Thursday, December 27, 2012



BOOK REVIEW
ఆంధ్ర జ్యోతి, ఆదివారం అనుబంధం, 23 డిశెంబరు 2012. కొత్త పుస్తకాలు 
 ప్రాచీన ప్రపంచానికి మంచి పరిచయం
      సోవియట్ యూనియన్ ప్రథమ సోషలిస్టు దేశంగా వర్ధిల్లిన కాలంలో వారి చొరవతో, ఖర్చు తో ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లోకి అనేక రచనలు అనువదించబడ్డాయి. వీటి ద్వారా లక్షలాది పాఠకులకు రాజకీయ భావజాల ప్రచారం కోసం ఉద్దేశించిన గ్రంథాలతో బాటు రష్యన్ సాహిత్యమూ, బాల సాహిత్యమూ, శాస్త్రీయ అధ్యయన గ్రంథాలూ, పాఠ్యపుస్తకాలూ అతి తక్కువ ధరలకి లభించే నాణ్యమైన రచనలుగా అందుబాటులోకి వచ్చాయి. తెలుగుకి సంబంధించి - అనువాద రంగంలో వుప్పల లక్ష్మణరావుగారూ, రాచమల్లు రామచంద్రారెడ్డిగారూ, ఇంకా ఇతరులూ చేసిన అపారమైన కృషి గత తరం పాఠకులకు సుపరిచితం. మాస్కో నుండి 'ప్రగతి ప్రచురణాలయం', 'రాదుగ ప్రచురణలు' వెలువరించిన అసంఖ్యాకమైన గ్రంథాలు తెలుగు పుస్తక ప్రియుల అభిమానాన్ని చూరగొన్నాయి; వారి ఆలోచనల్ని, ప్రపంచాన్ని విస్తృత పరిచాయి. సోవియట్ చరిత్రకారుడు ఫ్యోదోర్ కొరోవ్కిన్ రచించిన 'ప్రాచీన ప్రపంచ చరిత్ర' మార్గాన పయనించి ఒక ప్రామాణిక గ్రంథంగా ప్రపంచమంతటా ప్రసిద్ధికెక్కింది. 1987లో మొదటి సారిగా తెలుగులోకి అనువాదమై వచ్చిన పుస్తకాన్ని విశాలాంధ్ర వారు ఇప్పుడు పునర్ముద్రించారు

చరిత్రపట్ల కుతూహలం కలిగిన వారికీ, చరిత్రను పాఠ్యాంశంగా చేపట్టిన వారికీ కూడా ఉపయోగపడే ఆసక్తికరమైన పుస్తకం ఇది. ఆదిమ మానవుడితో మొదలుపెట్టి రోమన్ సామ్రాజ్యపు పతనం వరకూ- మధ్యధరా సముద్ర తీరం నుండి చైనా వరకూ నడిచి వెళ్ళిన అనేక శతాబ్దాల చారిత్రిక ఘటనలు, వాటిని నడిపించిన గతిసూత్రాలూ పుస్తకపు విస్తృతమైన పరిధిలో ఇమిడిపోయాయి. అందుకే ఇది ప్రాచీన చరిత్రను పరిచయం చేసే ఒక ఉత్తమ రచనగా ఇప్పటికీ గుర్తించబడుతోంది. అన్ని ఉత్తమ పరిచయ గ్రంథాల మాదిరిగానే ఇది కూడా- ఒకవైపు బలమైన అవగాహనా చట్రాన్ని ఏర్పరుస్తూ, మరోవైపు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చదవాలి అనే జిజ్ఞాసను పాఠకులలో కలిగిస్తుంది. ఈజిప్టు, మెసొపొటేమియా, ఆసియా మైనర్, పర్షియా, గ్రీకు, రోమన్ సామ్రాజ్యాల నాగరికతల పుట్టుక, పెరుగుదల, వినాశనాలతో పాటు, ఆయా సమాజాల నడుమ వాణిజ్యం, యుద్ధం, వలస రూపంలో కొనసాగిన సంబంధాలనూ, సంఘర్షణలనూ పుస్తకం విశ్లేషణాత్మకంగా నమోదు చేస్తుంది. సమాజాలు సృష్టించిన కళలనీ, సాహిత్యాల్నీ మన ముందుంచుతుంది. అయితే ఆనాటి భారత, చైనా దేశాలు భూ ఖండానికి బాహ్యంగానే ఉండిపోయాయి. భారతదేశంపై అలెగ్జాండర్ చేసిన విఫల దండయాత్రనూ, 'సిల్కు మార్గం' వెంబడి కొనసాగిన పట్టు వ్యాపారాన్నీ మినహాయిస్తే.

అన్నిటికంటే ముఖ్యంగా, పుస్తకం చరిత్ర గమనాన్ని నిర్దేశించిన   శ్రమ విభజననీ, ఉత్పత్తి సంబంధాల్నీ, దోపిడీనీ, అవన్నీ కలిసి సంపదని సృష్టించిన విధానాన్ని విశ్లేషిస్తుంది. వీటన్నిటి వెనుక దాగిన విషాదాన్ని పలికిస్తుంది. శ్రామికుల, బానిసల పట్ల హేతుబద్ధమైన పక్షపాత వైఖరితో, సానుభూతితో చరిత్రని ఆవిష్కరిస్తుంది. ప్రతీ అధ్యాయం చివర ఉన్న ప్రశ్నలు పాఠకుల అవగాహనకు పదును పెడతాయి. అధ్యాయాలను, కీలకమైన అంశాలను గుదిగుచ్చే అంతస్సూత్రాల వైపు పాఠకుల దృష్టిని ఆకర్షించే కొండగుర్తులను అందిస్తుంది. (వివిధ విషయాలను సంధించే నేటి ఇంటర్నెట్ కాలపు హైపర్ లింకుల మాదిరిగా.) కాలం గడుస్తున్న కొద్దీ, ముఖ్యంగా పురాతత్వ పరిశోధనల్లో కొత్త క్షేత్రాలు, అంశాలు బయటపడే కొద్దీ చరిత్రకు సంబంధించిన అవగాహనలో మార్పులు వస్తాయి. అయితే ముప్పై ఏళ్ళనాటి పుస్తకపు పునర్ముద్రణలో అటువంటి మార్పులు చోటు చేసుకున్నట్లు కనబడదు. గ్రీసు, రోమ్లు ఒక్కొక్క దానికి 70-80 పేజీలు ఇచ్చి, ప్రాచీన భారతదేశానికి, చైనాకీ పదేసి పేజీలు మాత్రమే కేటాయించడం మనకు నిరాశ కలిగిస్తుంది.

ఆనాటి యూరపు-కేంద్రీకృత అవలోకనం ఇందుకు ఒక కారణం కావచ్చు. మన దేశానికి సంబంధించి- కుల వ్యవస్థ గురించీ, రామాయణ, మహాభారతాల గురించీ ప్రస్తావించినప్పటికీ- మన దేశపు ప్రత్యేకతలైన వేదాలు, భగవద్గీత కనిపించవు. ముఖ్యంగా బౌద్ధ ధర్మం విశిష్టతనూ, క్రైస్తవం, ఇస్లాం ఇంకా పుట్టక మునుపే అది సాధించిన అంతర్జాతీయ వ్యాప్తినీ పుస్తకం పూర్తిగా విస్మరించింది. దీంట్లో అసంఖ్యాకంగా ఉన్న చిత్రాలు, పటాలు, పాఠకుల ఆసక్తినీ, అవగాహననూ మరింత పెంచేందుకు ఉద్దేశించినవి. అయితే పుస్తకపు ముద్రణలో నాణ్యత పూర్తిగా లోపించింది; అందువలన చాలా చిత్రాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అలాగే పుస్తక రచయిత గురించి గానీ, అనువాదకుల గురించి గానీ ఎక్కడా ఒక్క ముక్కయినా చెప్పకపోవడం మరో లోపం. ఇటువంటి పుస్తకాన్ని చాలాకాలం తరువాత పునర్ముద్రించేటప్పుడు- ఒక సంపాదక వర్గాన్ని ఏర్పరచి సమకాలీన పరిశోధకుల్ని, సలహాదారుల్ని సంప్రదించి ఉండాల్సింది.

ప్రచురణలోని పరిమితుల్ని పక్కనబెడితే నిడమర్తి ఉమారాజేశ్వరరావు, రాచమల్లు రామచంద్రారెడ్డిగారల ప్రతిభకూ, కృషికీ పుస్తకం ఒక చక్కటి నిదర్శనం. అటు వర్ణనల్నీ, వచనాన్నే కాకుండా, భాషా సాహిత్యాంశాల్నీ, పద్య, గేయ ఖండికల్నీ వారు అనువదించిన తీరు అమోఘం.  మంచి అనువాదాలు చెయ్యాలి, మంచి తెలుగు రాయాలి అనుకునేవారికి పుస్తకం మార్గదర్శకం.
- ఉణుదుర్తి సుధాకర్
---------------------------------------------------------------------------------------------
ప్రాచీన ప్రపంచ చరిత్ర
మూలం : ఫ్యోదోర్ కొరోవ్కిన్. అనువాదం : నిడమర్తి ఉమారాజేశ్వరరావు, రాచమల్లు రామచంద్రారెడ్డి
పేజీలు : 310, వెల : రూ.160. ప్రతులకు : విశాలాంధ్ర బుక్ హౌస్

No comments: