Thursday, December 27, 2012



BOOK REVIEW
ఆంధ్ర జ్యోతి, ఆదివారం అనుబంధం, 23 డిశెంబరు 2012. కొత్త పుస్తకాలు 
 ప్రాచీన ప్రపంచానికి మంచి పరిచయం
      సోవియట్ యూనియన్ ప్రథమ సోషలిస్టు దేశంగా వర్ధిల్లిన కాలంలో వారి చొరవతో, ఖర్చు తో ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లోకి అనేక రచనలు అనువదించబడ్డాయి. వీటి ద్వారా లక్షలాది పాఠకులకు రాజకీయ భావజాల ప్రచారం కోసం ఉద్దేశించిన గ్రంథాలతో బాటు రష్యన్ సాహిత్యమూ, బాల సాహిత్యమూ, శాస్త్రీయ అధ్యయన గ్రంథాలూ, పాఠ్యపుస్తకాలూ అతి తక్కువ ధరలకి లభించే నాణ్యమైన రచనలుగా అందుబాటులోకి వచ్చాయి. తెలుగుకి సంబంధించి - అనువాద రంగంలో వుప్పల లక్ష్మణరావుగారూ, రాచమల్లు రామచంద్రారెడ్డిగారూ, ఇంకా ఇతరులూ చేసిన అపారమైన కృషి గత తరం పాఠకులకు సుపరిచితం. మాస్కో నుండి 'ప్రగతి ప్రచురణాలయం', 'రాదుగ ప్రచురణలు' వెలువరించిన అసంఖ్యాకమైన గ్రంథాలు తెలుగు పుస్తక ప్రియుల అభిమానాన్ని చూరగొన్నాయి; వారి ఆలోచనల్ని, ప్రపంచాన్ని విస్తృత పరిచాయి. సోవియట్ చరిత్రకారుడు ఫ్యోదోర్ కొరోవ్కిన్ రచించిన 'ప్రాచీన ప్రపంచ చరిత్ర' ఈ మార్గాన పయనించి ఒక ప్రామాణిక గ్రంథంగా ప్రపంచమంతటా ప్రసిద్ధికెక్కింది. 1987లో మొదటి సారిగా తెలుగులోకి అనువాదమై వచ్చిన ఈ పుస్తకాన్ని విశాలాంధ్ర వారు ఇప్పుడు పునర్ముద్రించారు. 

చరిత్రపట్ల కుతూహలం కలిగిన వారికీ, చరిత్రను పాఠ్యాంశంగా చేపట్టిన వారికీ కూడా ఉపయోగపడే ఆసక్తికరమైన పుస్తకం ఇది. ఆదిమ మానవుడితో మొదలుపెట్టి రోమన్ సామ్రాజ్యపు పతనం వరకూ- మధ్యధరా సముద్ర తీరం నుండి చైనా వరకూ నడిచి వెళ్ళిన అనేక శతాబ్దాల చారిత్రిక ఘటనలు, వాటిని నడిపించిన గతిసూత్రాలూ ఈ పుస్తకపు విస్తృతమైన పరిధిలో ఇమిడిపోయాయి. అందుకే ఇది ప్రాచీన చరిత్రను పరిచయం చేసే ఒక ఉత్తమ రచనగా ఇప్పటికీ గుర్తించబడుతోంది. అన్ని ఉత్తమ పరిచయ గ్రంథాల మాదిరిగానే ఇది కూడా- ఒకవైపు బలమైన అవగాహనా చట్రాన్ని ఏర్పరుస్తూ, మరోవైపు ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చదవాలి అనే జిజ్ఞాసను పాఠకులలో కలిగిస్తుంది. ఈజిప్టు, మెసొపొటేమియా, ఆసియా మైనర్, పర్షియా, గ్రీకు, రోమన్ సామ్రాజ్యాల నాగరికతల పుట్టుక, పెరుగుదల, వినాశనాలతో పాటు, ఆయా సమాజాల నడుమ వాణిజ్యం, యుద్ధం, వలస రూపంలో కొనసాగిన సంబంధాలనూ, సంఘర్షణలనూ ఈ పుస్తకం విశ్లేషణాత్మకంగా నమోదు చేస్తుంది. ఆ సమాజాలు సృష్టించిన కళలనీ, సాహిత్యాల్నీ మన ముందుంచుతుంది. అయితే ఆనాటి భారత, చైనా దేశాలు ఈ భూ ఖండానికి బాహ్యంగానే ఉండిపోయాయి. భారతదేశంపై అలెగ్జాండర్ చేసిన విఫల దండయాత్రనూ, 'సిల్కు మార్గం' వెంబడి కొనసాగిన పట్టు వ్యాపారాన్నీ మినహాయిస్తే.

అన్నిటికంటే ముఖ్యంగా, ఈ పుస్తకం చరిత్ర గమనాన్ని నిర్దేశించిన   శ్రమ విభజననీ, ఉత్పత్తి సంబంధాల్నీ, దోపిడీనీ, అవన్నీ కలిసి సంపదని సృష్టించిన విధానాన్ని విశ్లేషిస్తుంది. వీటన్నిటి వెనుక దాగిన విషాదాన్ని పలికిస్తుంది. శ్రామికుల, బానిసల పట్ల హేతుబద్ధమైన పక్షపాత వైఖరితో, సానుభూతితో చరిత్రని ఆవిష్కరిస్తుంది. ప్రతీ అధ్యాయం చివర ఉన్న ప్రశ్నలు పాఠకుల అవగాహనకు పదును పెడతాయి. అధ్యాయాలను, కీలకమైన అంశాలను గుదిగుచ్చే అంతస్సూత్రాల వైపు పాఠకుల దృష్టిని ఆకర్షించే కొండగుర్తులను అందిస్తుంది. (వివిధ విషయాలను సంధించే నేటి ఇంటర్నెట్ కాలపు హైపర్ లింకుల మాదిరిగా.) కాలం గడుస్తున్న కొద్దీ, ముఖ్యంగా పురాతత్వ పరిశోధనల్లో కొత్త క్షేత్రాలు, అంశాలు బయటపడే కొద్దీ చరిత్రకు సంబంధించిన అవగాహనలో మార్పులు వస్తాయి. అయితే ముప్పై ఏళ్ళనాటి ఈ పుస్తకపు పునర్ముద్రణలో అటువంటి మార్పులు చోటు చేసుకున్నట్లు కనబడదు. గ్రీసు, రోమ్‌లు ఒక్కొక్క దానికి 70-80 పేజీలు ఇచ్చి, ప్రాచీన భారతదేశానికి, చైనాకీ పదేసి పేజీలు మాత్రమే కేటాయించడం మనకు నిరాశ కలిగిస్తుంది.

ఆనాటి యూరపు-కేంద్రీకృత అవలోకనం ఇందుకు ఒక కారణం కావచ్చు. మన దేశానికి సంబంధించి- కుల వ్యవస్థ గురించీ, రామాయణ, మహాభారతాల గురించీ ప్రస్తావించినప్పటికీ- మన దేశపు ప్రత్యేకతలైన వేదాలు, భగవద్గీత కనిపించవు. ముఖ్యంగా బౌద్ధ ధర్మం విశిష్టతనూ, క్రైస్తవం, ఇస్లాం ఇంకా పుట్టక మునుపే అది సాధించిన అంతర్జాతీయ వ్యాప్తినీ ఈ పుస్తకం పూర్తిగా విస్మరించింది. దీంట్లో అసంఖ్యాకంగా ఉన్న చిత్రాలు, పటాలు, పాఠకుల ఆసక్తినీ, అవగాహననూ మరింత పెంచేందుకు ఉద్దేశించినవి. అయితే ఈ పుస్తకపు ముద్రణలో నాణ్యత పూర్తిగా లోపించింది; అందువలన చాలా చిత్రాలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అలాగే ఈ పుస్తక రచయిత గురించి గానీ, అనువాదకుల గురించి గానీ ఎక్కడా ఒక్క ముక్కయినా చెప్పకపోవడం మరో లోపం. ఇటువంటి పుస్తకాన్ని చాలాకాలం తరువాత పునర్ముద్రించేటప్పుడు- ఒక సంపాదక వర్గాన్ని ఏర్పరచి సమకాలీన పరిశోధకుల్ని, సలహాదారుల్ని సంప్రదించి ఉండాల్సింది.

ప్రచురణలోని పరిమితుల్ని పక్కనబెడితే నిడమర్తి ఉమారాజేశ్వరరావు, రాచమల్లు రామచంద్రారెడ్డిగారల ప్రతిభకూ, కృషికీ ఈ పుస్తకం ఒక చక్కటి నిదర్శనం. అటు వర్ణనల్నీ, వచనాన్నే కాకుండా, భాషా సాహిత్యాంశాల్నీ, పద్య, గేయ ఖండికల్నీ వారు అనువదించిన తీరు అమోఘం.  మంచి అనువాదాలు చెయ్యాలి, మంచి తెలుగు రాయాలి అనుకునేవారికి ఈ పుస్తకం మార్గదర్శకం.
- ఉణుదుర్తి సుధాకర్
---------------------------------------------------------------------------------------------
ప్రాచీన ప్రపంచ చరిత్ర
మూలం : ఫ్యోదోర్ కొరోవ్కిన్. అనువాదం : నిడమర్తి ఉమారాజేశ్వరరావు, రాచమల్లు రామచంద్రారెడ్డి
పేజీలు : 310, వెల : రూ.160. ప్రతులకు : విశాలాంధ్ర బుక్ హౌస్

Saturday, December 1, 2012






BOOK REVIEW Part III

సమకాలీన పరిస్థితులు
ఆర్ధిక సంస్కరణల (సు. 1990) అనంతరం దేశపు పారిశ్రామికీకరణ యొక్క వేగం, దిశ,వ్యాప్తి త్వరిత గతిన మారిపోయాయి. గడిచిన ఇరవై ఏళ్లల్లో కొన్ని ధోరణులు స్పష్టం అయ్యాయి. రెండవ దశలో ప్రముఖ పాత్ర  వహించిన పబ్లిక్ రంగ సంస్థల్లోని తమ వాటాలను అమ్ముకొని, యాజమాన్య బాధ్యతల నుండి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. మరో వైపు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పోటీ పడుతూ దేశ, విదేశీయ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయి. పెట్టుబడి ఆహ్వానిస్తే రాదు; దాని లాభార్జనకు గల అవకాశాలను పెంచితేనూ, దానికి భద్రతను కల్పిస్తేనూ వస్తుంది;ఈ రెండింటిలో ఏది లోపించినా పారిపోతుంది.  పన్నుల్లో మినహాయింపులూ, రాయతీలు కల్పించడానికి అన్ని ప్రభుత్వాలు సిద్ధం ప్రకటిస్తున్నాయి. అయితే ఇంతకన్నా కష్టమైన పనులు మూడున్నాయి:రోడ్లు, నీళ్ళు, విద్యుత్ సరఫరాతోబాటు ఇతర సదుపాయాలుకల్పించడం;పెద్ద ఎత్తున, తగిన సంఖ్యలో కార్మికుల నైపుణ్యాలను పెంచడం;ముఖ్యంగా (రెండో దశలోనే పాతుకుపోయిన) పారిశ్రామిక సంబంధాలను పునర్నిర్వచించడం. ఈ మూడు విషయాల్లోనూ ఇంచుమించుగా అన్ని ప్రభుత్వాలూ చేతులెత్తేశాయి. పైగా వీటిని పెట్టుబడికి విడిచిపెడుతున్నాయి. మొదటి అంశం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యానికి, అంతులేని కుంభకోణాలకూ పునాది వేసింది. ఇక రెండో అంశానికి వస్తే కేంద్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నదిగాని ఫలితాలు ఇప్పట్లో రావు. మూడో విషయం పై మాత్రం ప్రైవేటురంగం తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించింది. ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తున్నది.
ఈ స్థితిలోశ్రామిక వర్గం నిర్మాణాత్మకంగా స్పందించి, తాము సాధించుకున్న వాటిని నిలబెట్టుకుంటూనే - ప్రజాహితంగా జరిగే పారిశ్రామికాభివృద్ధికీ, పెట్టుబడికీతాము వ్యతిరేకులం కాదనే సంకేతం ఇవ్వగలగాలి.'లాభం' అనేది తిట్టుమాట కాదని వామపక్షీయులు కూడా నేడు ఒప్పుకుంటున్నారు.పాతికేళ్ళ పాటు నిర్విరామంగా బెంగాల్ ని పాలించిన వామపక్ష పార్టీలు పెట్టుబడిని వెంటాడి పొలిమేరల వెలుపలకు తరిమికొట్టాయి. చివరి దశలో టాటా వారిని ఆహ్వానించినా, వారు సహకరించినా కూడా ఫలితం మాత్రం దక్క లేదు. సగం పూర్తయిన నానో ప్రాజెక్టుని గుజరాత్   ప్రభుత్వం  తన్నుకుపోయింది.పెట్టుబడికీ పారిశ్రామికీకరణకూ అత్యంత స్నేహపూరిత రాష్ట్రంగా గుజరాత్ ని చిత్రించడానికి ఈ పరిణామాలు తోడ్పడ్డాయి
అభివృద్ధిలోనూ, పారిశ్రామికీకరణలోనూ ఉన్న అసమతుల్యం కారణంగా - వివిధ రాష్ట్రాల, ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు, ఘర్షణలు మరింత ఉధృతం అయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ దిశలో వస్తూన్న కొన్ని పరిణామాలను చూస్తూనే ఉన్నాం. పారిశ్రామికీకరణకు బాహ్యంగా ఉండిపోయిన గిరిజనులు - ప్రధాన బాధితులుగా, ప్రాజెక్టుల వలన, గనుల త్రవ్వకాల మూలంగా నిర్వాసితులుగా మిగిలిపోతున్నారు. వారిలోని యువతీ యువకుల్లో ఎక్కువమంది కొద్దిపాటి చదువులవలన తమ పూర్వీకుల జీవన విధానానికి తిరిగి వెళ్ళలేక,అలాగని కొత్త జీవనాధారాలని అందుకోలేక మధ్యస్తంగా మగ్గుతున్నారు.
కార్మికవర్గ నైపుణ్యం, శిక్షణ, ఉద్యోగావకాశాల విషయంలో పురుషులకంటే స్త్రీల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. ఉదాహరణకి, పనికోసం గ్రామాలనుండి పట్టణాలకుతరలివచ్చే స్త్రీలు మట్టిమోసే పనిలోనే కనిపిస్తారు. వాళ్ళు ఎప్పటికీ మేస్త్రీలు కాలేరు. పైగా వంట పని, పిల్లల్ని చూసుకోవడం వారి బాధ్యతలే; లైంగిక దోపిడీ సరేసరి. ఇటీవల పురుషులలో చాలామంది సెక్యూరిటీగార్డులవుతున్నారు.ఆ పనిశ్రమకీ,ఉత్పత్తికీ ఎంతదూరంలో ఉంటుందో చెప్పనక్ఖర్లేదు. స్త్రీ పురుషులిరువురూ కూడా ఎలెక్త్రీశియన్లు, ప్లంబర్లూ, ఫిట్టర్లూ, వెల్డర్లూ, నర్సులూ, మంత్రసానులూ,  మెకానిక్కులూ, డ్రైవర్లూ,వగైరా కాగల అవకాశాలను కోల్పోతున్నారు. ఉత్పత్తిలోభాగస్వాములు కాలేక పోతున్నారు. పైగా ఇలా నగరాలకు తరలివచ్చే వారిలోనే నగరజీవనపు మెరుగుల్ని అందుకొనే ప్రయత్నంలో రెండో తరానికల్లా తాగుడు, మాదకద్రవ్యాల వాడకం, నేరస్తుల ముఠాలలో చేరడం, వేశ్యావృత్తిలోకి దిగడం - ఇటువంటి ప్రమాదకరమైన ధోరణులు చోటుచేసుకుంటున్నాయి. స్వతంత్రం వచ్చిన 60 ఏళ్ల తరవాత పబ్లిక్-ప్రైవేటు రంగాల ఉభయ నేతృత్వంలో 2022 నాటికల్లా28 పారిశ్రామిక రంగాలలో 50 కోట్లమంది  నిపుణులైన కార్మికుల్ని, టెక్నీషియన్లనీ తయారు చేయ్యాలనే బృహత్తర ఆశయంతో 'నేషనల్ స్కిల్డెవలప్మెంట్ కార్పోరేషన్' ని నెలకొల్పడం జరిగింది. ఇల్లంటుకున్నాక నుయ్య తవ్వడం అంటే ఇదే. 
గ్లోబలైజేషన్ తరవాత ప్రపంచపు నలు మూలలనుండీ పెట్టుబడి మన దేశానికి యధేచ్చగా వస్తోంది, పోతోంది. కాని మానవవనరులకు మాత్రం ఆ స్వేచ్ఛ లోపించింది. పని కోసం విదేశాలకు పోవాలంటే వీసాలు, వర్క్ పెర్మిట్లు అడ్డు పడినంత కాలం, సహజ వనరులపై గుత్తాధిపత్యం కొనసాగినంత కాలం, అది నిజమైన ప్రపంచీకరణ కాజాలదు. మౌలిక సదుపాయాల్లో, కార్మికులనైపుణ్యంలో ఉన్న తీవ్రమైన లోటు వలన పెట్టుబడి కొన్ని రంగాలకు పరిమితం అవుతోంది. ఉద్యోగావకాశాలపెంపునకు సంబంధించి ఇదెంతమాత్రం ఆరోగ్యకరం కాదు.
ముగింపు
‘కార్మికగీతం' నవల చివరిలో మేడే నాడు రాజగోపాలరావు తన ఉపన్యాసంలో స్వంత ఆస్తి పోయి అది సమాజ పరంకావాలంటాడు.ఉత్పత్తి సాధనాలన్నింటినీ శ్రామిక వర్గం స్వాధీనం చేసుకోవాలంటాడు. నవలా కాలం నాటికింకా సోవియట్ యూనియన్, తూర్పు యూరపు దేశాలూ కుప్పకూలిపోలేదు. చైనాలో రాజ్యం సృష్టించిన, ఏ హక్కులూ లేని,  పెట్టుబడిదారీ విధానపు వికృత రూపం ఇంకా రూపు దిద్దుకోలేదు. కాంబోడియాలోఅస్థిపంజరాలు బయట పడలేదు. అందుచేత అప్పటికదే ఆదర్శం, ఆశాకిరణం. రష్యా, చైనాల మార్గాలు మన మార్గాలు కానేరవు అనేది మాత్రం ఇప్పుడు స్పష్టం. మనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య సంస్థల్నిశక్తివంతంగా వినియోగించగలగడమొక్కటే మార్గం.పశ్చిమయూరోపు, స్కాండినేవియా దేశాల్లో పెట్టుబడి-కార్మికవర్గంమధ్య విభేదాలు సామరస్యం గానే పరిష్కరించ బడ్డాయి. అక్కడి ప్రభుత్వాలు, యాజమాన్యం, అలాగే యూనియన్లూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.సాంఘిక సంక్షేమపథకాలు, ప్రజాస్వామ్య సంస్థలూ బలంగా ఉన్నాయి. గూండాల దౌర్జన్యంలేదు. అక్కడి మోడల్ లో మనకు పనికివచ్చేఅంశాలు ఉన్నాయి. 
అయితేఏ దేశంలోనైనాఅన్ని యాజమాన్యాలూ కార్మికుల పట్ల, పర్యావరణం పట్ల పూర్తిస్వచ్చంద బాధ్యత కలిగి ఉంటాయనుకుంటే అది ఉత్తి భ్రమే అవుతుంది.  విద్యావ్యాప్తి, సమాచార హక్కు, ఉన్నంతలో స్వేచ్చ కలిగిన మీడియా, ప్రాధమికహక్కులూ, కోర్టులూ - వీటి మూలంగా చాలా ఇతర దేశాల్లో లేనంత మేరకు అర్థవంతమైన చర్చ జరిగేఅవకాశం మనకున్నది. దురాశనూ, దోపిడినీ నియంత్రించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా  ఉద్యోగులనూ, శ్రామికులనూ సంస్థల్లో భాగస్వాములను చేసే ఆస్కారం ఉన్నది. ఒకమేరకు ఇది జరుగుతున్నది కూడా. ప్రాజెక్టుల మూలంగా నిర్వాసితులైన వారినికూడా (డబ్బు రూపంలో పరిహారం చెల్లించే బదులు)వాటాదారులను చేస్తే భూసేకరణ విజయవంతం కావచ్చు.
ఇప్పుడు కుటుంబరావు గారు గనక కార్మికగీతపు రెండో భాగం రాస్తే - అందులో పెట్టుబడిఎత్తిన కొత్త అవతారాలేకాకుండాస్త్రీల, దళితుల, గిరిజనుల శ్రమ శక్తి, ప్రాంతీయ అసమానతలు, కొత్త మధ్యతరగతి - రంగం మీదకు వస్తాయి.బహుశా పర్యావరణం గూర్చిన చర్చ కూడా వచ్చి చేరుతుంది.రాజగోపాల రావు సూత్రీకరించినట్టు పెట్టుబడి కూడా శ్రమకు మరోరూపం.పెట్టుబడినిజవాబుదారీగానూ, శ్రమను చైతన్యవంతం అయిన భాగస్వామి గానూ, శ్రామికులనూ, సామాన్యులనూ వాటాదార్లుగానూచెయ్యగలిగితేఇకమిగిలే లక్ష్యం:సహజ వనరుల్ని, భూమండలాన్ని కాపాడుకోవడం; అంతేగాని వనరుల్నిహస్తగతం చేసుకోవడం, అధికారం చెలాయించడం, పెత్తనం చెయ్యడం కాదు -అది  ఏ వర్గం, సమూహం తరఫున అయినా, ఏ మహా సిద్ధాంతం పేరున అయినా.  అప్పుడే మనుషులంతా ఒక ప్రపంచాన్ని గెలుచుకుంటారు.
- ఉణుదుర్తి సుధాకర్, 14సెప్టెంబరు 2012