-సంఘర్షణల్ని పరికించడం. ఈ పరిధి విస్తృతమైనదిగనక కొన్నికుదింపులు, బేరీజులుతప్పవు. వాటికి ఉండే మినహాయింపులూ తప్పవు. 

వలస కాలపు భారత దేశంలోకి పెట్టుబడి ప్రవేశించి అక్కడక్కడా పరిశ్రమలంటూ నెలకొల్పినప్పుడు(సు.1800-1850) అది స్థానిక వ్యావసాయకోత్పత్తులు, సహజ వనరుల నిర్దిష్టతవలస పాలకుల తక్షణ అవసరాలూ - వీటి పైనే దృష్టిపెట్టింది.కాఫీ, టీ, నల్లమందు (చైనాకు ఎగుమతి)జనపనార, నూలు - వీటితో మొదలై  తరవాత దశలో (సు.1850 -1950)  రైలు మార్గాల వెంబడి, బ్రిటిష్ పాలకుల జీవన, పాలనా-యుద్దావసరాల  మేరకు పరిశ్రమలు పుంజుకున్నాయి. మొదట తెల్లవాళ్లు, తరవాత స్థానికులు (బొంబాయిలో పార్సీలు, కలకత్తాలో మార్వాడీలు) ట్రేడర్లు, సప్ప్లైయర్లు, కాంట్రాక్టర్ల రూపాల్లో ప్రవేశించి క్రమేపీ పారిశ్రామికవేత్తలయ్యారు.సువిశాలమైన భారతదేశంలో పారిశ్రామికీకరణ సరళంగా, సమతుల్యంగా,సర్వవ్యాపితంగా సాగలేదు. దూరదృష్టి కలిగిన కొందరు స్థానికులు, సంస్థానాధీశులు (హైదరాబాదుతో సహా) పరిశ్రమలనీ, కార్మికుల నైపుణ్యాలలో పెంపునీ ప్రోత్సహించారు; పెట్టుబడిని ఆహ్వానించారు. స్వతంత్రం వచ్చాక ప్రభుత్వరంగాల్లోని పెట్టుబడి, భారీ పరిశ్రమలు, ప్రాజెక్టులు, అవి కల్పించిన రాయతీలు, అవకాశాలు, కాంట్రాక్టులు, వెసులుబాట్లు- వీటి  వెంబడేప్రైవేటురంగం నిలదొక్కుకొని వృద్ది చెందింది. నిజానికి ప్రభుత్వరంగంలో పెట్టుబడులు, భారీ పరిశ్రమలు, ప్రాజెక్టులు- నేడు అంతా తిట్టిపోసే సోషలిస్టు మోడల్ లోనే, నెహ్రూ హయాంలోనే - పంచవర్ష ప్రణాళికల ధర్మమా అని సాధ్యంఅయ్యాయి.
స్వతంత్రం తరవాత త్వరితగతిన వ్యాప్తి చెందిన బ్యాంకింగు వ్యవస్థ అందించిన సహకారాన్నీ, వ్యవసాయరంగంలోని మిగులునూ ఉపయోగించి పెట్టుబడిని చేకూర్చుకున్న ప్రైవేటు రంగం - రైసు మిల్లులు, పంచదార ఉత్పత్తితో మొదలుపెట్టి ఇతరవ్యవసాయాధార పరిశ్రమలగుండా ప్రయాణించింది. ఆర్ధిక సంస్కరణల అనంతరం ఎగుమతుల్లో, ఐటీ, మౌలికసదుపాయాల(ఇన్ఫ్రాస్ట్రక్చర్) రంగాల్లో నిలదొక్కుకుంది. ప్రభుత్వరంగం సృష్టించిన సాధనాలను, అందించిన కాంట్రాక్ట్ లనూ, పెంచిన  కార్మికవర్గ నైపుణ్యాలను, తర్ఫీదునిచ్చిన ఇంజినీర్లను, మేనేజర్లను  అలాగే ప్రభుత్వ అసమర్థతనూ, అవినీతినీ, వైఫల్యాలనూ ప్రైవేటురంగం పూర్తిగా వినియోగించుకున్నది. లైసెన్స్-పెర్మిట్ వ్యవస్థని తనకు అనుకూలంగామలుచుకున్నది.విద్యావైద్యరంగాల్ని కూడా ప్రైవేటురంగ పరిశ్రమలుగా మార్చడంలో విజయవంతం అయ్యింది.  ఆర్ధిక సంస్కరణ ల తరువాత ప్రపంచీకరణ, ఎగుమతుల్లో వృద్ది, విదేశీ సంస్థలూ, పెట్టుబడులూ, పరిశ్రమలూ పెద్దఎత్తున తరలిరావడం మొదలైంది.  ఇదీ స్థూలంగా - భారతదేశపు పారిశ్రామికీకరణలోని క్రమం.
U.Sudhakar.
Mumbai

No comments: