Tuesday, August 28, 2012


Book Review

తెలుగుదారిలో వెలుగు దీపిక సి. పిబ్రౌన్

డా. పి. ఎస్. గోపాలకృష్ణ

చార్లెస్ఫిలిప్బ్రౌన్ (సి.పిబ్రౌన్) జీవితంగురించి, తెలుగుభాషోన్నతికి ఆయనచేసిన వెల కట్టలేనికృషిని గురించి, అనేక వివరాలతో కూడిన సమగ్రవంతమైన పరిశోధనాగ్రంథంఇది. సి.పిబ్రౌన్ అకాడెమివారి కోరికమేరకు డా. పి.ఎస్. గోపాలకృష్ణగారు ఈగ్రంథాన్ని అటు పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగానూ,ఇటు సామాన్య పాఠకులకు కూడా ఆసక్తికరం గానూ ఉండేలా దీన్ని రచించారు. అకాడెమి వారుకోరినట్టు గానే, అతిశయోక్తులకు, ఆధార రహితమైన వదంతులకు తావులేకుండా ఈరచనసాగింది. తెలుగులో ఇది అరుదైన విషయం; ఇటీవలకాలంలోవృద్ధి చెందుతూన్నపద్ధతి. 

అసంఖ్యాకమైన ప్రాచీనగ్రంథాల సేకరణకర్తగా, నిఘంటు కర్తగా,  ఛందోవ్యాకరణ విషయాల సంకలనకర్తగా,  భాషావేత్తగా, వేమన పద్యాలను వెలుగులోకి తీసుకువచ్చిన పరిశోధకుడుగా చాలామంది తెలుగువాళ్ళకు సి.పి.బ్రౌన్సు పరిచితుడు. ఐతే, ఎవరీవ్యక్తి? అతని నేపధ్యం ఏమిటి? ఎప్పుడు, ఎలా ఇవన్నీ సాధించాడు? ఆయన ప్రత్యేకత ఏమిటి?  ఈ ప్రశ్నలకు జవాబులు తెలిసినవాళ్ళు ఎక్కువమంది ఉండకపోవచ్చు. ఇందుకు కారణం - ఈ విషయాలపై సమగ్రమైన రచనలు లేకపోవడమే. ఈ లోటును తీర్చేందుకు ఈ గ్రంధం చాలా ఉపయుక్తంగా ఉంటుంది.  ఈ పుస్తకంలో చార్లెస్బ్రౌన్జీవితం, జీవితాశయం, ఆయనకెదురైన అనుభవాలు,  ఎదుర్కొన్న ఒడిదుడుకులు - చివరిగా తెలుగు సాహితీ చరిత్రలో ఆయన ఏర్పరచుకున్న విశిష్టమైన స్థానం - వీటన్నిటినీ రచయిత సమర్థవంతంగా సంధించారు. ఈస్ట్ఇండియాకంపెనీ వారికి చాప్లేయిన్గా కోల్కత్తాలో పనిచేసిన చార్లెస్బ్రౌన్తండ్రి గారైన డేవిడ్బ్రౌన్, స్వయంగా ప్రాచీనభాషల్ లోప్రావీణ్యం ఉన్నవాడు; బెంగాలి, ఉర్దూ భాషలు నేర్చుకున్నవాడు. క్రైస్తవ సాహిత్యాన్ని భారతీయభాషల్లోకి అనువదించేందుకు కృషిచేసినవాడు. బాల్యంలో కోల్కత్తాలో ఉండిన చార్లెస్బ్రౌన్, సంస్కృతం, అరబ్బీ కూడా నేర్చుకున్నాడు. తరువాతి దశలో ఈ భాషాజ్ఞానం తనకు ఎంతగానో ఉపయోగపడిందని గుర్తించాడు. ఈ సమాచారమంతా ఈ గ్రంథంలోఉంది. సి.పిబ్రౌన్ ఈస్ట్ఇండియాకంపెనీ వారి పౌరసేవ విభాగంలో చేరడం, సమర్థవంతమైన విధినిర్వహణకు స్థానికభాషలపై పట్టుసంపాదించాలని మద్రాస్గొవెర్నొర్తోమాస్మున్రో ఉపన్యసించినప్పుడు ఆసూచన బ్రౌన్మదిలో బలంగా నాటుకోవడం, తెలుగుభాషలో కలిగిన ఆసక్తి, జీవితాంతం కొనసాగిన తపనగా మారడం - ఇవేవీకూడా కాకతాళీయం అనిపించవు - ఈ పుస్తకంచదువుతూంటే.  బ్రౌన్జీవితంలోని మలుపులను, వాటిని నిర్దేశించిన చారిత్రికశక్తులను, సందర్భాన్ని - సవివరమైనసూచికలతోబాటుగా -  ఈరచనలోఆవిష్కరించారు.
యూరోపు నుండి బయలుదేరిన నావికులు, సాహసికులు, వర్తకులు ఖండాంతర దేశాలకు సముద్రమార్గాలని కనుక్కొన్ననాటి నుండి వలసపాలన సుస్థిరం అయ్యేనాటికి సుమారు రెండున్నర శతాబ్దాలు పట్టింది. ఈ సంధికాలంలో 'హఠాత్తుగా' ఎదురుపడ్డ భిన్నసమాజాల మధ్య - భాష, సాంస్కృతిక రంగాల్లో - అనేకానేక లావాదేవీలు జరిగాయి. రెండువైపులా జ్ఞానసముపార్జన జరిగింది.  ఉపరితలానికి సంబంధించిన ఈ పరిణామాలను స్థూలంగా మూడుదశల్లో జరిగినట్టు గాభావించవచ్చు. మొదటిదశలోని ప్రధానపాత్రధారులు క్రైస్తవమతప్రచారకులు.  వీరుమారుమూలప్రాంతాల్లోకి చొచ్చుకుపోయారు; స్థానికులతో మమేకం అయ్యారు, వారి భాషల్ని నేర్చుకున్నారు, ఆచారాలను తెలుసుకున్నారు. క్రైస్తవగ్రంధాల్నిఅనువదించారు. మతప్రచారంచేసారు. జరగబోయే వలససామ్రాజ్యనిర్మాణానికి పనికొచ్చే విలువైనసమాచారాల్ని పోగు చేసారు. (రెండవదశలో) వలస వ్యవస్థబలపడేకొద్దీ పెరిగినయూరోపియన్ల అవసరాలకై చర్చిలు నిర్మించారు, మతపరమైన సేవల్నిఅందించారు.  పాలనావ్యవస్థలో  భాగంగా న్యాయ, విద్యా విభాగాల్లో పనిచేసేందుకు పెద్దసంఖ్యలో యూరోపియన్‌లకు ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తర్ఫీదులో భాగంగానే ఈస్ట్ఇండియాకంపెనీవారు లండన్లో హెయిల్బరీ కళాశాలను స్థాపించారు; అక్కడే బ్రౌన్వంటి పౌరసేవకులు శిక్షణ పొందారు.  ఇటువంటివిద్యార్ధులకు (మొదటిదశకుచెందిన) ఫ్రెంచి మతబోధకుడు అబేదుబ్వా రచన'హిందూమేనర్స్అండ్కస్టమ్స్' ఈ కాలంనాటికి పాఠ్యపుస్తకం అయింది. భారతదేశానికి సంబంధించి చట్టబద్ధపాలనకు తొలిరూపం ఏర్పడింది. ఇకచివరిగా, మూడవదశనాటికి వలస పాలనసు స్థిరంగా నిలదొక్కుకున్నది. భారతదేశాన్ని క్రైస్తవదేశంగా మార్చే ప్రయత్నం వెనక్కితగ్గింది. శాస్త్ర, సాంకేతికరంగాల్లో పురోగతి అవసరంఅయింది. రైల్వేలు, రోడ్లు, వంతెనలు, ఆనకట్టలు, విద్యుత్తు, ఓడరేవులు, వగైరాలు అవసరంఅయ్యాయి. వైద్యం, పరిశోధనారంగాల్లో యూరోపియన్నిపుణులు - ముఖ్యంగా సివిల్ఇంజినీర్లు - మనదేశానికి పెద్దసంఖ్యలలో రాసాగారు; (మనరాష్ట్రానికిసంబంధించి, ఆర్థర్కాటన్దొర ఈ కోవకి చెందిన వాడే).   స్థానికులకు యూరోపియన్పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. వీరు స్థానికులను వారి అలవాట్లను, ఆచారాలను చులకనగా కాకుండా సానుభూతితో పరిశీలించారు. పాలితుల చరిత్రనీ, సమకాలీన సమాజాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేశారు. తత్ఫలితంగా, స్థానిక ప్రజలకు వీరి పట్ల గౌరవభావం పెరిగింది.  వీరిలో అనేకులు నేటికీ ప్రజల కృతజ్ఞతా పూర్వక నివాళులు అందుకుంటున్నారు. ఇది భారతదేశం అంతటా కనిపించే ధోరణి. 
చార్లెస్బ్రౌన్తండ్రి అయిన డేవిడ్బ్రౌన్పైన చెప్పిన క్రమంలో మొదటి దశకు చెందిన వాడని ఊహిస్తే, చార్లెస్బ్రౌన్‌ను రెండోదశలోని వ్యక్తి అనుకోవచ్చు. అయితే ఆయన చేసిన అపూర్వమైన కృషి మూలంగా, తన కాలానికన్నా ఎంతో ముందుకు పయనించి మూడోదశలోకి ప్రవేశించాడు;  తెలుగు వారి హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఆయన ఒక ఒంటరి వైతాళికుడు. సమకాలీనులు ఆయన్ను పూర్తిగా అందుకోలేక పోయారు. నిజానికి నేటికి కూడా బ్రౌన్పై జరగాల్సిన స్థాయిలో పరిశోధనలు జరగ లేదు. ఆయన సేకరించిన గ్రంథాలన్నీ వెలుగు చూడలేదు.
ఈ నేపధ్యంలో రాబోయేకాలంలో మరింత విస్తృమైన పరిశోధనలు జరిపేందుకు, మరిన్ని విశ్లేషణలు ప్రతిపాదించేందుకు అవసరమైన విలువైన సమాచారం, సూచికలు ఈ పుస్తకం నిండా ఉన్నాయి. ఆయన పుస్తకాల ముఖపత్రాలు, ఇతర చిత్రాలు ఉన్నాయి. బ్రౌన్తనదినచర్య పుస్తకాల్ని తగులబెట్టడం, ఆయన చిత్తరువు గాని, ఛాయాచిత్రం గాని లభించక పోవడం తెలుగువారి దురదృష్టం. బంగోరె తన పరిశోధనను, జీవితాన్నిముందుగానే చాలించడం మన దౌర్భాగ్యం. బ్రౌన్జీవితంపై, ఆయన చేసిన భాషాసాహిత్య సేవలపై గతంలో జరిగిన ప్రయత్నాల్ని వివరించారు. బహుశా బ్రౌన్చిత్తరువు లేనందున ఆయనపుస్తకాలకే పటం కట్టి, ఆయన సంతకాన్నిజోడించి - ఈ పుస్తకానికి ముఖచిత్రంగా అందించారు - విలక్షణంగా. లండన్ లోఆయన సమాధిని వెలికి తీయడంలో పసుమర్ తిసత్యనారాయణమూర్తిగారి కృషిని పేర్కొన్నారు. ఆయనకు కడప' కాలేజా' లోను, బయటా తోడ్పడిన వ్యక్తులను గుర్తించే ప్రయత్నం చేసారు. బ్రౌన్మిత్రులనీ, వారితో పాటు శత్రువుల్నీపరిచయం చేసారు.     'బ్రౌన్ ఎటువంటి వ్యక్తి అయి ఉంటాడు?' అనే ప్రశ్నకు, సహజ కుతూహలానికి, స్పందనగా ఆసక్తికరమైన సమాచారం, పరిశీలన అందజేశారు (12వఅధ్యాయం, "బ్రౌన్వ్యక్తిత్వం"). 
 "బ్రౌన్ను ఎందుకు గుర్తుంచుకోవాలి?" అనే చివరి అధ్యాయంలో, అతి ముఖ్యమైన ఈ సమకాలీన సందేహానికి జవాబు చెప్పే ప్రయత్నం చేసారు. అయితే ముందు ముందు ఇది ఇంకా మరింత వివరంగా, లోతుగా కొనసాగాల్సిన చర్చాంశం. ఉదాహరణకి,  'అభాసాంధ్రనిఘంటువు' లేక 'మిశ్రభాషానిఘంటువు'ని వెలువరిస్తూ,  "ఈ నిఘంటువులో ప్రతి పదానికి తెలుగు సమానార్థకం ఇచ్చాను. విదేశీ పదాలను వదిలించుకోవాలనేవారికి ఇది సాయపడుతుంది.  ఇరవై పదాల్లో ఒక పదం కాపాడుకోవడానికి అర్హంఏమో! తెలుగు మాట్లాడేటప్పుడూ,  రాసేటప్పుడూ ఈ మిశ్రమ భాషను వాడకుం డాఉండాలి" అని బ్రౌన్  (వినమ్రంగా)  సూచించినట్లు ఈ పుస్తకర చయత తెలియజేస్తున్నారు. మిశ్రభాషలోని సౌలభ్యాల్నిపేర్కొంటూనే ఈ విషయంలో జాగరూకత ఎందుకు అవసరమో ఆనాడే బ్రౌన్వివరించినట్ లుగోపాలకృష్ణగారు నమోదుచేసారు.
తెలుగువారందరూ (వారి వారి మమ్మీ డాడీ, అంకుల్ ఆంటీలతో సహా) తలో చెయ్యా వేస్తుండగా, స్వయంవిచ్ఛిత్తివైపు శరవేగంతో తెలుగుభాష పయనిస్తున్న నేటి యుగంలో దీన్ని గతం నుండి వెలువడిన చివరిహెచ్చరికగా మనం స్వీకరించవచ్చు. ప్రాచీనభాషగా గుర్తింపువచ్చినా కూడా తెలుగుమృతభాషగా సమాధికాకుండా ఉండాలంటే కొన్ని అత్యవసర చర్యలు, వాటితో బాటు దీర్ఘకాలికప్ రణాళికలు అవసరం. (అలాగని అతివైపు పోనక్కర్లేదు అని బ్రౌనే స్వయంగా చెప్పుకొచ్చాడు - ఆనాడే). ఈ విషయంలో బ్రౌన్చేసిన సూచనలని ఏమేరకి ఇప్పుడు అన్వయించు కోవచ్చు? పర్యవసానంగా ఎవరెవరు ఏమేంచెయ్యాలి?.......?
మొత్తానికి ఈ పుస్తకం బ్రౌన్మహాశయుని జీవితానుభవాన్ని, ఆయనకున్న విశిష్టస్థానాన్ని ఇప్పటికి లభించిన పరిశోధనల ఆధారంగా (అతిశయోక్తులకు పోకుండా) శాస్త్రీయంగా, సమగ్రంగా మన ముందుంచింది. తెలుగుభాషనీ, సాహిత్యాన్ని ఉద్ధరించేందుకుసి. పిబ్రౌన్ అకాడెమివారు చేస్తున్న కృషికి ఇది ఉత్తమ నిదర్శనం. తెలుగుని ప్రేమించేవాళ్ళు చదివి, ఆలోచించి తమ అన్వేషణను కొనసాగించాల్సిన సందర్భాన్ని కల్పించే సరళరూపంలోని బరువైన పరిశోధనాగ్రంధం.

U.Sudhakar 
Mumbai

No comments: