Wednesday, August 22, 2018

                                                                ఎలెక్ట్రా
                                                                                 ఉణుదుర్తి శ్రీనివాసు
.
                     అద్భుతాలు జరుగుతాయని వినడవే గాని అనుభవంలోకి యెప్పుడూ రాలేదు.అవేళ వచ్చిన   వుత్తరం నా జీవితంలో వొక మహాద్భుత సంఘటన. ఏ సదుపాయాలూ లేని వొక మారుమూల పల్లెటూళ్ళో,ప్రాణాంతకమైన ఆపరేషను విజయవంతంగా ముగియడం .... దేముడిమీద నమ్మకాన్ని పెంచుతుంది. ఈ వుత్తరం కూడా నాకు అలాటి భావనే కలిగించింది.                                                                                                                                                 
.      " ఈ ఇ- మెయిల్ తప్పకుండా నీకు చేరుతుందని నమ్మకం తో వ్రాస్తున్నాను. (వుత్తరం యింగ్లీషులో వుంది. దాని తర్జుమా యిక్కడ వ్రాస్తున్నాను) నీ మెయిల్ ఐ.డి ,ఎడ్రస్సూ ఎలా దొరికాయని ఆశ్చర్యపోకు. ఆ రోజుల్లోమనకి సీనియరు.నీకు జ్ఞాపకం వున్నాడనుకుంటాను,దెబోబ్రతో,ఫాస్ట్ బౌలరు , నాతో బాటు యూనివర్సిటీకి కూడా ఆడాడు. ఈమధ్య కలిశాడు,అతడి దగ్గర  నీ మెయిల్ ఎడ్రెస్సు తీసుకొన్నాను.నువ్వెక్కడున్నావో,యే వూళ్ళోనో,యేదేశం లోనో కూడా తెలియదు.మోడరన్ టెక్నాలజీ యెంత ముందుకెళ్ళిపోయిందో కదూ ".
     "గత నలభయ్ సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మన జీవితాలలో- రూపంలో, జీవనవిధానంలో  చాలా మార్పులు వచ్చివుంటాయ్. కొన్ని మంచివి అవొచ్చు,కొన్ని అంత మంచి కాకపోవచ్చు.మొత్తమ్మీద మార్పు అన్నది సహజం,నువ్వంటూండేవాడివి "చేంజ్ ఈస్ కాంస్టెంట్”. గడచిన  యీ నలభయ్ సంవత్సరాలలో జరిగినవి, చెప్పుకోవలసినవి,చెప్పవలసినవి చాలా వున్నాయ్. అవన్నీ యీ వొక వుత్తరంలో ఎన్ని పేజీలు రాసినా సాధ్యం కాని పని. ఇది అందగానే యెక్కడున్నా బయల్దేరి వచ్చేయ్ ఎందుకంటే ఈ జాబు ఎప్పటికి అందుతుందో తెలియదు. అందుకోవడానికి అసలు నువ్వున్నావో... లేవోకూడా... తెలియని ...ఒక భయంకరమైన...  చెడ్డ వూహ...? చిన్నప్పటంత హుషారుగా,చలాకీగా,ఆరోగ్యంగా వుంటావనీ నమ్మకం." "నీ కోసం ,నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ..".                                                                                                                                                                                                                                                                         
                                                                                    రాజన్
పి.ఎస్  నా ఎడ్రసు :  డా.సి.జి.రాజన్,ఎం.ఎస్.
                           సి.సి.హాస్పిటల్,సబ్జిమండి ,
                           అల్వర్ -రాజస్థాన్ ( సెల్:900001)
             వుత్తరం చదవగానే నాకు మొదట యేవీ అర్ధం కాలేదు. మళ్ళీ మళ్ళీ చదివాను. ఏ నాటి రాజన్,మా ఇద్దరిదీ ఎటువంటి స్నేహం,అంతా ఒక్కసారిగా గుర్తుకొచ్చి ఒక చెప్పలేని అనుభూతికి లోనయ్యాను.కళ్ళు చెమర్చాయి. ముందర ఫోను చేద్దామని వెళ్ళాను,కాదు ముందర రైలు రిజర్వేషను,కాదు ఫ్లయిటు బుకింగు.అసలు నా భార్యకి ముందర ఈ శుభవార్త చెప్పాలి కదా.తన మాటే మర్చిపోయాను.తనకి చెప్పాక తానే అంది “శుభ్రంగా ఫ్లయిటులో ఢిల్లీ వెళ్లి,అక్కడనుండి రైల్లోనో,బస్సులోనో అల్వర్ వెళ్ళు.పొద్దున్నే టాక్సీ చేయించుకుని విశాఖపట్నం వెళ్ళు”.అలాగే అని ఆన్ లైన్ లో అన్ని చేసేసి ,రాజన్కి  ఫోన్ చేశాను. నాకన్నాఎక్సయిటుమెంటులో వున్నాడు వాడు. ఆ ఉద్విగ్నతలో యిద్దరం కొట్టుకు పోయాం. మాట్లాడుకోలేకపోయాం. తమాషా యేవిటంటే నేను నా మొదటి వుద్యోగం రాజస్థానులోనే, అల్వర్ పక్క జిల్లా భరత్ పూర్ లోనే. ఒక రెండుసార్లు అల్వర్ వెళ్ళానుకూడా. ఆ రోజుల్లో బరంపురం నుంచి భరత్పూరు వెళ్ళడానికి రెండున్నర రోజులు పట్టేది. ఇప్పుడు .... రేప్పొద్దున్న బయల్దేరి సాయంత్రానికి అక్కడ వాలొచ్చు. ఢిల్లీలో నా స్నేహితుడు మాథూరికి వీలయితే ఎయిర్ పోర్టుకి రమ్మని చెప్పాను, అతన్ని కూడా కలిసి ఏడాదిపైనేఅవుతొంది.
             పొద్దున్నే బయలుదేరి ఫ్లయిటులో ఢిల్లీ వెళ్లి, అక్కడినుండి పొద్దున్నపదకొండుకి రైల్లో వెల్దామని ప్లాను.  మాథూరు కారు పట్టుకొచ్చాడు.ఏసీ చైర్ కార్ ,నాలుగు గంటల ప్రయాణం.రైలెక్కెంచేసి మాథుర్ వెళ్ళిపోయాడు. పుస్తకం చదువుదామని తీశాను గాని ఆలోచనలు గతంలోకి జారుకుని జ్ఞాపకాలు తరుముకొచ్చాయ్.   
   ***                           ***                                      
            నీలంరంగు ట్రౌజర్సు ,ఎడమచేతిలో గొడుగు,భుజంమీదనుండి వేళ్ళాడుతున్నపుస్తకాల సంచీ. ఇదీ మొట్టమొదటిసారి రాజన్ పరిచయమైనప్పటి రూపం.గుండ్రటి మొహంమీద దగ్గరగా నీగ్రోవాళ్ళ మాదిరి ఒత్తుగా నల్లటి ఉంగరాల క్రాపు. విశాలమైన నుదురుపై ఎర్రటి నిలువు నామం తెల్లటి ముఖం మీద మరీ ప్రస్ఫూటంగా కనిపిస్తోంది.తెలివైన చారడేసి కళ్ళు.కళ్ళతో నవ్వడమంటే మొట్టమొదటిసారిగా అవేళే రాజన్ వదనంలో చూశాను. బండగా కనిపిస్తున్న ముక్కు,కింద నూనూగు మీసాలు,యింకా యింకా షేవింగ్ మొదలు పెట్టలేదు కాబోలు,చెంపల మీద అక్కడక్కడా వెంట్రుకలు కనిపిస్తున్నాయి. పల్చటి పై పెదిమ,దళసరి కింద పెదవి మధ్యతెల్లని,చక్కటిపళ్లు మెరుస్తూ,నవ్వినప్పుడు  కాల్గెట్ కంపెనీ అడ్వేర్టైజుమెంటుఫోటోలోలాగాఆకర్షణీయంగా వున్నాయ్. సుమారు ఎత్తు,ఎత్తుకి సరిపడే లావు,కాళ్ళకి కాబూలీ శాండల్స్ వేసుకొని ఆరవ యాసతో యింగ్లీషులో మాట్లాడుతున్న రాజన్ ని చూసి "ఎవడో తమిళపిల్లాడిలా వున్నాడు" అనుకున్నాం నేను,అన్నయ్యా.మా వూహ నిజమే. హీరాకుడ్ డామ్ ఆఫీసులో చక్రవర్తి గారు పని చేస్తూంటారు. అన్నయ్యకి ఆయనతో పరిచయం వుందిట. ఆయన పుత్రుడే ఈ అబ్బాయ్ .పేరు చక్రవర్తి గోవింద రాజన్.
              సంబల్పూరు జి.ఎమ్. కాలేజీలో  ఇద్దరం బీఎస్సీ మొదటి సంవత్సరంలో బైపీసీ గ్రూపులో చేరాం. ఒరిస్సాలో మొదటి సంవత్సరం బీఎస్సీ యూనివర్సిటీ పబ్లిక్కు పరీక్షవుండేది. అది పాస్ అయి గ్రూపు బట్టి సీటు దొరికితే ఎంబీబీఎస్ లోనో,ఇంజినీరింగులోనో చేరిపోవచ్చు. లేకపోతె బిఎస్సి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇద్దరం బుర్లాలోనే వుండడం,కలిసి రోజూ బస్సులో ప్రయాణం,భోజనం కేరియర్ లో పట్టుకెళ్ళేవాళ్ళం.కలిసి తినడం,ఎప్పుడైనా సినిమాకి వెళ్ళేవాళ్ళం. సాన్నిహిత్యం బాగా పెరిగి మంచి స్నేహితులమయిపోయాం. తమిళయాసలో,చక్కటి ఇంగిలీషులో ఎన్నో విషయాలు చెప్పేవాడు. స్వంతవూరు మద్రాసే. అక్కడే అమ్మమ్మగారివద్ద వుండి ప్రియూనివర్సిటీ దాకా చదువుకున్నాడు.పై చదువులకని తల్లితండ్రుల దగ్గరకు వచ్చేశాడు. ఎంబీబీఎస్ చదువుదామని మా యిద్దరి ధ్యేయం.  క్రికెట్టూ,నాటకాలూ నా అభిమాన విషయాలు,కానీ నా గార్డియనూ కమ్ పెద్దదిక్కూ అయినా అన్నయ్య అవన్నీ కట్టి పెట్టిచదువుమీద దృష్టి పెట్టమనడంతో ఆ సరదాలు వదిలేశాను. రాజన్ స్నేహంతో ఇంగ్లీషు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాను.రాజన్ యింకో ప్రావీణ్యం,వయోలిన్ వాయించడం. మద్రాసులో మ్యూజిక్ కాలేజీ లో చిన్నప్పటినుండే నేర్చుకున్నాడుట. అమ్మమ్మగారు కూడా సంగీత ప్రావీణ్యురాలు కావడంతో రాజన్ మంచి కళాకారుడిగానే రాణించాడు.యిప్పటికీ సాయంత్రాలు ఓ గంట సాధన చేస్తూండేవాడు.
                  ఆ సంవత్సరం పరీక్ష పాసవడం, ఎంబీబీఎస్ లో చేరడం సవ్యంగా జరిగిపోయాయి. అన్నయ్యకి భువనేశ్వరం ట్రాన్సఫర్ అవడంతో నేను హాస్టలుకి మారిపోవలసి వచ్చింది. ఇంకో రెండు నెలల తరువాత రాజన్ నాన్నగారికి ప్రమోషను రావడంతో ఆయన ఢిల్లీ వెళ్ళవల్సి వచ్చింది. మొత్తమ్మీద నేనూ,రాజన్ హాస్టల్ లో ఒకే రూమువాళ్లమయ్యాం. అదీ బాగానేవుంది కానీ హాస్టలు భోజనం మా యిద్దరికీ నప్పలేదు. ఒక సింగిల్ రూమ్ క్వార్టర్స్ అద్దెకు తీసుకుని,ఆంధ్రా మెస్సునుండి భోజనం తెప్పించుకునేవాళ్ళం.
                మెడికల్ కాలేజీలో వుత్సాహంగా  చేరినా,కొత్తలో బెరుకుగా,భయంగా వుండేది. సీనియర్లని  పలకరించాలన్నా,వాళ్ళతో మాట్లాడాలన్నా జంకుగా ఉండేది.ప్రొఫెస్సర్లంటే వణుకేను.కేడవార్స్ ని ముట్టుకోడానికి భయంతో కూడిన సంకోచం,అసహ్యం.ఫార్మాలిన్ వాసనకి తల  నొప్పి వచ్చేసేది.రెండు మూడు నెలల్లో క్రమేపీ మెడికల్ కాలేజీ రొటీన్ కి అలవాటు పడిపోయాం. కాలేజ్ క్రికెట్ టీములో నాకు బ్యాట్స్ మేన్ గా,రాజన్ కి స్పిన్ బౌలర్ గా చాన్సు దొరికింది,దాంతో వందమందిలో మాకో ప్రత్యేకత వచ్చింది.
                   మా క్లాసులో నాతోపాటు ఇద్దరు తెలుగు అబ్బాయిలు ,వొక అమ్మాయి వుండేవారు. రామారావు,నరసింహం,ప్రభావతి.మా నాలుగురుతోబాటు రాజన్ కూడా తెలుగు కుర్రాడిలాగే మాతో కలిసిపోయాడు. నలుగురిలో రామారావు తప్ప మిగతా ముగ్గురం వొకే వయసు వాళ్ళం. రామారావు మాకన్నా నాలుగైదేళ్ళు పెద్ద వుంటాడు. ఒక్క అమ్మాయే కావడంవల్ల నన్ను తప్పించి మిగతా ముగ్గురు మధ్య ఆమె ప్రాపుకోసంవొక ప్రచ్ఛన్న పోటీ వుండేది.
              మొట్ట మొదటి సారి ప్రభావతి నా పేరును  బట్టి నేను తెలుగబ్బాయినని పోల్చుకుంది.డిసెక్షన్ హాలుకి వెళ్తున్నప్పుడు తానే నాతొ ...                                                                                                                                                             
      "మీరు తెలుగు వారుకదూ...యూ. శ్రీనివాస్?!!                                                                                                                                                                                            
      "అవును...మీరు…..."                                                                                                                                                                                                                              
      "నేనూ తెలుగమ్మాయినే, పేరు పోతపాటి ప్రభావతి ...మాది శ్రీకాకుళం దగ్గర పాలకొండ.అఫ్కోర్స్ నా చదువు ఢిల్లీ నుండి పాలకొండ దాకా దేశం అంతటా జరిగిందనుకొండి…బికాస్ నాన్నగారు మిలిటరీలో ఇంజినీరు. దేశవంతా తిరిగాం. ప్రస్తుతం రూర్కెలా స్టీలు ప్లాంట్లో పనిచేస్తున్నారు. అలా మనం బుర్లా రావడం జరిగిందన్నమాట" అని ఫక్కుమని నవ్వింది.
      "మరి తమ్ముడి మాటో ...!”అన్నాన్నేను
      “అబ్బో ...మీరు కూడా హాస్యప్రియులేనే, అయితే యీ అయిదు సంవత్సరాలూ హ్యాపీవే..... అన్నమాట"అంది, "అన్న" వత్తి పలుకుతూ. ఇద్దరం నవ్వుకున్నాం. అవేళే ప్రభావతిని రాజన్ కి పరిచయం చేశాను.ఆ అమ్మాయికి మా సన్నిహితత్వం కూడా చెప్పాను.
                     అటెండెన్సు రిజిస్టర్లో  ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేర్లు వుండేవి. ఆ ఆర్డర్లో నా నంబరు "100."ఆఖరిది. సి.గోవిందరాజన్ "25",పి.ప్రభావతి "50". మా రోల్ నంబర్ల గురించి ప్రభావతి తమాషాగా విశ్లేషించింది.“మీరు  (నన్ను వేలుతో చూపిస్తూ)వంద,మీలో సగం నేను - యాభయ్,నాలో సగం తను - పాతిక (రాజన్ ని చూపిస్తూ).భలే తమాషాగా వుంది కదూ!" అంది చేతులు రెండూ చరుస్తూ. ఈ అమ్మాయికి యింకా చిన్నతనం పోలేదు అనుకున్నాను. అప్పుడు  యేదో సరదాగా అనేసినా ముందు ముందు ఆ మాటకి చాలా అర్ధాలు ...వెతుక్కోవలిసిన పరిస్థితులు కలిగాయి.
               మేం ఫస్టుఇయర్లో చేరేటప్పటికి  ప్రభావతి పద్దెనిమిదేళ్ల పడుచు. ప్రాయంలో వున్నఆడపిల్ల..!.. సహజంగానే ఆ వయసులో వుండే  అందం,ఆకర్షణతోపాటు చలాకీతనం ఆ అమ్మాయి ఆకర్షణనీ,అందాన్నీ ద్విగుణీకృతం చేశాయనుకుంటాను.ప్రభావతి వదనంలో ప్రధానమైన ఆకర్షణ ఆమె కళ్ళు,ఉంగరాల జుట్టూను. కావాలని వదిలేసేదో లేక దువ్వెన కి లొంగేవికాదో గాని యెప్పుడూ  నుదుటిమీద రెండుమూడు రింగులు కదులుతూవుండేవి. విశాలమైన నుదురు,తీర్చిదిద్దినట్లుండే నల్లటి కనుబొమ్మలు,వాటికింద అందమైన కళ్ళు... సూటిగా చూసే ఆ కళ్ళలో అమితమైన ఆత్మ విశ్వాసం, ధీరత్వం కనిపించేవి. పైకి నిర్మలంగా,అమాయకంగా కనిపించినా ఆ కళ్ళలో అప్పుడప్పుడు కొంచెం కొంటెతనం కూడా కనిపించేది.సూదిగా,నిక్కచ్చిగా,నిటారుగా వుండే ముక్కు కింద పల్చటి పెదాలు. కింద పెదవికి ఎడంవయిపు చిన్న నల్లటి పుట్టుమచ్చ.ఆమె వంటి రంగు చామన చాయకి  ఒక పాలు హెచ్చుగానే వుండేది.
         సన్నటిమెడ,అప్పుడప్పుడేరూపుదిద్దుకొంటూ, నిండుతనం సంతరించుకుంటున్న  రొమ్ములూ,గుండ్రటి భుజాలు,నాజూకైన చేతులూ,సుమారు పొడవు,ఆ పొడువుకి తగ్గ నడుమూ,ఆమె పరిపూర్ణ స్త్రీరూపం సంతరించుకుంటోంది               
           ప్రభావతితో తెలుగులో మాట్లాడడానికి రాజన్ చాలా యిబ్బంది పడేవాడు.ఇబ్బంది యేవిటంటే  తన తమిళ ఉచ్చారణ ని హాస్యం పట్టించి యెగతాళి చేస్తుందేమోనని జంకు. అప్పటికీ వీడి యిబ్బంది గ్రహించి తను యేవీ అనేదికాదు. పైపెచ్చు  " నువ్వలా నాతొ యింగిలీషులో మాట్టాడకు,పరాయివాడిలాగ , శ్రీనుతో యెలా వుంటున్నావో నాతొ కూడా అలాగే ఫ్రీగా వుండొచ్చుకదా."అనేది.
                   క్లాసులో ముగ్గురం వొక్కదగ్గరే కూర్చునేవాళ్ళం. నాకు సిగరెట్టు కాల్చే అలవాటుండేది. . "ఛీ నీ సిగరెట్టు కంపు నాకు పడదు,దూరంగా పోయి కూర్చో" అనేది. రాజన్ మాత్రం అతి జాగ్రత్తగా కాలేజీ చుట్టుపక్కల సిగరెట్టు వెలిగించడం,మానేశాడు ప్రభావతి దగ్గర కూచోవడం కోసం.
      “నువ్వు క్రికెట్టు ఆడతావుగా పేద్ద పోజుగా, సిగరెట్టు నీకు మంచిది కాదు.రాజన్ ని చూడు చెత్త అలవాట్లు లేవు"అనేది...                                                                                                                                                                                           
     “అవును నేను బౌలింగుకి మెదడు వుపయోగించాలికదా సిగరెట్లు కాలిస్తే మెదడు మొద్దుబారిపోతుంది. వీడిలా బండగా బాదడం కాదు" అనేవాడు.
                   రూముకి వచ్చేక రాజన్ ప్రభావతి గురించి మాటి మాటికీ ప్రస్తావించేవాడు. నేను మాత్రం  "ఒరే రాజన్! యిప్పుడు మనం యింకా టీనేజ్ లోనే వున్నాం. ఇప్పుడిప్పుడే మన బతుకులకు గమ్యం పెట్టుకున్నాం.మన వయసు వాళ్లలో చాలామందికన్నా మనం నయం.అలా అని తప్పటడుగు వేశామో ...యింతే సంగతులు..! బోరగిల్లా పడడం ఖాయం. నువ్వు మీ అమ్మానాన్నలకు వొక్కడే కొడుకువి.నేను నలుగురిలో ఆఖరి వాడిని. రిటైరయిపోయిన మా నాన్నగారు మా అన్నయ్యల సాయంతో నన్ను చదివిస్తున్నారు. అందుకని  ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మనం మెలగాలి".
                        మేం ఫస్ట్ ఇయర్ లో వున్నప్పుడే ప్రభావతి నాన్నగారు,అమ్మ,తమ్ముడూ రూర్కెలానుండి కారులో వచ్చారు. ఆయన, కల్నల్ సోమశేఖరశర్మ పోతపాటి,మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ లో యిరవై యేళ్లు పనిచేసి  ఆర్మీ నుండి రిటైర్మెంట్ తీసుకొన్నారు. ప్రస్తుతం రూర్కెలా స్టీల్ ప్లాంటులో డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో పని చేస్తున్నారు. ప్రభావతి తల్లి,సుజాతగారు,ప్రభావతి కన్నా ఓ అంగుళం పొడుగ్గానే వున్నారు, పొడుగుకు తగ్గ లావు,చక్కగా జుట్టు ముడి వేసుకుని యిమ్ముగా చీర కట్టుకుని చాలా హుందాగా వున్నారు. నలభై సంవత్సరాల వయసంటే నమ్మబుద్ధి వేయలేదు.ప్రభావతి కి అక్క అంటే నమ్మేసేట్టుగావున్నారు. ఆమాటే రాజన్ ధైర్యం చేసి  అనేశాడు.ఆవిడ చాలా సంతోషించినట్టే “యూ..నాటీ బాయ్”అన్నారు.తన పేరెంట్స్ వచ్చినప్పుడు మా బృందంఅందరినీ,రామారావ్,నరసింహం, నన్ను,రాజన్లని తన అత్యంత సన్నిహిత స్నేహితులుగా పరిచయం చేసింది ప్రభావతి. ఆవిడా ,శర్మగారూ మా అందరి కుటుంబ వివరాలూ అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ లో పనిచేయడం వల్ల కాబోలు ఆయనకి చాలా భాషలు వచ్చు. రాజన్ తో తమిళంలోనే మాట్లాడారు.దాంతో రాజన్ చాలా సరదా పడిపోయి ఆయనికి తానొక క్లోజ్ పెర్సన్లా ఫీలయిపోయాడు.  ప్రభావతి కి వొక అన్న,జయరాం వున్నాడు,ఇంజినీరుట. ప్రస్తుతం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీలో ఢిల్లీ లో పనిచేస్తున్నాడుట.తమ్ముడు భరత్ ఆ సంవత్సరమే మెట్రిక్ పాసయి, ప్రీ యూనివర్సిటీ లో చేరతాడు. ఏ గ్రూపు తీసుకుందామా అని తేలటం లేదుట. ఇవన్నీ ప్రభావతి తరవాత మాతో చెప్పింది.చాలా సరదా ఐన కుటుంబం. సంబల్పూరులో మంచి హోటళ్లు లేవు.అందువల్ల లంచ్ పేక్ చేయించి మమ్మల్నదర్నీ హిరాకుడ్ డామ్ కి తీసుకెళ్లి అక్కడ పిక్నిక్ లంచ్ పార్టీ యిచ్చారు .                                                                                                                                    వాళ్ళు వున్న ఒక్కరోజులో నేను గమనించిందేమిటంటే ప్రభావతి కి తండ్రి దగ్గరే హెచ్చు చేరిక అనీ, ఆయనంటే విపరీతమైన ప్రేమాభిమానాలు అనీ. ఆ విషయవే తరువాత ప్రస్తావిస్తే తాను నిజవేఁనంది.
                    ఆ తరువాత కూడా మా కాలేజ్ టీమ్ ఇంటర్ కాలేజ్ క్రికెట్టు మేచ్ లు ఆడడానికి రూర్కెలా వెళ్ళినప్పుడల్లా కల్నల్ గారింట్లో ఒకపూట కమ్మటి భోజనం. మా బృందాన్నందరినీ శర్మగారే  స్వయంగా కారులో తీసుకెళ్లి,తిరిగి దిగబెట్టేవారు. మ్యాచెస్ ఆడడానికి మేం చుట్టుపక్కల కాలేజీలకి వెళ్ళేవాళ్ళం.ఏ మేచ్ లు ఆడడానికి వెళ్లినా చీర్ గ్రూపులో ప్రభావతి ఇంకో నల్గురు అమ్మాయిల్ని వెంటేసుకు వచ్చేసేది.ఎప్పుడైనా ప్రభావతి రాకపోతే, రాజన్  బౌలింగ్ లో పస తగ్గిపోయేది.
        


ఓ సారి మేచ్ నుండి వచ్చాక"ఈ సారి నువ్వు రాక పోవడంతో వీడి బౌలింగ్ లైన్,లెంగ్త్ దెబ్బతింది.ఒక్క వికెట్టూ రాలేదు".  అన్నాను. "                                                                                "ఇలాటి సెంటిమెట్లూ, మెహర్బానీలూ నాకిష్టం ఉండవ్" అంది ఘాటుగా.ఆ ముక్కకి రాజన్ మొఖం మాడ్చుకున్నాడు.
                  ***                      *** ***
                     సెకండ్ ఇయర్ పరీక్ష కి రెండు నెలల ముందర పిక్నిక్ వెళ్లడం ఒక ఆనవాయితీ గా వస్తూ వుండేది. మేం కూడా ఆ సంవత్సరం కాలేజీ బస్సు లో ఒక వంద కిలో మీటర్ల దూరం లో వున్న దేవగఢ్ వాటర్ ఫాల్స్ కి వెళ్లాం. నవంబరు రెండో వారం ,అప్పుడే చలి గాలులు మొదలయ్యాయ్.. అక్కడ పాటలూ,మిమిక్రీలూ  హడావిడి. ఆవేళ పిక్నిక్ కి రాజన్ వయోలిన్ పట్టుకొస్తుంటే "పిక్నిక్ లో నీ ఫిడేలు కచేరి చేస్తావా.. ?"అడిగాను.
              "చేద్దామనే అనుకుంటున్నాను, నువ్వేం అనౌన్సుమెంట్లు చెయ్యకు"అన్నాడు
              "నాకు తెలుసు,ప్రభావతిని ఇంప్రెస్స్ చేసి  మార్కులు కొట్టేద్దామనుకుంటున్నావుకదూ. "
              "అవునురా శీనూ! తనకి మన సత్తా తెలియాలి.లేపోతే నన్ను ప్రేమించదు "
              "చూడు గోవింద్! క్రికెట్ ఆడతావనీ,ఫిడేలు వాయిస్తావనీ ఏ అమ్మాయీ ప్రేమలో పడదు.నువ్వెలాంటి వాడివి?నీకు ప్రేమించే హృదయం వుందా,నీది యెంత సంస్కారం కల మనసు...యిలా చాలా పరిగణిస్తారోయ్ ఆడవాళ్లు.మనం అందానికి యిచ్చిన ప్రాముఖ్యత,సెక్స్ కి యిచ్చే ఇంపార్టెన్సు ఆడవాళ్లు యివ్వరురా మిత్రమా " అన్నాను.
          "నీ ఉపన్యాసం ఆపు.నా తిప్పలేవో నేను పడతాను. నువ్వొక ముఖేషు పాత పాట పాడు,చాలు"
          "నేను పాడితే ఆ ఇంప్రెషను కాస్తా నా మెడకు చుట్టుకుంటుంది.నువ్వే తీసుకో ఆ అభిమానాన్ని... "
     మొత్తం మీద రాజన్ వయొలీన్ కచేరి విజయవంతంగా ముగిసింది.ప్రత్యేకించి ప్రభావతి తో బాటు చాలా మంది ఆడపిల్లల దృష్టి లో "హీరో" అయిపోయాడు. ప్రభావతి కూడా పాటలు పాడింది. నా ఫేవరేట్ హిందీ సింగర్స్ మిమిక్రీ కూడా అందరికీ నచ్చింది. ఈ విషయం యిప్పుడు ప్రస్తావించడంలో నా వుద్దేశ్యం,రాజన్ తనకి ప్రభావతి మీద ప్రేమ కి విత్తనం నాటాడని చెప్పడానికే.....!                                                                                                                                                                                   
             మొదటి రెండు సంవత్సరాలు పూర్తిచేసి  క్లినికల్ సంవత్సరాలలోకి అడుగుపెట్టాం.మెడలొకి  స్టెతస్కోపు వచ్చింది.నిజం డాక్టర్లలా ఫీలయిపోయేవాళ్ళం. వార్డుల్లో పేషంట్లు మాక్కూడా దండాలు పెట్టడం తమాషాగా వుండేది. ముందు ముందు రాజన్ జీవితాన్ని ప్రభావితం చేయబోయే ప్రభావతి  గురించి యిప్పుడు చెప్పాలి.
             ***                            ***     
      థర్డ్ ఇయర్ మాకు ఆటవిడుపు సంవత్సరం.పరీక్షలేవీ వుండేవి కాదు.పొద్దున్నే థియరీ క్లాసులు,వార్డు డ్యూటీ, మధ్యాన్నం ప్రాక్టికల్స్. ఆడుకోడానికీ,సినిమాలకి వెళ్ళడానికి సమయం దొరికేది. ఫస్ట్ ఇయర్ లో  విత్తనాలు నాటిన ప్రేమికులకు తమ తమ తరువాయి భాగాలు కంటిన్యూ చెయ్యడానికి కావలిసినన్ని సాయంత్రాలు దొరికేవి. లేడీస్ హాస్టళ్ల దగ్గర గేట్లు జంటలతో కిక్కిరిసి వుండేవి. ప్రభావతి రెండు రోజులు శెలవ్ దొరికితే రూర్కెలా వెళ్లిపోయేది. అలా వెళ్లకుండావుంటే మా రూంకి సైకిలు మీద వచ్చేది. ముగ్గురం సరదాగా ఏదైనా కూర చేసుకుని కలిసి భోజనం  చేసేవాళ్ళం. రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు రామారావు,నరసింహం కూడా వచ్చేవాళ్ళు.అందరం కలిసినప్పుడు రాజన్ మా కోసం హిందీ పాటలు వయోలిన్ మీద వినిపించేవాడు. యెప్పుడైనా పేకాట ఆడేవాళ్ళం.ప్రభావతి మాత్రం ఆడకుండా పక్కన కూచొని తిన్నగా ఆడనివ్వకుండా అల్లరి చేసేది.ఇరవై యేళ్ళు నిండిపోయి అందరం పెద్దవాళ్లమైపోతున్నాం. ఆ పిల్లకి ఆ ధ్యాసే వుండేది కాదు.మాకు గెడ్డాలూ మీసాలూ వచ్చేశాయ్. మా జూనియర్స్ మమ్మల్నిదేవతలమన్నట్టు చేసేవారు. అయినా ప్రభావతి లో ఆ చిన్నతనపు చిలిపితనం పోలేదు. లేక అది వొక ముసుగా.....!
                     రాజన్ పొద్దున్నే తిరునామం పెట్టుకోవడం,దేముడికి దీపం పెట్టడం మానలేదు. సాయంత్రాలు కనీసం వొక గంట వయోలిన్ సాధన చేసేవాడు. ప్రభావతీ ఆరాధన రోజు రోజుకీ హెచ్చవుతూండేది.ప్రభావతి చనువుని ప్రేమే అని తనకి తానే నిశ్చేయించేసుకుని మరింత చేరువవడానికి ప్రయత్నించేవాడు. ఆమె అందాన్ని మెచ్చుకోవడం,చిన్నచిన్న విషయాలలో ఆమె మీద అధికారకంగా ప్రవర్తించడం చేసేవాడు.అలాటప్పుడు నేను నెమ్మదిగా రాజన్ ని మందలించేవాణ్ణి. నా దృష్టిలో జీవితంలో మనం కలిసే వాళ్ళని కాలం నిర్ణయిస్తుంది,మనకెవరు కావాలన్నది మన హృదయం నిర్ణయిస్తుందనుకుంటాం,కానీ మన సాన్నిహిత్యం కోరుకునే వాళ్ళని నిర్ణయించేది మన ప్రవర్తన మాత్రమే.వీడి మట్టుకు వీడు ప్రభావతి తన స్వంతమైనట్టు ప్రవర్తిస్తే ఆ పిల్ల చిన్నబుచ్చుకోదా..!!ఇంతకీ ఆ అమ్మాయి మీద వీడి ప్రేమ ఆమెకి తెలియపర్చనేలేదు. ఆమె చనువుగా ఉన్నంత మాత్రాన తననే ప్రేమిస్తున్నాదని అనేసుకుని, అదో హక్కుగా భావించి "ప్రభా,ప్రభా" అంటూ అధికారం చెలాయించడం చాలా పొరబాటు.ఆ అమ్మాయి కూడా ఆ పిలుపుకి అభ్యంతరం చెప్పకపోవడంతో రాజన్ నమ్మకం మరింత బలపడిపోయింది. ఈ విషయమే చాలా సార్లు రాజన్తో చాలా సార్లు మామ్మూలుగా,గట్టిగా,మందలిస్తూ కూడా చెప్పాను.
         "నీకు తెలియదు శ్రీనూ!ప్రభా కూడా నన్ను ప్రేమిస్తోంది.ఆమె గుండెల్లో నేనున్నాను ఈ విషయం నీకర్ధం కాదు"అని కొట్టి పారేశేవాడు. ప్రభావతి కూడా ఏ విషయవూ తెలిసీ తెలియనట్టుగా ప్రవర్తించడం కూడా నాకు నచ్చేది కాదు. రాజన్ లేనప్పుడు తను మా గదికి వస్తే "రాజన్ వూరికెళ్ళాడనో లేడనో చెబితే ,  "
                “ ఏం రాజన్ లేకపోతె నన్ను రానివ్వవా,అసలు నేను రాజన్ కోసమే వస్తున్నట్టు మాట్లాడతావేం..?"దబాయించేది.                                                                                                         
            ఈ విషయం నన్ను ఆందోళనకు గురి చేసేది.రాజన్ తో చూచాయగా చెబితే "మనలో మనకి ఈ భేదాలేమిటీ,నువ్వూ,నేనూ, ప్రభా ఎప్పటికీ ఒక్కటే" అనేసేవాడు. నాకు మాత్రం నమ్మి బతకడం కన్నా నమ్మిస్తూ బతకడం కష్టం అని అనిపిస్తూండేది. ఆ అమ్మాయి గురించి ఏదో మాట్లాడకుండా వొక్క రోజుకూడా వుండేదికాదు. చాలా సార్లు సలహా కోరినప్పటికీ "నీ ప్రేమని ఆమె దగ్గర వ్యక్తం చేసేయ్" అని నేనెప్పుడూ వాడికి సలహా యివ్వలేదు.ఒకవేళ ఆమె "సరే" అంటే ఆ ఆనందం లో చదువుమీద శ్రద్ధ తగ్గిపోవచ్చు. కాదంటే ... వీడు తట్టుకోలేడు,మానసికంగా కుంగిపోతాడు. ఆ డిప్రెషన్ ప్రభావం భయంకరంగా వుండొచ్చు .
                        ఆ రోజుల్లోనే ఒకనాడు ఏమయ్యిందో కానీ హఠాత్తుగా మాటా మంతీ లేకుండా స్తబ్ధు అయిపోయాడు.కాలేజీ క్లాసుకి రావడం మానేశాడు.అన్నిటికన్నా ఆశ్చర్యంగా ప్రభావతి వూసే ఎత్తడం మానేశాడు. ఆమె గురించి నేనేదైనా ప్రస్తావిస్తే లేచి వెళ్లిపోయేవాడు. సాయంత్రం వయోలిన్ సాధనలో మార్పు వినిపించింది.అదేం రాగమో నాకు తెలియదుగాని,ఆందోళన తో తమకం తో ఆగకుండా ఆలాపించేస్తున్నాడు. రెండు గంటలు దాటినా సాధన ఆపడే…!                                                                                                                                             
                 "గోవిందూ.. నీకేమైందివాళ? నీ సాధన లో బాగా తేడా కనిపిస్తోంది.చాలా ఆందోళన లో వున్నట్టు నాకనిపిస్తోంది"అన్నాను.
                 "నిన్న సాయంత్రం... ప్రభాకి నేను ప్రేమిస్తున్నట్లు చెప్పేశానురా... "
                 “తనేమంది?”
                 "ఈ మాట చాలామంది నుండి విన్నాన్లే ... నువ్వుకూడా ఆ మంద లోనే వున్నావన్నమాట...ప్రేమలూ,పెళ్లిళ్ల గుఱించి ఆలోచించడానికి యింకా మనకి రెండేళ్లు టైముంది.ప్రస్తుతానికి బుద్ధిగా చదువుకుని ఈ వైద్య విద్య అనే యజ్జ్ఞాన్ని పూర్తి చేద్దాం. అందాకా చదువు మీద ధ్యాస పెట్టడమే మన ధ్యేయం.అంతదాకా నువ్వు నువ్వే ,నేను నేనే అనేసిందిరా…”.
           “షెహబాష్ ప్రభావతీ... బాగా చెప్పావ్"మనసులోనే అనుకున్నాను.                         
        రాజన్ తో మాత్రం  "తాను మాత్రం యింకేం చెబుతుంది!. ఉన్నమాట చెప్పింది. మన భాద్యత గుర్తు చేసింది.ప్రస్తుతానికి నువ్వు ఆ వయోలిన్ ఆపితే,భోజనం చేసి, సినిమాకి పోదాం. కాస్త రిలీఫ్ గా వుంటుంది .        లే..!రేపు మాత్రం ప్రభావతి తో ఏవీ జరగనట్టే మామూలుగా వుండు సుమా."
           “ఇంత జరిగిన తరవాత కూడా తనతో మాములుగా యెలా వుండడంరా?దొంగతనం చేస్తూ దొరికి పోయినట్టు వుంది నా పరిస్థితి. నీ సలహా విని కొన్ని రోజులు ఆగ వలసింది.నా మనసు నిండా తానే వుంది.మరి దాచుకోవడం నా వల్ల కాక చెప్పేసానురా "
          “సరేలే ..! మంచికో,చెడుకో నీ మనసులో మాట చెప్పేసావ్.నీ మనసు తేట పడింది. తన సలహా పాటించి ,తాను చెప్పినట్టు చదువుమీద దృష్టి పెట్టు.క్రికెట్టు,వయొలీను వుండనే వున్నాయి.సమయం చూసి ప్రభావతి తో నేను మాట్లాడుతానులే" అన్నాను.అప్పటికి  కొంచెం శాంతించాడు.
     మర్నాడు కాలేజీలో ప్రభావతి హుషారుగానే వుంది.మమ్మల్నిద్దరినీ ఎప్పటిలాగానే పలకరించింది.ముగ్గురం ఒక్క దగ్గరే కూర్చున్నాం.ఎప్పుడూ ప్రభావతి చూస్తూనే తెగ వాగే రాజన్ మాత్రంఅవేళ ముభావంగా వున్నాడు. థీరీ క్లాసులయ్యాక, టిఫిన్ కి వెళుతున్నప్పుడు ప్రభావతి, మా దగ్గరకొచ్చి " గోవింద్! అలా మొఖం మాడ్చుకు కూర్చోకు,నాకు కోపం వస్తుంది.నిన్న పాస్ట్,దట్ వస్ హిష్టరీ.లివ్ ఇన్ ప్రెజెంట్  …. నా మీద ఒట్టు..."అనేసి నావైపు చూసి అర్ధవంతంగా కనుబొమ్మలెగరేసింది. నేనూ బొటన వేలెత్తి "ఐ లైక్ ఇట్" సిగ్నల్ చూపాను.
           తరువాత మామ్మూలు మనిషైపోయాడు రాజన్. ఆ సంవత్సరం ఇంటర్ యూనివర్సిటీ టీమ్ కి సెలెక్ట్ అవడంతో ఆట ధ్యాస లో పడి తన రొటీన్ లో సర్దుకున్నాడు. వాడు మేచెస్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఒక రోజు ప్రభావతి,నేను ఏదో మాట్లాడుకుంటూంటే, సహజంగానే టాపిక్ రాజన్ వైపు మళ్లింది.                                                                                                                                                  
      “ఆ రోజు .... రాజన్ కి ఏమైందో తెలీదు,హఠాత్తుగా నా చేతులు రెండూ పట్టుకుని 'ఐ లవ్ యూ ప్రభా ..!’అన్నాడు శ్రీనూ... మొదట నాకు ఏంచేయాలో తోచలేదు.ఇలాంటిదేదో ఎప్పుడో అప్పుడు రాజన్ అంటాడని మన సెకండ్ ఇయర్ రోజులనుండీ అనుకుంటూనే వున్నాను."ప్రభా,ప్రభా" అని అంత చనువుగా పిలవడం మొదలు పెట్టినప్పటి నుండీ కనిపెట్టాను తన వుద్దేశం.నువ్వు కూడా తీసుకోని  చనువు వీడికి ఎక్కడ నుండి వచ్చిందా అని.... వొక్కోప్పుడు ఆ పిలుపు చీదరగా వుండేది. మా యింట్లో కూడా నన్ను ప్రభా అని ఎవ్వరూ పిలవరు. అయినా, తనని చిన్నబుచ్చకూడదనిభరించాను. అయినప్పటికీ... అవేళ మాత్రం… సడెన్ గా…! ఓ రెండు నిమిషాల పాటు స్టన్ అయిపోయాను. వెంటనే సర్దుకొని అప్పటికి యేదో చెప్పి తప్పించుకున్నాను. నువ్వు పక్కనుంటే బావుండుననిపించింది శ్రీనూ..!ఏం చెబితే ఏం ప్రాబ్లేమో . ఆ ఎమోషన్లో ఏం చేస్తాడో...!మొత్తం మీద అంతా బాగానే సద్దుకుంది. ఆ రోజు నుండి రాజన్తో వొక్కర్తినీ మాట్లాడడానికి భయం వేస్తున్నాదనుకో."                                                                                                                                                                
             "నువ్వు చాలా తెలివైన అమ్మాయివి ప్రభావతీ! ఆ రోజు చాలా సమయస్ఫూర్తి తో,వివేకం తో రాజన్ ని ఆ వుద్రేక స్థితి నుండి  తప్పించావ్. ఆ మర్నాడు కూడా వాణ్ని బాగా మందలిస్తూనే బుజ్జగించావ్. నేను కూడా ఆ పరిస్థితి ని అంత కన్నా తెలివిగా మేనేజ్ చెయ్యలేకపోయేవాణ్ణి."
                 థర్డ్ ఇయర్ లో ఆరు నెలల తరువాత రెండు నెలలు ఎండాకాలం సెలవలు.నేను యింటికి, విశాఖపట్నం వెళ్లి రెండు నెలల సెలవలూ అక్కడే అమ్మా నాన్నవద్ద  గడపదల్చుకున్నాను.రాజన్ మెడ్రాసు వెళ్లి ,అక్కడనుండి ఢిల్లీ వెళతానన్నాడు.సెలవులకి యింటికి వెళ్లడం అంటే యెంతో వుత్సాహం ...! కుర్రాళ్ళం, మాకేం ప్రిపరేషన్ వుంటుందీ.. అయినప్పటికీ మా సరదా,హడావుడీ చూసి ప్రభావతికి కూడా యెక్కడికైనా వెళ్లాలని వుత్సాహం కలిగింది.                                                                                                                                          
       "మా అమ్మమ్మ దగ్గరకి పాలకొండ వెళతాను,శ్రీనూ.విశాఖపట్నం లో కూడా మా బాబాయ్ గారు వున్నారు.నీతోకూడా వచ్చి మీ యింట్లో వుంటాను. నాకు విశాఖపట్నం చూపించు.మా బాబాయ్ యింటికి వెళ్లి అక్కడ నుండి పాలకొండ వెళ్తాను,నువ్వు కూడా వస్తే బావుంటుంది.నేనొస్తే మీ యింట్లో అభ్యంతరం వుండదు కదా...?" అంది. నువ్వు వాళ్ళింటికి వెళితే పెద్దవాళ్ళు యేమనుకుంటారు....!బావుండదు,అంతగా కావలిస్తే నాతొ మెడ్రాస్ రా.."అన్నాడు రాజన్.                                                                                                                                                                                                                       
        "అర్ధం లేకుండా మాట్లాడకు,మెడ్రాసు లో మీవాళ్లు మాత్రం ఏమనుకోరా,అయినా మా అమ్మమ్మ గారింటికి నేను వెళ్తానంటే నీకేవిటీ?నేను శ్రీనూ తోటే వెళ్తాను,మా నాన్నగారి పెర్మిషను,ప్రయాణఖర్చులూ తీసుకుని వస్తాను. శ్రీనూ,నాకు కూడా రిజర్వేషను చేయించు", ఆజ్ఞే ....!                                                                                                                                                                                 
           రూర్కెలా నుండి కల్నల్  గారు,సుజాత గారూ ప్రభావతి ని కారు లో తీసుకు వచ్చి మా ముగ్గురినీ రైలు స్టేషనుకి దిగబెట్టారు."శ్రీనివాస్,మేం కూడా అటుపక్క వద్దామనుకుంటున్నామోయ్,పది రోజులయ్యాక అటు వచ్చి,ఓ పది  రోజులుండి ప్రభావతిని తీసుకుని రూర్కెలా వచ్చేస్తాం. అందాకా సరదాగా గడపండి. మీ పేరెంట్స్ కి మా నమస్కారాలని చెప్పండి"అని చెప్పి రూర్కెలా వెళ్లి పోయారు.                                                                                                                                                                                                                
                     రాజన్ కి మాత్రం యెందుకో ప్రభావతి నాతొ విశాఖపట్నం రావడం యిష్టం లేదు. ఈ అమ్మాయేమో "నీ యిష్టం యెవడిక్కావాలి,అసలు అడ్డుపెట్టడానికి నువ్వెవడివి" అన్నట్టు మాట్లాడింది. అప్పటి కీ ఆఖరి ప్రయత్నంగా రాజన్ మా తోటే  వచ్చి, విశాఖలో రెండు రోజులుండి మెడ్రాస్ వెళ్ళిపోయాడు.వెళ్లే ముందర ప్రభావతిని నా విషయంలో చాలా జాగ్రత్తగా వుండమనీ,నేను ఆడపిల్లలంటే ఆడుకునేవస్తువుల్లా చూస్తాననీ... చెప్పాడుట.          
   "నువ్వంటే వాడికి యీర్ష్యగా వుంది శ్రీనూ"అని ప్రభావతి వాడు వెళ్ళిపోయాక చెప్పింది. "అసలు నా మీద అతని అధికారమేవిటీ?మా నాన్నగారు,అమ్మా సంతోషంగా,నా మీదా,నీ మీదా పూర్తి నమ్మకం తో పంపించారు. ఈ విషయం చెప్పేందుకే యిద్దరూ బుర్లా వచ్చి రైలెక్కించారు."                                                                                                                                                                 
      "వాడంటే నాకు కోపం లేదు, వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు,నిన్ను విడిచి వుండలేక అలా అవుతున్నాడు"అన్నాను.
         "అయ్యో! నువ్వు చాలా అమాయకుడివి శ్రీనూ,కొన్ని సార్లు యేవీ తెలియనట్లు ప్రవర్తిస్తావ్"                                                              
            అమ్మ దగ్గర ప్రభావతి గౌరవం గానూ,చనువు గానూ,నాన్న దగ్గర భయ భక్తులతోనూ ప్రవర్తించింది. నాన్నగారు వాళ్ళ కుటుంబ భోగట్టాలడిగారు. ప్రభావతి తాతగారు నాన్న శృంగవరపుకోటలో పనిచేస్తున్నప్పుడు బాగా పరిచయస్తులని తేలింది.                                         
           “ఈ అమ్మాయి తాతగారు చాలా పెద్దమనిషి.అబ్బో... అయనాపంతుల రాంబాబు గారు వస్తున్నారంటేనే అందరం లేచి నిలబడి పోయే వాళ్ళం.మాకెంతో సాయం గా ఉండేవారు,వీళ్ళ అమ్మ అప్పుడు బాగా చిన్నపిల్ల"అంటూ పాత రోజులు గుర్తు చేసుకున్నారు.                                    
          అమ్మ మాత్రం నన్ను పక్కకి పిల్చి "ఒరే ,నువ్వు మాత్రం ఆ అమ్మాయిని వొక్కర్తినీ తీసుకుని సినిమాలకీ,షికార్లకీ వెళ్ళకు.మీ స్వరాజ్యంపిన్నికూతురు చిన్నమ్మలికి కబురు పెడతాను.ఈ నాలుగు రోజులూ అది యిక్కడే వుండి యీ పిల్లకి సాయంగా ఉంటుంది"అని బోధపరిచింది.                                           
               బుర్లా వచ్చేసిన తరువాత విశాఖపట్నం కబుర్లు మాటల్లో వస్తే రాజన్ కి నచ్చేది  కాదు."మీ సోది ఆపుతారా" అంటూ చికాకు పడి పోయేవాడు. ప్రభావతి మా కుటుంబం తో సన్నిహితం అవడం వాడికి నచ్చలేదు. అప్పుడు కూడా వాణ్నిశాంత పరచడం భాధ్యతకూడా నామీదే పడింది.
                 ఆ సంవత్సరం ఫార్మకాలజీ,ఫోరెన్సిక్ పరీక్షలయి పోయాక,పాథాలజీ టూర్.... కాశ్మీరు ...అంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్లే వుద్దేశ్యం నాకు మొదటినుండీ లేదు. బంధువుల యింట్లో పెళ్లి వుందన్న సాకు తో ప్రభావతి కూడా డ్రాప్ అయిపొయింది. మేమిద్దరమూ వెళ్లటం లేదని రాజన్ కూడా మానుకున్నాడు.                                                                                                                                                                                                                                                            
       వాడు లేనప్పుడు నాతొ ప్రభావతి "నాకు వెళ్లాలని వున్నా ఆ టూర్ లో రాజన్ మళ్ళీ ఏం సమస్య సృష్టిస్తాడో అన్న భయంతో  మానుకుంటున్నాను శ్రీనూ" అంది
          

                                                   *** ***                                              
              


              నాలుగోసంవత్సరంలో "రాంచీ" మెంటల్ హాస్పిటల్లో మూడువారాలు  సైకియాట్రీ పోష్టింగ్ వుండేది. బోధనాపరంగా చాలా ముఖ్యమైనదిగా వుండేది. మేఁవూ,మా సీనియర్స్ అంతా ఓ నూటపాతిక మందిమి,మాంచి సందడిగా వుండేది. అక్కడి సైకియాట్రీ పేషంట్లతో మాటలు,ఆటలు,పాటలతో సరదాగా వుండేది. అక్కడి పేషంట్ల కోసం ఓ నాటిక కూడా ప్రదర్శించాం.ఇవన్నీ పక్కన పెడితే, మొదటి రెండు సంవత్సరాల లో మొదలయిన  ప్రేమాయణాలు మూడో యేడాది లో చిగిర్చి,రాంచీ టైముకి మొగ్గ తొడిగేవి . రాజన్ విషయం లో కూడా సరిగ్గా అదే జరిగింది.
                 రాంచీ వాతావరణం చల్లగా,మధ్య మధ్య వర్షం,చిన్న జల్లులు .... ఆహ్లాదంగా వుండేది.ఆ వాతావరణ మహత్యం ఏమో కానీ ప్రేమికుల మధ్య చనువులు కొంచెం మోతాదు మించి,మరి కొందరిలో హద్దు మించి పోతూండేవి. ఒక రోజు నేను మరి కొందరు కుర్రాళ్ళం కలిసి సినిమాకి పోయాం. తిరిగి వచ్చేసరికి రాజన్ కందగడ్డ మొఖంతో వున్నాడు. వయోలిన్ తీసి మళ్ళీ పిచ్చిగా వాయిస్తున్నాడు. ఏమైందంటే  మాట్లాడడు. అందరూ వినోదంగా,విస్మయంగా చూస్తున్నారు. ఎవడికీ ఏంటయిందో తెలీదు.
     "చెప్పరా రాజన్! ఏంచేశావ్ ? చెప్పు ..".                                                                                                                                                                        
            ఏవీ చెప్పడే,మాట్టాడడే.వయోలిన్ ఆపడు ..గుంపు ని తరిమేసి,రాజన్ భుజం మీద చెయ్యేసి అనునయిస్తూ"చెప్పరా ... అసలు ఏంజరిగింది?"  అడిగాను
     "ప్రభాని ముద్దు పెట్టేసుకున్నానురా” మళ్ళీ బావురుమన్నాడు.
     "తానేమైనా అందా….! ...తిట్టిందా..? "                                      
     "తానేమీ అనలేదురా, అనేసుండినా బాగుణ్ణు. ముద్దు మీద ముద్దు... రెస్పాండయ్యింది... కానీ నన్ను తోసేసి ...’యూ’ ... అంటూ అరుస్తూ వెళ్ళిపోయింది. నేను మళ్ళీ తప్పు చేసేశాను. "                                                                                                                    
      "అంటే...?"                                                                                                                                                                                               
      "ఇక్కడకొచ్చిన రెండో రోజు... యిలాగే ముద్దుపెట్టుకుంటే ... యిష్టంగా దగ్గరకు లాక్కొని…. అంతట్లోనే తోసేసి పరుగెత్తుకు వెళ్ళిపోయింది..  మొదటిసారి కదా సిగ్గేమోననుకున్నాను”'
       "నాకూ అర్ధం అవటం లేదు.ప్రభావతి పిరికిపిల్ల కాదు. నువ్వన్నది నిజం కావొచ్చు. ప్రస్తుతానికి నీ ఆలాపన ఆపి, అలా తిరిగి ఓ దమ్ముకొట్టి భోజనం చేసి వద్దాం,పద."అని వాణ్ని సముదాయించాను.
          మత్తు కలిగించే వాతావరణం,వయసు ఆరాటాలు,పిచ్చాసుపత్రి లో కధలూ.ఏ పిచ్చివాడి కధో విని యిలా రియాక్టయుంటుంది. రోజుకో పదిమంది పిచ్చివాళ్ళని చూసి ఎవడి కధో  తనకి అన్వయించేసుకుని యిలా మనో భ్రాంతికి లోనవడం అసహజం కాదు.పిచ్చాసుపత్రి డాక్టర్లు,నర్సులూ పిచ్చెక్కిపోయి ఆ ఆసుపత్రుల లోనే పేషంట్లుగా ఎడ్మిట్ అయిపోవడం ఎన్నో సినిమాలలో చూశాం, కధలలో  చదివాం కదా.!!!ఇదంతా వొక మానసిక భ్రమ.ఆబ్సెషన్…! ఇక్కడ పేషంట్ల కేసు హిస్టరీలు వినీ,వినీ మనసుకి పట్టించేసుకుంది.ఒక డాక్టరుగాఈ మానసిక అబలత్వం వుండకూడదు.డాక్టర్లంతా పేషంట్లయిపోతే.... కష్టమేను. మర్నాడు ప్రభావతితో ఈ మాటే చెప్పాను.                   
          "చూడమ్మాయ్! నువ్వు ఈ పిచ్చి వాళ్ళ జబ్బులతో మమేకం అయిపోయి, ఆ సమస్యలన్నీ నీకే అన్వయించేసుకుని పిచ్చిదానివైపోకు ,మమ్మల్ని పిచ్చివాళ్ళని  చేసేయకు.నిన్న బోయ్స్ హాస్టల్ లో ఎంత గగ్గోలు అయిపోయిందో విన్నావు కదా."
          "అలాగే శ్రీనూ,నిన్ననేమిటో అలా ప్రవర్తించాను. అందరికీ నా క్షమాపణలు"
          "సరేగాని,గోవిందుడు నిన్ను చూడ్డానికే హడలి పోతున్నాడు.తప్పంతా తనదే అని మధన పడిపోతున్నాడు.వాణ్ని కొంచెం సముదాయించు"అన్నాను కన్ను గీటుతూ.                       
                   
నీరసంగా నవ్వి"అలాగేలే "అంది. మనిషిలో ఎప్పుడూ వుండే ఉత్సాహం లేదు. ఆమెలో ఎప్పుడూ చూడని నిరాశ,నిస్పృహ,బేలతనం కనిపించాయి. ఇది నా భ్రాంతేమో!పిచ్చాసుపత్రి ప్రభావం అనుకున్నాను.                                                                                                                                                                                           
          రాంచి మెంటల్ హాస్పటల్ లో   సైకియాట్రీ మెడిసిన్ ట్రైనింగు నన్ను చాలా ప్రభావితం  చేసింది. వీలయితే సైకియాట్రీలో పి.జి చేయాలని నిశ్చయించుకున్నాను. ఈ మాటే రాజన్ తో అంటే          
       "నువ్వు చేస్తే చెయ్యి గానీ,నన్ను మాత్రం నీ క్లినిక్కు కి రమ్మనకు. భయం నన్ను వెంటాడుతూనే వుంటుంది"అన్నాడు నవ్వుతూ.                                                                                                                                     
       ప్రభావతి మాత్రం నన్ను సమర్ధించింది. "శరీరానికి మానసిక ఆరోగ్యం చాలా అవసరం, మనసు ఆనందంగా,అందంగా వుంటేనే మనిషికి జీవితం లో పరిపూర్ణత  సాధ్యం. ఆరోగ్యం గా లేని మనసు శరీరాన్ని బలహీనపరిచి వ్యాధిగ్రస్తులని చేసేస్తుంది.ఎన్నో 'ఆబ్సెసివ్ న్యూరోసిస్' సమస్యల తోనే సగం మంది ప్రజలు బాధపడుతున్నారు .అలాటి జబ్బులు మనం ట్రీట్ చెయ్యలేక పోతున్నాం,చేతకాక మెంటల్ కేసని  కొట్టి పారేస్తున్నాం. హెల్దీ యర్ ద మైండ్ హెల్దీ యర్ విల్ బి ది బాడీ.." ఆ అమ్మాయి మాటల కి నేను విస్తు పోయాను. రాజన్ కూడా మాట్టాడకుండా వుండి పోయాడు.                                                                            
         "నీ మాటలు వింటూంటే రాంచీ ప్రభావం నాకన్నా నీ మీదే యెచ్చు వున్నాదనిపిస్తోంది.యింత నిర్దిష్టం గా చెబుతున్నావంటే నువ్వు ఖచ్చితం గా సైకియాట్రీ లో పి జీ చేయవలసిందే లేకపోతె సైకియాట్రీ పేషంటువైపోతావ్ ,జాగ్రత్తసుమా...! అన్నాను.
            "ఈ ప్రపంచంలో ప్రతీ మనిషికీ ఎంతో కొంత పిచ్చి వుంటుందట,కొంతమందిలోనే అది బయట పడుతుందిట. మన వాళ్లంటారు చూడు ...వేపకాయంత వెర్రి అని.అది గుమ్మడి కాయంత అవకుండా చూసుకుని,జాగ్రత్త పడాలి "
            "ఈ చర్చ ఇంతటితో ఆపి ప్రస్తుతం మన పేథాలజీ బోయెడ్ తియ్యడం మన తక్షణ కర్తవ్యం" అన్నాను.                                                                                                               
               మళ్ళీ ప్రభావతి వైపు నిశితంగా  చూస్తూ "రాంచీ నుండి వచ్చిందగ్గరనుండీ  నువ్వు నువ్వు గా లేవు., ఏదో మార్పు కనిపిస్తోంది సుమా” అన్నాను.
             "మార్పు సహజం శ్రీనూ, అది శాశ్వతం కూడా.ఎల్లప్పుడూ ప్రపంచం మారుతూనే వుంటుంది .ఎప్పుడు, యెవరం యెలా మారతామో...!కాలమే నిర్ణయించాలి.                                                                                                                                                                   
           చర్చ ప్రమాదకరం గా వున్నదనిపించింది.ప్రస్తుతపు మూడ్ లో నుండి  ప్రభావతిని మళ్లించడం కష్టమే. ఓ సిగరెట్టు ముట్టించాను,వాసన పడదుగా,వెళ్ళిపోతుందని. గ్రహించేసింది. "నే వెళ్ళొస్తాను,నువ్వు సిగరెట్లేమీ తగలెయ్యఖ్ఖర్లేదు నన్ను తగిలేయడానికి ...రేపు కలుద్దాం. బై!" ...వెళ్ళిపోయింది.                                                                                                          
               ఈ చర్చ జరిగిన తరువాత వారం రోజులకి  ఎండాకాలం శలవలు.. ప్రభావతి వారం రోజులు రూర్కెలా వెళ్ళింది. జులై మొదటివారంలో పాథాలజి  పరీక్షలుంటాయ్.ఫైనల్ ఇయర్ మొదలవడం కూడా జులై నుండే. రాజన్ కూడా ఢిల్లీ ఓ పది రోజులకని వెళ్ళాడు. వాళ్ళు రాగానే  మా బాబాయ్ కూతురి పెళ్లి కని నేను విశాఖపట్నం వెళ్లి ఒక వారం రోజులుండిపోయాను. మే నెల ఎండలు పేల్చేస్తున్నాయ్.రూమ్ కి చేరేసరికి మిట్టమధ్యాన్నం,రూంలో రాజన్ లేడు. ఈ యెండలో యెక్కడికి  వెళ్ళివుంటాడు ...? ఆ రోజుల్లో యిప్పట్లాగా సెల్ ఫోన్లు లేవు. భోజనం కేరియరు లేదు. రూమ్ నిండా సిగరెట్టు పీకలు,దుమ్ము,ధూళి...! నేను వెళ్లేప్పుడు అంతా శుభ్రంగా నీట్ గా వుండేదే......! మొహం , కాళ్ళూ ,చేతులూ కడుక్కుని  తుడుచుకుంటూంటే కేలండర్ కి పిన్నుగుచ్చివున్న వుత్తరం కనిపించింది. రాజన్ రాసిందే.
                 "శ్రీనూ..! నేను యిక్కడ వుంది చదువు కొనసాగించడం ...నావల్ల అవదు నీ మాటే నెగ్గింది. ఫస్ట్ ఇయర్ లోనే నన్ను హెచ్చరించావ్, ,ప్రేమలూ,ప్రణయాలూ వద్దని..నీమాట వినలేదు.ప్రభావతి  ప్రభావం లోనుంచి తప్పించుకోలేకపోయాను. ఆ అమ్మాయి తప్పులేదు.నేనే.....నేనే ఆమె మీద ప్రేమను పెంచుకుని, మునిగిపోయి యిప్పుడు వూపిరి ఆడక ,కొట్టుకుంటున్నాను.ప్రభావతి వొక అర్ధం అవని  మిష్టరీ గర్ల్. లేక నేనే తనని అర్ధం చేసుకోలేకపోయానో...?మొదట్లో నాతొ అంత సన్నిహితంగా లేకపోయినా,తరువాత నా పట్టుదలతో తనని గెల్చుకున్నాననుకున్నాను. నా సాన్నిహిత్యం కోరుకుంటున్నట్లే ప్రవర్తించింది. ఎప్పుడు యెంత దగ్గరవుతుందో ,అంతలోకే అందనంత  దూరంగా యెందుకు వెళ్లిపోతుందో గ్రహించడం... కష్టం. నువ్వు వూరికి వెళ్లిన మర్నాడు పొద్దు పోయాక మన రూముకి వచ్చింది.నువ్వు లేవనీ ,నేనొక్కడినే వున్నానని తెలిసుండే వచ్చింది.మాటలతో,చేష్టలతో నన్ను ఉద్రేక పరిచి,రెచ్చగొట్టింది. నన్ను నేను సంభాళించుకోలేకపోయాను. అంతలోకే ... రెచ్చిపోయివున్న నన్ను తోసేసి,ఏడుపు,మనిషి నిలువెల్లా వణికిపోతూ రాంచీలో లాగ హిస్టరికల్ అయిపొయింది.నన్ను తిట్టింది…,పొమ్మంది…,క్షమించమంది…..ఓ డ్రామా అయిపోయిందనుకో. తప్పు యిద్దరివల్లా జరగబోయింది…..ఆఖరి నిమిషంలో తన తప్పు యేమీ  లేనట్లు నను దూషిస్తే...!! ప్రేమా ..?పిచ్చా..? నేను యిక్కడవుండలేను. ప్రభాని ప్రేమించడం మానలేను,చూస్త్తూ చేతకాని వాడిలా ఉండలేను...ఆమె వుండనివ్వదు.తననుండి నేను తప్పుకోవడమే ఆమెకు మంచిది. ఆత్మహత్యలాంటివి తలపెట్టనులే..భయపడకు.ప్రస్తుతానికి ఢిల్లీ అమ్మా,నాన్నల దగ్గరకు వెళ్ళిపోతున్నాను.మళ్ళీ ఎప్పుడు కలుస్తామో...?ప్రభా జ్ఞాపకాలు మరిచి పోయాకే...! అది సాధ్యమేనా...?”                                                                    
                                                                                         రాజన్.
                     రాజన్ వెళ్ళిపోయాక ఆ రూములో వొక్కణ్ణీ వుండలేకపోయాను.వార్డెను గారిని కలిసి హాస్టలుకి మారిపోయాను. సనాతన్ త్రిపాఠి,ప్రదీప్ షడంగి నాకు బాగా సన్నిహితులు. వాళ్ళ పక్క రూమే నాది. పాథాలజీ పరీక్షలు దగ్గరకొచ్చేశాయ్.ముగ్గురం కలిసి చదువుకునేవాళ్ళం. రాజన్ హఠాత్తుగా వెళ్లిపోవడం మా క్లాసులో అందరికీ పెద్ద షాకేను. ప్రతీవాడూ వచ్చి నన్ను పరామర్శించేవాడు. వాడూ,నేనూ అందరితో కలిసి మెలిసి వుండేవాళ్ళం. ఆడపిల్లల్లో కూడా వాడికి అభిమానులుండే వాళ్ళు. వాడికీ,ప్రభావతికీ స్నేహం కన్నాయింకో మెట్టు పైనే ఉన్నదన్నది కోమటి రహస్యం. బీనాసింగూ,సీతావర్మా అయితే రాజన్ వెళ్లిపోయాడన్నకన్నా వాడు లేని వొంటరితనం నేనెలా తట్టుకుంటానో అని బెంగపెట్టేసుకున్నారు. అటువంటి స్నేహం మా యిద్దరిదీను.                                                                                                                                                                
         కాలం ఎవరి కోసం ఆగదు. భగవంతుడు కూడా కాలాన్ని అతిక్రమించలేడు. జీవితం ఏ సెకండుకి ఆ సెకండుగా,ఏ నిమిషానికి ఆ నిమిషంగాసాగిపోతూనే వుంటుంది. అప్పుడే కలిగిన వొక ఆలోచన,ఒక భావన మరుక్షణం పాతదయిపోతుంది.ఓ జ్ఞాపకంగానో , అనుభవం గానో మిగిలిపోతుంది. జరిగిపోయింది తిరిగి రాదు,ముందు ముందు ఏం జరగబోతోందో తెలియదు. అందుకనే జీవి వర్తమానంలో కొట్టుమిట్టాడుతూ వుంటాడు...!  రోజులుగడిచిపోతున్నాయి,కొన్నిసార్లు నెమ్మదిగానూ,మరికొన్నిసార్లు తొందరగానూ అని మన భావన మాత్రమే.
         పాథాలజీ పరీక్షలయిపోయాక ఎప్పటిలాగే ప్రభావతి రూర్కెలా వెళ్ళింది. వెళ్లే ముందర నన్ను కలిసి "నీతో చాలా చెప్పాలి,చెప్పుకోవాలి శ్రీనూ...కానీ ఎందుకో నీతో మాట్లాడడానికే భయం వేస్తోంది. ప్రస్తుతానికి యింటికి వెళ్తున్నాను."
         ప్రభావతి పై నా అభిప్రాయం మారిందా,అభిమానం తగ్గిందా అంటే చెప్పలేను కానీ. ఆ పిల్ల మనస్తత్వం మొదటినుండీ అయోమయంగానే వుండిపోయింది. అసలు ఆ అమ్మాయి రాజన్ ని నిజంగానే యిష్టపడిందా.... ?ఇష్టపడిందనుకోవడానికి దాఖలాలు యేవీ లేవు.రాజనే అంతా వూహించుకుని అందరికీ ఆ అభిప్రాయం కలిగించాడు. ఆ అమ్మాయిని స్వంతం చేసుకోవడానికి తొందరపడ్డాడు,ఆ తొందరపాటుతో కొన్ని తప్పటడుగులు వేసితన భవిష్యత్తుని పాడుచేసుకున్నాడు.
                     అయినప్పటికీ వీడిది తొందరపాటని తెలిసీ ప్రభావతి అభ్యంతరం చెప్పకపోవడం తప్పేకదా."చూడబ్బాయ్ నువ్వంటే నాకు ప్రేమ లేదు,ఏవో ఊహించుకుని నీ మనసూ ఆరోగ్యం పాడుచేసుకోకు" అని చెప్పేయొచ్చుగా...!ఆలోచిస్తున్న కొద్దీ ఇద్దర్లోనూ తప్పుందనిపించేది. ఈ ఆలోచనలు రాజన్ వెళ్లిపోయిన తొలినాళ్లలో తరచూ వచ్చేవి .తరవాత్తరువాత యెప్పుడైనా అటు ఆలోచన మళ్ళేది. రాజన్ మాత్రం అప్పటికీ యిప్పటికీ ప్రతీరోజూ జ్ఞాపకం వస్తూనే ఉంటాడు.    
                 ఫైనల్ ఇయర్ కి వచ్చాం. సీనియర్ ప్రొఫెసర్లూ,కాబోయే ఎక్జామినర్లు క్లాసులు తీసుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో మంచి అభిప్రాయం ఉంటే పాస్. లేకపోతే మళ్ళీ ఆర్నెల్లు.పాఠాలు చాలామట్టుకు వార్డులోనే పేషంటు పక్కనే చెప్పేవాళ్ళు. ఒక్కొప్పుడు ఈవెనింగ్ రౌండ్సులో పాఠం అయిపోయేది. అందువల్ల సాయంత్రాలు కూడా చదువుతో సరిపోయేది.సావకాశంగా స్నేహితులతో గడపడానికి వీలు చిక్కేది కాదు . ఎప్పుడైనా ఓ సినిమా,లేపోతే  వూళ్ళో హోటల్లో భోజనం.అలాటి ఒకనాటి సాయంకాలం .... సినిమాకని బయల్దేరి వర్షం వచ్చేట్టు ఉంటే భవానీ రెష్టారెంటులో ఓ వారగా కిటికీ పక్కనున్న టేబుల్ దగ్గర కూర్చుని ఇరానీ టీ ఆర్డర్ యిచ్చాను. వర్షం మొదలయింది. కిటికీ తలుపులు గాలికి కొట్టుకుంటున్నాయి. చల్లని గాలి, తలుపులు తీసివున్న కిటికీ సందుల్లోంచి సన్నగా మీదపడుతోన్న జల్లు ,ఇరానీ చాయ్ తాగుతూ,సిగరెట్టూ ముట్టించి ... ఏ ఆలోచనలూ లేని . ....    ఓ తన్మయ స్థితి...పరిసరాలతో సంబంధం లేకుండా నానుంచి నేను విడిపోయిన స్థితిలో వున్నాను.
              భుజం చుట్టూ తడిసిన పమిట  లాగి బిగించి కొంచెం తలమీదనించి కప్పుకుని ప్రభావతి నేను కూర్చున్న బల్ల దగ్గరకొచ్చి నిలబడే దాకా నేను గమనించనే లేదు.  
             కళ్ళెగరేసి " నేనిక్కడ వున్నట్టు తెలిసినట్టు వచ్చావే...?"
      “దూరంగా షాపులోంచి నువ్వు హోటల్లోకి వెళ్లడం చూశాను. వాతావణం చల్లగా,హాయిగా వుంది.నాక్కూడా టీ యిప్పిస్తావేమోనని ఆశే తో వచ్చాను",పళ్ళు బిగించి,నవ్వు ఆపుకొంటూ... పాత ప్రభావతి కొంటెతనం కనిపించింది ఆక్షణంలో.నేనూ,రాజన్ సాయంత్రాలు యీ హోటల్లోనే,యీ టేబుల్ దగ్గరే కుర్చునేవాళ్ళం. ఎప్పుడైనా ప్రభావతి మాతో వచ్చేది. సాధారణంగా క్రికెట్ మాచ్ అయిన రోజు,పోస్ట్ మాచ్ అనాలిసిస్ యిక్కడే చర్చించుకునేవాళ్ళం. నేను,రాజన్ ఎప్పుడు వచ్చినా హోటల్ ప్రొప్రయిటర్ భవానీ, రేడియో గ్రామ్ లో ముఖేష్ పాటలు మాకిష్టవని పెట్టేవాడు. ఇవాళ కూడా ముకేశ్ పాతపాట వింటూంటే ప్రభావతి వచ్చింది.                                                                                                                                                     
     "పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి కదూ"అంది టీ తాగుతూ..."జరిగిపోయిన కాలం యెంత బావుంటుందేం...! తీయనివి కొన్ని,చేదు అనుభవాలు మరికొన్ని,కొన్ని మర్చిపోయినవైతే  యింకొన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తున్నవి "               
       "రాజన్ గురించేగా,నువ్వెప్పుడో మరిచిపోయావనుకున్నాను.."                                                                                                                                                     
               నా మాట వినిపించుకోనట్టే "రాజన్ జ్ఞాపకాల్లో తీపిలేదు, అంతా చేదే.... విషం కానందుకు సంతోషిస్తున్నాను.ఇక్కడ మెడికల్ కాలేజీలో యెందుకు చేరేనో,మీ ఇద్దరితోయెందుకు  సన్నిహితత్వం పెంచుకున్నానో,నన్ను నేను యెందుకు హింసించుకున్నానో అర్ధం అవటం లేదు ..శ్రీనూ..!"
            దుఃఖం ఆపుకోలేకపోయింది. నేనేమీ మాట్లాడలేదు ....  మరో టీ ఆర్డర్ చేసి యింకో సిగరెట్టు ముట్టించాను. తనని తనివితీరా ఏడవనివ్వడమే మంచిదనిపించింది.మనసులో వున్నకల్మషం కన్నీరుతో కొట్టుకుపోవడం మంచిది. బల్లమీద నుదురు పెట్టి వెక్కి వెక్కి యేడ్చింది. ఈ ప్రభావతి యెప్పుడైనా  యేడవగలదా,అంత పిరికిగా అవగలదా అని నమ్ముశక్యం కాని దృశ్యం చూస్తూ వుండిపోయాను.అయిదు నిముషాలలో తేరుకుంది. రుమాలు తీసి యిచ్చాను.
      విషాదంగా నవ్వుతూ "నీకు అభ్యంతరం లేకపోతె ఇవాళ నీతో అన్ని విషయాలూ చెప్పుకుంటాను శ్రీనూ... యిప్పటికైనా నా లోని భయాలనీ, ఆందోళనీ బయటికి బయటికి చెప్పుకుంటే పెద్దభారం దించుకున్నట్టుంటుంది. అంతా విని నా మీద సానుభూతి చూపడానికి ప్రయత్నించకు సుమా...!  
              
                    ***                                                                    ***
                      నాకు వూహ తెలిసినప్పటినుండీ మా నాన్నగారి దగ్గరే నాకు బాగా చేరిక. తమ్ముడు పుట్టేటప్పటికీ నాకు మూడేళ్లుంటాయేమో. వాడు పుట్టినప్పుడు అమ్మకు బాగా సుస్తీ చేయడంతో నాన్న రెండు నెలలు సెలవు పెట్టి యింటి దగ్గర వుండిపోయారు. తమ్ముణ్ణి చూసుకోవడానికి అమ్మమ్మ వచ్చి మా దగ్గర వుండిపోయింది. నేను నాన్న దగ్గరే పడుకోవడం,ఆయనచేత నీళ్లు పోయించుకోవడం,ఆయన చేత అన్నం పెట్టించుకోవడం... అన్నం కలిపి నోట్లో పెట్టేవారు. ఏవో కబుర్లు,కధలు చెప్పేవారు. అలా డేడీస్ డార్లింగ్ డాటర్ అయిపోయాను.                                                                                                                                                                             
               అమ్మమ్మ, పాపం.... " నాదగ్గరకురావే"అనిబతిమాలినా వెళ్ళేదాన్నికాదు.            
ఆయన మీద యెంత ప్రేమను పెంచుకున్నానంటే,ఒకసారి ఆయన పువ్వులు తెచ్చి అమ్మకిస్తే ముందర నాకివ్వలేదని ఏడ్చి రాగాలు పెట్టేశాను. అమ్మా,నాన్నా కలిసి ఒక గదిలో పడుకోవడాన్ని సహించలేకపోయేదాన్ని.నాకు జ్ఞానం వచ్చేసరికి నాన్నే నా హీరో. కొంచెం కొంచెం పెద్దవుతూన్నకొద్దీ స్కూల్లో పిల్లలందరూ అమ్మల గురించి చెప్పడమే కాని తండ్రుల గురించి చెప్పకపోవడం నాకు ఆశ్చర్యంగా వుండేది.
          పెద్దవుతూన్నకొద్దీ నా దేహంలోనూ,నాతోటి ఆడపిల్లల శరీరాలలోనూ వస్తున్నమార్పులు నా ఆలోచనలు మారడానికి దోహదం చేశాయి. అమ్మ కూడా నేను ఆడపిల్లననీ,మగపిల్లాళ్ళా కాకుండా నా ప్రవర్తనకి కొన్ని నియమాలూ,కట్టుబాట్లూ వున్నాయని చెబుతూవుండేది.పన్నెండేళ్ళకే  పైటవేసుకునే వయసు వచ్చేసింది. ఆ వయసుతో బాటు కొన్ని నియమాలు,ఆంక్షలు,కట్టుబాట్లు కూడా నేర్చుకోవలసి వచ్చింది. ఇది వరకైతే అన్నయ్య,నేను,తమ్ముడూ ఒక్కదగ్గరే పడుకునేవాళ్ళం. ఇప్పుడు నా గది వేరుగా అయింది.నెల నెలా శానిటరీ నాప్కిన్స్ వాడడం,కడుపునొప్పి భరించడం ... ! తోటి అమ్మాయిలు ఎప్పుడూలాగ కాకుండా కొత్తగా ప్రవర్తించేవాళ్లు.అబ్బాయిలని చూస్తూనే తలలు వంచేసుకోవడం,పైట సర్దుకోవడం,అర్ధం లేకుండా సిగ్గు పడడం...యివన్నీ నాకు ఎబ్బెట్టుగా,తెచ్చిపెట్టుకున్నట్టుగా అనిపించేవి.అబ్బాయిలలో కూడా నాకేఁవీ ప్రత్యేక మార్పులు కనిపించేవికాదు.కొంతమందికి నూనూగు మీసాలు,గొంతులో బొంగురుతనం ...అంతే !వాళ్లలో ప్రత్యేక ఆకర్షణ ఏవీ కనిపించేదికాదు.నేను ఎప్పుడూలాగే వాళ్ళతో మాట్లాడ్డం,హాస్యాలు,ఆటపట్టించడం చేస్తూండేదాన్ని. నేను ఓ స్త్రీనన్న స్పృహ ఎంబీబీస్ లో చేరాకే కలిగింది. మిమ్మల్ని,ముఖ్యంగా నిన్నుచూశాకే ప్రకృతి ,పురుషుడు భేదం వొంటబట్టింది.
                     మొదటినుండీ నన్ను స్వంతపరుచుకునే ప్రయత్నం చేయడానికి మా నాన్నగారితోసహా అందరూ భయపడేవారు.అన్నయ్య,తమ్ముడూ నా చెల్లి అనో,అక్క అనో చెబుతే “నాకూ వొక పేరుందికదా పేరు చెప్పరెందుకని తగూ పెట్టుకునేదాన్ని.నాన్న,అమ్మా కూడా నాగురించి ప్రస్తావన వస్తే “మా ప్రభావతి” అనే చెప్పేవారు.నేనుకూడా ఫలానా కలనల్ గారి అమ్మాయినని చెప్పుకునేదాన్నికాదు..మీ అందరినీ స్నేహితులుగానే చూశాను.నాలో యే కోణం చూసి నన్ను యిష్టపడ్డాడో రాజన్ మాత్రం నాలోని స్త్రీని రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు.అక్కడే మా నాన్నగారిలాగా నన్ను అతను చూడటంలేదనే అభద్రతా భావం నాలో నాటుకుపోయింది.ప్రదీప్,అక్షయ్, పుష్కర్ పటేల్ యింకా చాలామంది నన్నో ఆడదిగా,చెప్పినమాటవినేదిగా ఉండాలి అని భావించారేగాని,ఒక స్వతంత్ర భావాలున్న యువతి లాగ చూడలేదు,చూడ్డానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఆ కారణం చేతనేనేమో, యెవరయినా యెచ్చుచనువు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే సహించలేక పోయేదాన్ని,   భయంతో హిస్టీరికల్ గా అయిపోయేదాన్ని. నాకు తెలియకుండానే హిస్టీరియా నాకో ఆబ్సెషన్ అయిపోయి, నాకో కవచంలాగా వాడుకునేదాన్ని. రాజన్ ప్రభా,ప్రభా అని అంత చనువుగా పిలవడం నచ్చేదికాదు,వొక్కోప్పుడు ఆ పిలుపు చీదరగా ఉండేది. మా యింట్లో కూడా నన్ను ప్రభా అని ఎవ్వరూ పిలవరు. ఆ అతి చనువే రాంచీ లోనూ,ఆ తరువాత యింకా కొన్ని సందర్భాలలోనూ అతడి ప్రవర్తన అసహ్యించుకునేట్టు చేసింది. నాలో ఒక అభద్రతా భావం నాటుకుంది.నాలో ముఖ్యంగా వున్న లోపం యేవిటంటే,ప్రతీ పురుషుణ్ణీనాన్నగారితో పోల్చి చూసుకునేదాన్ని. తండ్రి ప్రేమ,మార్దవం యెవరిదగ్గర దొరుకుతుందా అని అన్వేషించేదాన్ని.
                    రాంచీ నుండి వచ్చిన తరువాత మన సైకియాట్రీ మేడమ్ తో నా భయాలన్నీ చెప్పుకున్నాను. నా చిన్నతనం, నాన్నగారితో నా చేరిక అన్నీ  ఆవిడ అడిగారు.ఏదీ వదలకుండా నా బాల్యంలో గడచిన ప్రతి విషయం ఆమెతో చెప్పాను. అంతావిన్నాక ఆమె నాకు "ఎలెక్ట్రా కాంప్లెక్స్"గురించి చెప్పారు. ఆ కధ ,దాని గురించి కార్ల్ యంగ్ చేసిన పరిశోధన  నా మనసుమీద చెరగని ముద్ర వేసాయి. తండ్రితో మానసిక,శారీరక సంబంధం కోసం తల్లితో పోటీపడే సంఘర్షణనే "ఎలెక్ట్రా కాంప్లెక్స్" అంటారు. మూడు నాలుగు సంవత్సరాల వయసులో ప్రారంభమయి ఈ మానసిక ఘర్షణ వయసు పెరుగుతోన్న కొద్దీ మరుగున పడిపోతుంది. కొద్దిమందిలో,అతి కొద్దిమందిలో యీ భావన అప్పుడప్పుడు పైకి వస్తూంటుంది.హేతుబద్ధంగా దానికి లొంగకుండా సమాధానం చెప్పుకోలేని మానసిక స్థితి ఏర్పడినప్పుడు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.నేను పిచ్చిదాన్ని కాకుండా వుండాలంటే నాకు మా నాన్నగారిలాటి తోడు కావాలి. ఈ విషయం నాకు మొదటినుండీ తెలిసినదే అయినా మేడమ్ చెప్పిన విధానం,బోధపరిచిన తీరు నాకు ధైర్యం కలిగించింది.
            మన మొదటి సంవత్సరం చివరనుండే నీ సాహచర్యంలో నాన్న పోలికలు కనిపించసాగాయి. రాజన్ మీద నువ్వు చూపించే అభిమానం,అతన్ని కష్టపెట్టకుండా అనునయించే పద్ధతీ అచ్చం మా నాన్నగారు అవలంభించినట్టుండేవి.నువ్వు సిగరెట్లు కాల్చేవాడివి,నాన్నకూడా పార్టీల్లో సిగార్ కాల్చేవారు.నీకు మిగతా క్లాస్ మేట్సుతో బాగా కలిసే నేర్పు ఉండేది. ఆడపిల్లల్లో నిన్ను ఆరాధించేవాళ్ళు యిద్దరు ముగ్గురు నాకు తెలుసు. నువ్వు వాళ్ళతో యెలా గడిపేదీ చూచాయగా వాళ్ళే నాకు చెప్పారు.నేను మీ రూమ్ కి నిన్ను చూడ్డానికి,నీ మీద నా అభిప్రాయాల్ని బలపరచుకోవడాని కేను.నువ్వేమో నేను రాజన్ కోసం వస్తున్నానుకుని,అతడిని నాకు దగ్గర చేయడానికి చేసే ప్రయత్నం నాకు కోపం తెప్పించేది. అయినా రాజన్ ఒక చాందసపు తమిళ బ్రాహ్మడు, వాడిని నేను యిష్టపడుతున్నాని నువ్వెలా అనుకున్నావ్?వాడిని పెళ్లి చేసుకుంటే వాడితో బాటు నేనుకూడా త్యాగయ్య కృతులో,అన్నమయ కీర్తనలో పాడుకుంటూ వాడి వయోలిన్ కి పూజ చెయ్యాలి.నేను యెప్పుడూ అతడిని  యిష్టపడుతున్నట్టు ప్రవర్తించలేదు. ...!! నేనే అతడి వెనకాల పడుతున్నానన్న భావన యావత్ ప్రపంచానికీ నమ్మకం కలిగించడానికి ప్రయత్నించాడు.
       "ప్రభా ప్రభా"అంటూ అందరిముందూ నా మీద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేవాడు. ఆఖరికి నువ్వు లేనప్పుడు నన్ను బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. నాలుగు తగిలించేసరికి ముఖం చూపించడానికి చెల్లక వూరికి వుడాయించేశాడు” తన స్వరం బొంగురుపోయింది,వెక్కుతూనే"ఆఖరికి నీకు కూడా నామీద అపోహ కల్పించాడు".ఇంక మాట్లాడలేకపోయింది. వెక్కి,వెక్కి యేడవడం….,దుఃఖం తెరలు,తెరలుగా వచ్చేస్తోంది.ఆ క్షణంలోతననెలా వూరడించాలో నాకు బోధపడలేదు.బాగా చీకటి పడింది. భవానీ ని చల్లటి నీళ్లు తెమ్మని చెప్పి,మరో సిగరెట్టు ముట్టించాడానికి హోటలు గుమ్మం వైపు వెళ్ళాను.
                 పదినిమిషాలు గడిచాక తను కొంచెం వూరడిల్లింది,  "సారీ శ్రీనూ ...!నన్ను నేను కంట్రోలు చేసుకోలేకపోయాను.నీ మీద నా అభిప్రాయం చెప్పడానికి ఈ వర్షం కురిసిన సాయంత్రానికి కుదిరింది. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు,నువ్వంటే నాకు యెంతో యిష్టం. నాయిష్టాన్ని నువ్వు సరేనంటావా...!!?నిన్ను నాలుగేళ్లుగా చూస్తున్నాను,బాగా ఆలోచించికాని ఒక నిర్ణయానికి రావు,మా నాన్నగారిలాగే.!”
“రేపు యిక్కడే కలుద్దాం. బాగా ఆలశ్యం అయిపోయింది,హాష్టలుదాకా సాయం రావా....?"
              ***                         ***                        
       


          తరవాత మా ఎంబీబీస్ పూర్తవడం,హౌస్సర్జన్సీ లో పెళ్లి. భరత్ పూర్ లో నా వుద్యోగం , ప్రభావతి ఆగ్రా లో సైకియాట్రీ పీజీ చేయడం. మొగుడూ పెళ్ళాలిద్దరూ సైకియాట్రిస్టులవుతే పుట్టే పిల్లలు పిచ్చివాళ్లయిపోతారని నేను సరదాగా హాస్యం చేసేవాడిని. తను ఢిల్లీలో వుద్యోగం చేస్తూంటే,నేను ఎనస్థీషియాలో పీజీ పూర్తిచేశాను. మేం ఇద్దరం,మాకిద్దరు పిల్లలు.  హాయిగా వున్నాం. ఇప్పుడు వెళ్లి రాజన్ ని ఆప్యాయంగా కౌగిలించుకోవాలి,పాత కథలేవీ జరగనట్టే వుండాలి. అదుగో అల్వర్ స్టేషను వస్తోంది. రాజన్ జ్ఞాపకాలు వదిలి స్వయంగా మనిషితోనే మాట్లాడాలి.
                          


                       *******************************************************
   

                 
                                                                                                                                          
       
      .
                                                   
     
                                               
                                                                                                                                   
    
No comments: